Bhatti Vikramarka : మరో వివాదంలో మంత్రి భట్టి విక్రమార్క !
ఖమ్మంలో రూ.4.50 కోట్లతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణంపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చ.
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పాలకులు రూ.7లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మా ప్రభుత్వంపై మోపి వెళ్లారని.. రాష్ట్ర ఖజనాకు వచ్చే ఆదాయం వడ్డీల పాలవుతుందని.. ఈ పరిస్థితుల్లో ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని..ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతున్నామని తరుచూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెబుతుంటారు. ఎన్నికల హామీల కోసం బీఆర్ఎస్ పాలకుల మాదిరిగానే నెలనెల కొత్త అప్పులు… ప్రభుత్వ భూముల అమ్మకాలను సైతం కాంగ్రెస్ కొనసాగిస్తున్న సంగతి విదితమే. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్, మాజీ ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు, రైతులకు రైతు భరోసా వంటి పథకాలు సైతం సక్రమంగా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం రోజులు నెట్టుకొస్తుంది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు, ఖర్చు చేస్తున్న నిధుల వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతుంది. తాజాగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీసుకున్న ఓ నిర్ణయం ఆయనను విమర్శలు పాలు చేసేదిగా మారింది.
ఖమ్మం జిల్లాలో రూ.4.50 కోట్లతో భట్టి విక్రమార్క కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణం తలపెట్టారు. ఇప్పటికే మధిరలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజా భవన్ వాడుకుంటున్నప్పటికీ, ఖమ్మంలో మరో క్యాంపు కార్యాలయం నిర్మించుకోవడం పట్ల భట్టిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక కోటి రూపాయలతో క్యాంపు కార్యాలయం నిర్మించగా, భట్టి విక్రమార్క మాత్రం రూ.4.50 కోట్ల ప్రజా ధనంతో ప్యాలెస్ లాంటి భవనం నిర్మించుకోవడంపై ఇతర మంత్రులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా తన అడ్డా అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఒక సందేశం ఇచ్చేందుకే ఈ భవనం నిర్మిస్తున్నాడని ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో రచ్చబండ చర్చలు రేగుతున్నాయి. పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి వాటికి నిధులు లేవని చెప్తూనే, తన కోసం విలాసవంతమైన భవనం నిర్మించుకోవడం పట్ల భట్టి తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. భట్టి విక్రమార్కను చూసి ఇతర మంత్రులు తమకు కూడా అలాంటి భవనం కావాలని పట్టుబడితే పరిస్థితి ఏంటని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారని కాంగ్రెసేతర సోషల్ మీడియాలో భట్టి నూతన క్యాంపు కార్యాలయం నిర్మాణ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సింగరేణి నైనీ బ్లాక్ టెండర్ వ్యవహారంతో వివాదంలో చిక్కుకున్న భట్టికి నూతన క్యాంపు కార్యాలయంపై రేగుతున్న రచ్చ మరిన్ని విమర్శల పాలు చేసేదిగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి :
TDR Hyderabad Real Estate | త్రిమూర్తుల చేతుల్లో ‘టీడీఆర్’ బందీ!
Gurugram Corporate Employee | నెల ఖర్చు రూ.2.44 లక్షలా..? ఈ టెకీ బడ్జెట్ చూసి షాకవుతున్న నెటిజన్లు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram