Telangana | తెచ్చిన అప్పులు తెచ్చినట్టే గాయబ్! మూడు నెలల తాజా అప్పు రూ.20,266.09 కోట్లు
Telangana | తెలంగాణ అప్పుల కుప్పగా తయారవుతున్నది. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు, ఎవరికి చెల్లిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తీసుకున్న అప్పులతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదని, కనీసం అసంపూర్తిగా ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసి వినియోగంలోకి తేవడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

తీసుకొచ్చిన రుణాలు ఎక్కడికి పోతున్నాయి?
మూడు నెలల తాజా అప్పు రూ.20,266.09 కోట్లు
బకాయిల చెల్లిపూ లేదు.. కొత్త ప్రాజెక్టులూ లేవు
మొత్తం బాడా కాంట్రాక్టర్లకు చెల్లింపులతో సరి?
చిన్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు మొండిచెయ్యి!
మొత్తం రాష్ట్ర రుణ భారం రూ.4,28,540 కోట్లు
కార్పొరేషన్లు, సంస్థల పేర తీసుకున్నవి అదనం
అప్పుల కుప్పగా తయారవుతున్న తెలంగాణ
హైదరాబాద్, విధాత : తెలంగాణ అప్పుల కుప్పగా తయారవుతున్నది. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు, ఎవరికి చెల్లిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తీసుకున్న అప్పులతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదని, కనీసం అసంపూర్తిగా ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసి వినియోగంలోకి తేవడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, విద్యార్థులకు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జవాబుదారీతనం, బాధ్యత లేకుండా పోయిందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రీయింబర్స్‌మెంట్ చెల్లింపులూ లేవు
కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ‘ఈ ప్రాజెక్టుల వ్యయం చూస్తే కళ్లు తిరిగి కిందపడిపోవడం ఖాయం. మూసీ రివర్ డెవలప్‌మెంట్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రెండో దశకు అవసరమైన నిధులు లేదా కాంట్రిబ్యూషన్ నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారనేది రాష్ట్ర ప్రజలను తొలుస్తున్న ప్రశ్న’ అని ఒక ఆర్థిక నిపుణుడు అన్నారు. పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లింపు పూర్తి చేసి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి బడా ప్రాజెక్టులను ప్రారంభిస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షిస్తారని, కానీ.. ఒకవైపు కాంట్రాక్టర్లు, విద్యార్థులను అర్థాకలితో అలమటించేలా చేసి, ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులను మానసికంగా కుంగదీసి ఏం సాధిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మూడు నెలల్లోనే రూ.20,266.09 కోట్లు
2024–25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అప్పులు రూ.48,322.20 కోట్లు చేయగా, ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే రూ.20,266.09 కోట్లు తీసుకున్నారు. అభివృద్ధి పనుల పేరిట తీసుకుంటున్న ఈ రుణాలకు ఎక్కడికి మళ్లిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నర కాలంలో ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు తీసుకురానప్పుడు ఈ డబ్బులు దారి మళ్లిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బకాయిల చెల్లింపులో ఇంకా నిర్లక్ష్యమే
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర అవుతున్నా బకాయిల చెల్లింపుల్లో ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో పనులు పూర్తి చేసిన చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లను గోస పుచ్చుకుంటున్నదని అంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బాధలు అన్నీ ఇన్నీ కావు. సర్వీసులో ఉన్న ఉద్యోగుల పెండింగ్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. అయితే ఎవరికి డబ్బులు చెల్లిస్తున్నది అంటే బడా బడా కాంట్రాక్టర్లకు, మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసులు చేసిన వారికి మాత్రం ఠక్కున డబ్బులు చెల్లిస్తున్నారు. సర్కార్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు చెల్లించాలి కాబట్టి వారికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయక తప్పడం లేదు. ప్రతి నెలా వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వం, ఆ డబ్బులను ఎవరికి చెల్లిస్తున్నది అనేది అర్థం కాకుండా ఉందని అంటున్నారు. ప్రాధమ్య క్రమంలో చెల్లింపులు చేయకుండా సిఫారసులకు పెద్దపీట వేస్తున్నారని సచివాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
గుడ్డిలో మెల్ల అన్నట్టు రెండేళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.180 కోట్లు రెండు నెలల క్రితం చెల్లించి, గొప్పగా ప్రచారం చేసుకున్నది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నదనే ఆవేదన ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. తమ పెండింగ్ బకాయిలు పిల్లల పెళ్లిళ్లు, కొత్తగా కట్టుకునే ఇళ్లు, హాస్పిటల్ ఖర్చులు తదితరాలకు ఉపయోగపడతాయని ఆశించిన రిటైర్డ్ ఉద్యోగులు భంగపడ్డారు. సర్కార్‌లో నలభై సంవత్సరాలు సర్వీసు చేసి పదవీ విరమణ చేసిన తరువాత బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ 2024 సంవత్సరం మే నెలలో ఇంజినీర్ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉచిత పథకాలకు నిధులు ఎందుకు కేటాయిస్తున్నాని మండిపడ్డారు. ఉద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని హెచ్చరించారు. అయినా ఆర్థిక శాఖ ఎప్పటి మాదిరే వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.
ఇంకా రూ.30వేల కోట్ల పైనే బకాయిలు పెండింగ్
కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటళ్లకు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇలా మొత్తం సుమారు రూ.30వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఉద్యోగుల బకాయిలే రూ.10వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి నెలా రూ.500 కోట్ల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి హామీ ఇచ్చినప్పుడు ఉద్యోగులు చప్పట్లు కొట్టారు. కానీ.. ఇంత వరకు అమలు కావడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు రూ.1,350 కోట్లు, పెద్ద కాంట్రాక్టర్లు రూ.1,100 కోట్లు, నిలిచిన పనులు రూ.1,000 కోట్లు, పాతబస్తీ కాంట్రాక్టర్లు రూ.680 కోట్లు, జీహెచ్ఎంసీ బకాయిలు రూ.1,100 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు రూ.10,000 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ.1,300 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లు రూ.1,000 కోట్లు, ఆరోగ్య శ్రీ హాస్పిటళ్లు రూ.1,590 కోట్లు, బీవరేజేస్ కంపెనీలు రూ.3,900 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు రూ.12.56 కోట్లు, ఆర్ అండ్ బీ, పీఆర్, ఎంఏయూడీ రూ.1,000 కోట్లు, మన ఊరు మన బడి రూ.369 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8,000 కోట్ల వరకు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది. చిన్న తరహా కాంట్రాక్టర్లు బకాయిల వల్ల వారు తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించలేక, కొత్త పనులు చేపట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాలుగైదు నెలల క్రితం సచివాలయంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. అయినా వారికి చెల్లింపులు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ధర్నా చేశారు, ఇంకా ఏమి చేస్తారు అంటూ డిప్యూటీ సీఎం కార్యాలయం ఉద్యోగులు చర్చించుకోవడం శోచనీయం.
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొన్ని నెలల నుంచి బకాయిలు చెల్లించాలని కోరుతూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చుట్టూ తిరుగుతున్నారు. రూ.1,400 కోట్లు వారికి చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడూ అప్పుడూ అంటూ దాటవేస్తూ వస్తున్నారు. దీంతో విసిగిన నెట్‌వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులు ఒక దశలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించారు కూడా. అదే విధంగా జూనియర్ డాక్టర్స్‌కు స్టైపెండ్ సమస్యను పరిష్కరించకపోవడం మూలంగా 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సేవలకు అంతరాయం కలుగుతోంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు.
మూడు నెలల అప్పులే రూ.20,266.09 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం సెక్యురిటీ బాండ్లు విక్రయించడం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, నెలలో రూ.5,230.98 కోట్లు, మే నెల రూ.4,158.92 కోట్లు, జూన్ లో రూ.10,876.19 కోట్లు కలిపి మొత్తం రూ.20,266.09 కోట్ల రుణాలను తీసుకున్నది. ఇలా తీసుకున్న అప్పులతో పాటు వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయంతో చెల్లింపులు ఇలా చేసింది. వడ్డీ చెల్లింపుల కోసం రూ.6,772.85 కోట్లు, జీతాలు రూ.11,608.49 కోట్లు, పింఛన్లు రూ.4,572.92 కోట్లు, సబ్సిడీలు రూ.5,932.92 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.4,755.31 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.52,559.96 కోట్లు.
సర్కార్ లెడ్జర్ అడ్జస్ట్ మెంట్ బిల్లులు
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.28,861 వరకు ఉన్నాయి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ చార్జీలు రూ.14,172 కోట్లు. మెట్రో వాటర్ సప్లయి బోర్డు చార్జీలు రూ.3932 కోట్లు, కేంద్ర పభుత్వ కార్యాలయాలు, సంస్థల బిల్లులు రూ.721 కోట్ల వరకు ఉన్నట్లు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొత్తలో లెక్కలు తేల్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కాళేశ్వరం విద్యుత్ చార్జీల పెండింగ్ బిల్లులు రూ.28,861 కోట్లు, సింగరేణి కాలరీస్ కు రూ.26,000 కోట్లు బకాయి పడ్డారు. ఇందులో బొగ్గు సరఫరా రూ.12వేల కోట్లు, విద్యుత్ సరఫరా బకాయిలు రూ.14వేల కోట్లు ఉన్నాయి. ట్రాన్స్ మిషన్ చార్జీలు రూ.28,673 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.14,193 కోట్లు, ట్రూ అప్ చార్జీలు రూ.14,928, విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.81,516 కోట్లు, ఛత్తీస్‌గఢ్ ఒప్పంద భారం రూ.6,000 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ రూ30,406 కోట్లు. ఉన్నాయి.
ఇదీ ఆర్బీఐ లెక్క
ఆర్బీఐ ప్రకారం తెలంగాణ ప్రభుత్వ అప్పులు (మార్చి 2024 వరకు) రూ.3,89,673 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన గ్యారెంటీ రుణాలు రూ.38,867 కోట్లు, ఇవి రెండి కలిపితే మొత్తం రుణాలు రూ.4,28,540 కోట్లు. ఇవి కాకుండా కార్పొరేషన్లు, సంస్థల పేర్ల మీద తీసుకున్న అప్పులు అదనంగా ఉన్నాయి.
మూడు నెలల అప్పులే రూ.20,266.09 కోట్లు (బాండ్ల విక్రయం ద్వారా)
ఏప్రిల్ : రూ.5,230.98 కోట్లు
మే : రూ.4,158.92 కోట్లు
జూన్ : రూ.10,876.19
మొత్తం రూ.20,266.09 కోట్లు
చెల్లింపులు
వడ్డీ చెల్లింపుల కోసం : రూ.6,772.85 కోట్లు
జీతాలు : రూ.11,608.49 కోట్లు
పింఛన్లు : రూ.4,572.92 కోట్లు
సబ్సిడీలు : రూ.5,932.92 కోట్లు
క్యాపిటల్ వ్యయం : రూ.4,755.31 కోట్లు
రెవెన్యూ వ్యయం : రూ.52,559.96 కోట్లు.
ఇదీ ఆర్బీఐ లెక్క
తెలంగాణ ప్రభుత్వ అప్పులు (మార్చి 2024 వరకు): రూ.3,89,673 కోట్లు.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన గ్యారెంటీ రుణాలు : రూ.38,867 కోట్లు,
మొత్తం : రూ.4,28,540 కోట్లు
(కార్పొరేషన్లు, సంస్థల పేర్ల మీద తీసుకున్న అప్పులు అదనం)
ఇవీ బకాయిలు!
ప్రభుత్వోద్యోగుల బకాయిలు : రూ.10,000 కోట్లు
జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు : రూ.1,350 కోట్లు
పెద్ద కాంట్రాక్టర్లకు : రూ.1,100 కోట్లు,
నిలిచిన పనులకు : రూ.1,000 కోట్లు
పాతబస్తీ కాంట్రాక్టర్లకు : రూ.680 కోట్లు
జీహెచ్ఎంసీ బకాయిలు : రూ.1,100 కోట్లు
గ్రామ పంచాయతీలకు : రూ.1,300 కోట్లు
చిన్న కాంట్రాక్టర్లకు : రూ.1,000 కోట్లు
ఆరోగ్య శ్రీ హాస్పిటళ్లకు : రూ.1,590 కోట్లు
బేవరేజేస్ కంపెనీలకు : రూ.3,900 కోట్లు
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు : రూ.12.56 కోట్లు
ఆర్అండ్ బీ, పీఆర్, ఎంఏయూడీ : రూ.1,000 కోట్లు
మన ఊరు మన బడి : రూ.369 కోట్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్ : రూ.8,000 కోట్లు