• Telugu News
  • /Sports

T20 WC – IND vs USA | టి20 ప్రపంచకప్​లో భారత్​ బోణీ : డిఫెండింగ్​ ఛాంపియన్లను వణికించిన అమెరికా

2026 టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో అజేయంగా నిలిచి అమెరికాపై భారత్‌కు 29 పరుగుల ఘన విజయం అందించాడు. ఒత్తిడిలోనూ భారత్ విజయంతో టైటిల్​ వేట ప్రారంభించింది.

Reported by: ADHARVA | క్రీడలు | Feb 08, 2026, 12:04 am IST
Read Time: 10 mins
T20 WC – IND vs USA | టి20 ప్రపంచకప్​లో భారత్​ బోణీ : డిఫెండింగ్​ ఛాంపియన్లను వణికించిన అమెరికా

Surya to the Rescue: India Escape USA Scare in Opener

సారాంశం

2026 టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో అజేయంగా నిలిచి అమెరికాపై భారత్‌కు 29 పరుగుల ఘన విజయం అందించాడు. మధ్య ఓవర్లలో ఒత్తిడిని ఎదుర్కొని భారత్ విజయంతో టోర్నీలో శుభారంభం చేసింది.

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​: 

T20 WC – IND vs USA | 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రస్థానాన్ని భారత జట్టు విజయంతో ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్​–బి తొలి లీగ్ మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 29 పరుగుల తేడాతో గెలిచి టైటిల్  వేట ప్రారంభించింది. అమెరికా బౌలింగ్‌తో భారత్‌ను గట్టిగానే వణికించినప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృడసంకల్పం భారత్​ను ప్రమాదం నుంచి గట్టెక్కించింది.

ఆరంభం నుంచే గడగడలాడించిన అమెరికా

భారత్‌పై ఒత్తిడి పెంచిన అమెరికా… వరుస వికెట్లతో మ్యాచ్‌ను ఉత్కంఠభరితం చేసిన క్షణం

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అమెరికా బౌలింగ్​ ధాటికి బెంబేలెత్తిన టీమిండియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. అభిషేక్ శర్మ మొదటి బంతికే ఔటవ్వగా, ఇషాన్ కిషన్(20), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(0) వరుసగా వెనుదిరిగారు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 46/4గా నిలిచింది. ఆ తర్వాత రింకూ సింగ్(6), హార్దిక్ పాండ్యా(5) కూడా విఫలమవడంతో 12.4 ఓవర్లలో స్కోరు 77/6గా మారింది. ఈ దశలో భారత్‌కు పరాభవం తప్పదనే అనిపించింది.

సూర్యకుమార్​ కెప్టెన్​ ఇన్నింగ్స్​ : పట్టుదలకు మరో పేరు

ఒత్తిడిలోనూ వెనకడుగు వేయని సూర్య… అమెరికా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్​ యాదవ్​ బాధ్యతను భుజాలపై వేసుకుని ఒంటిచేత్తో  ఇన్నింగ్స్​ను నడిపించాడు. ఒక్కొక్కరుగా సహచరులు వెనుదిరుగుతున్నా, సూర్య మాత్రం పట్టుదలగ ఆడాడు. బంతులను  జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ, అవసరమైనప్పుడు బౌండరీలు సాధిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 36 బంతుల్లో అర్ధశతకం సాధించిన సూర్య, చివరి ఓవర్లలో గేర్ మార్చి దూకుడు పెంచాడు. చివరి ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్, సిక్స్, ఫోర్ బాదడంతో భారత్ స్కోరు 160 దాటింది. సూర్య 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు పెట్టని గోడలా నిలిచాడు. అక్షర్ పటేల్ కూడా కీలక సమయంలో 14 పరుగులు చేసి సహకరించాడు. 150 పరుగులు కూడా గగనమనుకున్న పరిస్థితి నుండి సూర్య చలవతో గట్టెక్కిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగుల గౌరవప్రదమైన చేసింది.

భారత బౌలర్ల దూకుడు : తట్టుకోలేకపోయిన అమెరికా

కాగా, 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టును భారత బౌలర్లు మొదటి నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. అర్షదీప్​ సింగ్​ తన పదునైన స్వింగ్‌తో టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టి, కెప్టెన్​ మోనాంక్​ పటేల్​ను డగౌట్​కు చేర్చగా,  సిరాజ్​ ఓపెనర్ల వికెట్లతో దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో అమెరికా 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే ఎదురైన దెబ్బల నుంచి ఆ జట్టు ఇక కోలుకోలేకపోయింది. మధ్యలో మిలింద్ కుమార్ 34 పరుగులు, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులతో పోరాడినా, భారత బౌలింగ్ దాడిని ఎక్కువసేపు తట్టుకోలేకపోయారు. వరుణ్​ చక్రవర్తి, అక్షర్ పటేల్ కీలక సమయంలో వికెట్లు తీసి అమెరికా గెలుపు వైపు చూడకుండా చేసారు. చివరకు అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

అమెరికా జట్టు పోరాటం అసాధారణం

USA cricket team displays inspirational fight vs India at T20 World Cup

ఈ మ్యాచ్​లో అమెరికా జట్టు చూపిన పోరాట పటిమ అసాధారణంగా ఉంది. తదుపరి మ్యాచ్​లలో వారు ఇతర జట్లపై గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. కెప్టెన్​ మోనాంక్​ పట్టుదల, బౌలింగ్, ఫీల్డింగ్​ విభాగాల్లో చూపిన తెగువ మెచ్చుకోదగింది. ముఖ్యంగా భారత్​ పవర్​ ప్లేలో ఫీల్డ్​ ప్లేస్​మెంట్​ అద్భుతంగా ఉంది. భారత బ్యాటర్లు పరుగులు తీయడానికే భయపడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అమెరికా అంటే ఇండియ–2 అనుకోవచ్చు. దాదాపు అందరు ఆటగాళ్లు భారత సంతతికి చెందినవారే కాకుండా, ఇక్కడే క్రికెట్​ ఆడటం, కోచింగ్ తీసుకోవడం చేసారు. వారిలో చాలామందికి మన వారితో ఆడిన అనుభవముంది.

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జస్​ప్రీత్​ బుమ్రా అనారోగ్య కారణంగా దూరమవగా, సంజూ శాంసన్​ను తుదిజట్టు నుంచి తప్పించారు. బుమ్రా స్థానంలో సిరాజ్‌ను జట్టులోకి తీసుకోగా, ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కొనసాగారు. స్పిన్ విభాగాన్ని వరుణ్, అక్షర్ పంచుకున్నారు.

మొత్తంగా చూస్తే, టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ భారాన్నంతటినీ కెప్టెన్​ సూర్య తన భుజస్కంధాలపై మోసిన తీరు, అతని ఆత్మవిశ్వాసంతో కూడిన బ్యాటింగ్ వల్లే భారత్‌కు విజయం దక్కింది. బౌలర్ల సమష్టి ప్రదర్శన కూడా ఈ గెలుపుకు బలమైన పునాది వేసింది. ప్రపంచకప్ ఆరంభంలోనే వచ్చిన ఈ హెచ్చరిక, తదుపరి మ్యాచ్‌లకు భారత జట్టు ఎలా సన్నద్ధంగా ఉండాలో నేర్పించింది.

ఈరోజు జరిగిన మరో రెండు మ్యాచ్​లలో పాకిస్థాన్​, వెస్టిండీస్​ జట్టు తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించాయి.

West Indies and Pakistan batsmen in action during T20 World Cup 2026 matches

పాకిస్తాన్ vs నెదర్లాండ్స్

గ్రూప్ Aలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్​ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నెదర్లాండ్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఒత్తిడికి లోనై ఓటమి దిశగా పయనించిన వేళ, ఫహీమ్​ అష్రఫ్​ కీలక పాత్ర పోషించాడు. 11 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించాడు. చివరి ఓవర్లలో అతడి దూకుడు బ్యాటింగ్ వల్లే పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. దీంతో టోర్నీలో పాకిస్తాన్ శుభారంభం చేసింది.

వెస్టిండీస్ vs స్కాట్లాండ్

గ్రూప్ Cలో  స్కాట్లాండ్​తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్​ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి స్కాట్లాండ్‌కు కఠిన లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్కాంట్లాండ్​ జట్టు  విండీస్​ బౌలింగ్ ఒత్తిడిని తట్టుకోలేక 147 పరుగులకే కుప్పకూలింది.