తెలంగాణ సర్కారు కుల సర్వేలో ‘విశ్వకర్మ’ల విచిత్ర పరిస్థితి
వృత్తులు వేరైనా.. ఆ ఐదు కులాలు ఒక్కటే.. అదే విశ్వకర్మ! కానీ.. తెలంగాణ ప్రభుత్వం వారిని విడదీసి చూపడంలో వారి సంఖ్యాబలం తక్కువగా కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి వారి రాజకీయా, ఆర్థిక ప్రయోజనాలకు గండికొట్టే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- ఒకే కులమైనప్పటికీ ఐదు వృత్తుల వారిని వేర్వేరుగా సర్వే
- ప్రభుత్వ ప్రాధమ్యాల్లో నష్టం వాటిల్లుందని ఆందోళన
- జనాభా బలం తగ్గించి చూపడం వల్ల తగ్గనున్న ప్రాధాన్యం
- విశ్వకర్మల్లోని అనైక్యతే ప్రధాన కారణమని తీవ్ర విమర్శలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పకడ్బందీగా, ప్రణాళికబద్ధంగా చేపట్టామని చెబుతున్న ‘సర్వే’లో విశ్వకర్మల పరిస్థితి విచిత్రంగా మారింది. ఒకప్పుడు గ్రామీణ వ్యవస్థల్లో ప్రధాన పాత్ర పోషించిన ఐదు వృత్తులను నిర్వహిస్తూ వేర్వేరు కులాలుగా కనిపించినా ఒకే కులంగా కొనసాగే ఈ విశ్వకర్మలను కాలక్రమంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశ్వకర్మలుగా, విశ్వబ్రాహ్మణులుగా పిలిచే ఒకే కులంలో కమ్మరి, కంచరి, కంసాలి, వడ్రంగి, కాశి.. కలిసి ఉంటారు. అంబేద్కర్ నిర్వహించిన కుల నిర్వచనం ప్రకారం ఈ ఐదు వృత్తులు నిర్వహించే వారి మధ్య అనాదిగా ‘కంచం పొత్తు, మంచం పొత్తు’ కొనసాగుతూ వస్తోంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఈ ఐదు వృత్తులను ఎంచుకునే సందర్భాలూ ఉంటాయి. అయితే ఈ ఐదు వృత్తులు చేపట్టే వారి మధ్య చిన్న, చిన్న అంతరాలకు సంబంధించిన తేడాలున్నప్పటికీ వీరంతా విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులుగా చిరపరిచితులుగా ఉన్నారు.
ఇనుము సంబంధిత వస్తువులు, పనులు చేసే వారు కమ్మరి, ఇత్తడి, అల్యూమినియం తదితర లోహ వస్తువులు, పనిచేసే వారు కంచరి, కర్రపని చేసే వారు వడ్రంగి లేదా వడ్ల, బంగారు, వెండి తదితర ఆభరణాలు చేసేవారిని కంసాలి, అవుసల, దేవతావిగ్రహాలు చెక్కడం, గుడి నిర్మాణంలో కీలక పాత్రపోషించే స్థపతులు కాశి లేదా శిల్పులుగా కొనసాగుతున్నారు. ఈ ఐదు వృత్తులవారిని కలిపి విశ్వకర్మలు లేదా విశ్వబ్రాహ్మణులుగా పేర్కొంటారు. వేర్వేరు పనులు వేర్వేరుగా, కలిసి కూడా చేస్తుంటారు. కమ్మరి, వడ్రింగి పనులు ఒక్కరే నిర్వహించే సందర్భాలుంటాయి. సాధారణ పరిభాషలో వేర్వరు కులాలుగా పిలిచినా వీరంతా ఒక్కటిగానే కొనసాగుతుంటారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ ఒకటిగా ఉంటాయి. కలిసే నిర్వహించుకుంటారు. విచిత్రమేమిటంటే విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘాల పరిధిలోనే కలిసే ఉంటున్న సందర్భాలు ఎక్కుగా ఉంటాయి. ఒకటి, అరా సందర్భాల్లో ఆయా వృత్తుల సమస్యలపై ఉన్న సంఘాలు స్పందిస్తుంటాయి. ఉదాహరణకు.. స్వర్ణకార సంఘం లాంటివి బంగారం, వెండిపనులు చేసే వారి కోసం పనిచేస్తుంటాయి.
ఒకప్పుడు గ్రామీణ వ్యవస్థలో కీలకం
ఈ విశ్వకర్మల పాత్రలేకుండా గ్రామీణ వ్యవస్థ ఒక్క పూట ముందుకు సాగని పరిస్థితి నుంచి ఇప్పుడు ఎందుకు కొరగాని కులంగా మారిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. బీసీలుగా ఉన్నప్పటికీ సామాజికంగా కాసింత గౌరవాన్ని కలిగివున్నా.. ఆర్ధికంగా, రాజకీయంగా విశ్వకర్మల పరిస్థితి అత్యంత దయనీయమని చెప్పొచ్చు. రాజకీయంగా మొత్తం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇద్దరో, ముగ్గురికో ప్రాతినిధ్యం లభించి ఉంటోంది.
సర్కారు సర్వేలో వేర్వేరుగా నమోదు
ముఖ్యంగా సర్వేలో ప్రభుత్వం అనుసరించిన విధానం విశ్వకర్మల్లోని అనైక్యత, అసమానతలను వెలికితీయగా వారి జనాభాను తక్కువగా చూపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ కులానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించడంలో జరిగిన అవగాహన లోపం వారికి రావాల్సిన వాటా, హక్కులను కోల్పోయే దుస్థితికి చేర్చిందంటున్నారు. దీనికి ప్రభుత్వంలోని సంబంధిత అధికారుల తీరు ఒక కారణమైతే, వారికి ఊతమిచ్చే విధంగా భౌతికంగా వేర్వేరుగా కనిపించడం మరో కారణంగా భావిస్తున్నారు

విభజన వల్ల బలం తగ్గే ప్రమాదం
ఈ ఐదు వృత్తులు (కులాలు) నిర్వహించే ఒకే కులమైన విశ్వకర్మలను వేర్వేరుగా సర్వే నిర్వహించడంతో ఈ కులం బలం తగ్గిపోయింది. ఈ కారణంగా ప్రభుత్వ ప్రాధాన్యం, సామాజికంగా, సంక్షేమ, ఆర్ధిక పథకాలు, రాజకీయ ప్రాధాన్యం కల్పించే సమయంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి పురోభివృద్ధికి నిర్వహించే కార్పొరేషన్ల ఏర్పాటులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సర్వేలు చూపినట్లు ఈ ఐదు కులాలకు సంబంధించిన సీబీఐ స్కోరులో కొంత వ్యత్యాసమున్నట్లు కనిపిస్తోంది. దీని పరిష్కారం కోసం ఆయా వృత్తులకు చేయూతనిచ్చే సందర్భంలో ప్రాధాన్యం కల్పించడంలో తప్పులేదు. కానీ, ఒక కులంగా పొందుపరచకపోవడంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్వకర్మ సంఘాలు ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
ఈ ఐదు వృత్తులను కలిపి లెక్కిస్తే జనభా ప్రకారం 8,40,083 మంది ఉన్నట్లు తేలుతోంది. మొత్తం జనాభాలో 2.35 శాతానికి చేరుకుని ఒక బలమైన శక్తిగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకత్వం, పార్టీలు సహజంగానే అనుసరించే కులబలాల ప్రకారం నిర్ణయాత్మకమైన కులంగా భావించే అవకాశం ఉంటోంది. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఈ కులానికి లభిస్తాయనడంలో సందేహంలేదు. లేకుంటే ఈ వేర్వేరు లెక్కలతో రాజకీయ పక్షాలు లెక్కచేయని పరిస్థితి ఉండే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికైనా సర్వే వేర్వేరుగా నిర్వహించిన ఈ ఐదు వృత్తులు (కులాల)ను కలిపి భవిష్యత్ సంక్షేమ, ఆర్ధిక, రాజకీయ ప్రాధాన్యతలు కల్పించాలని విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
సర్వేలో ద్వంద్వ ప్రమాణాలు
విశ్వకర్మల్లోని ఐదు వృత్తుల వారిని వేర్వేరు కులాలుగా వర్గీకరించిన ప్రభుత్వం.. మరో కులం విషయంలో మాత్రం దీనికి భిన్నమైన పద్ధతిని అనుసరించడం విమర్శలకు తావిస్తోంది. బీసీ ఏ లోని అగ్నికుల క్షత్రియ పేరుతో ఉన్న వారిలో అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజె, బెస్త, జాలరి, గంగావర్, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ (వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లెకాపు, పల్లిరెడ్డి) నెయ్యాల, పట్టపు వారిని ఒకే జాబితాలో చేర్చడం గమనార్హం. వీరి జనాభా, జనాభా శాతం, సీబీఐ ఒక్కటిగానే నిర్వహించారు. ఆ ప్రకారం ఒకే కులంగా ఉన్న విశ్వకర్మలను వేర్వేరుగా పొందుపరచడంలో ఔచిత్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సర్వేలో వేర్వేరుగా చేసిన లెక్కల్లో ఒక్కటిగా చేయాలని విశ్వకర్మ సంఘాలు కోరుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికైనా విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘాలు ఈ ఐదు వృత్తులకు జరిగే అన్యాయం, సమస్యల పై కలిసి మెలిసి పనిచేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అకస్మాత్తుగా సర్వర్ల డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. శనివారం నుంచి యథాతథంగా..
బెదిరిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ !
Anna Konidela | పవన్ పక్కన ఉంది నేను కాదు.. తాను తీన్‌మార్ సినిమాలో ఎక్కడ ఉందో చెప్పిన అన్నా కొణిదెల
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram