అకస్మాత్తుగా సర్వర్ల డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. శనివారం నుంచి యథాతథంగా..
అనేక రూపాల్లో భూభారతి పోర్టల్‌పై ఒత్తిడి పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం సర్వర్లు మొరాయించాయి. దీంతో భూముల విక్రేతలు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం నుంచి యథాతథంగా రిజిస్ట్రేషన్లు ఉంటాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
విధాత, హైదరాబాద్:
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సర్వర్లపై ఒత్తిడి పెరిగి మొరాయించడంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, సాక్షులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రందాకా వేచిచూసి, ఇంటి ముఖం పట్టారు. నేషనల్ ఇన్ఫార్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ)కి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్టేట్ డేటా సెంటర్ చేసిన మార్పు మూలంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయని తెలుస్తున్నది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ కార్యాలయం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. నాలుగైదు టీములు కలిసి పనిచేయడంతో సర్వర్లు శుక్రవారం రాత్రి నుంచి పనిచేస్తున్నాయని, శనివారం నుంచి తిరిగి యథాతథంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఒక అధికారి తెలిపారు. శుక్రవారం స్లాట్ బుక్ చేసుకున్న వారికి శనివారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఆదాయం తెస్తున్న ప్రభుత్వ విభాగాలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం ఒకటి. మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 570 తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ఏ ఒక్క రోజు పనిచేయకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ రోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతుంది. సగటున ప్రతి రోజు రూ.50 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ప్రతి నెలా రూ.400 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నది.
ఈ మధ్యకాలంలో తరచూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్లు పనిచేయడం లేదని, నెట్ వర్క్ ఫెయిల్ అయిందని, డాక్యుమెంట్లను స్వీకరించడం లేదనే సమాధానాలు సబ్ రిజిస్ట్రార్లల నుంచి విన్పిస్తున్నది. గత మార్చి నెలలో సర్వర్ లో సమస్యలు తలెత్తడంతో నత్తనడకన భూభారతి సేవలు కొనసాగాయి.
సర్వర్లపై ఒత్తిడి
రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది రాష్ట్రంలో వేలాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తేనే కొనుగోలుదారుడికి ఆస్తి దక్కుతుంది, విక్రయదారుడి చేతికి డబ్బులు అందుతాయి. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని గత ప్రభుత్వంలో పనిచేసిన రిజిస్ట్రేషన్ విభాగం ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం మూలంగానే ఈ దుస్థితి అని అంటున్నారు. శుక్రవారం ఉదయం ఒత్తిడి పెరగడంతో ఒక్కసారిగా సర్వర్లు పనిచేయకుండా కుప్పకూలిపోయాయి. పలు కార్యాలయాల నుంచి వరుసగా ఫోన్లు రావడంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సమస్య పరిష్కారం కోసం నాలుగైదు సాంకేతిక టీమ్ లను ఏర్పాటు చేశారు. మొత్తానికి శుక్రవారం రాత్రి సర్వర్ల సమస్య పరిష్కారం కావడం, ఆధునీకరించడం కూడా జరిగిపోయిందని ఒక అధికారి తెలిపారు. శనివారం నాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని, శుక్రవారం స్లాట్ బుక్ చేసుకున్నవారు శనివారం నాడు తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
పాత సర్వర్లను ఆధునీకరించని గత పాలకులు
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రిజిస్ట్రేషన్లు, డిమాండ్ కు అనుగుణంగా సర్వర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు సాంకేతిక సమస్యలను గాలికి వదిలివేశారు. సర్వర్లపై పని ఒత్తిడి పెరిగిందని, ఆధునీకరించాలని ఉన్నతాధికారులు పలుమార్లు ప్రతిపాదనలు పంపించినప్పటికీ పరిష్కరించకుండా బుట్టదాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సర్వర్లపై పెరిగిన ఒత్తిడిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంతో శుక్రవారం ఉదయం సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ఫలితంగా అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు ఆగిపోయాయి. 2002 లో ప్రతి సంవత్సరం 3 లక్షల వరకు లావాదేవీలు జరగ్గా, గత ఏడాది 17 లక్షల వరకు లావాదేవీలు జరిగాయి. ఇదే కాకుండా విచారణ కోసం ప్రతి ఒక్కరు పోర్టల్‌ను హిట్ చేయడం మూలంగా భారం పెరుగుతోంది. చిట్ ఫండ్ యజమానులు, వివాహ రిజిస్ట్రేషన్, స్థిరాస్థుల రిజిస్ట్రేషన్, ఈసీ, భూముల విలువలు తెలుసుకునేందుకు ఇలా పలువురు పోర్టల్‌ను క్లిక్ చేస్తుంటారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒత్తిడి, లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని సర్వర్లను ఆధునీకరిస్తే ఇంత సమస్య ఉండేది కాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram