తెలంగాణలో 92,000 ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించి ఈ నెల 5 నుంచి అమల్లోకి తెస్తుంది. ప్రభుత్వ నిర్ణయంలో ఔటర్ రింగ్ రోడ్(ORR) లోపల, శంషాబాద్, కోకాపేట లాంటి చోట్ల 50-100% వరకు పెంపుతో ఏటా రూ.1,200 కోట్ల అదనపు ఆదాయం రానుందని రెవెన్యూ వర్గాలు లెక్కలు వేశాయి.
రియల్ రంగానికి కొత్త జోష్
ఇప్పటికే రాయదుర్గంలో ఎకరం రూ.237కోట్ల ధర పలకడం, రావిర్యాలలో సైతం గజం 80వేలకు పైగా పలకడంతో చాల రోజుల తర్వాతా నగరంలో రియల్ బూమ్ రెక్కలు విప్పుకున్నట్లయ్యింది. రాయదుర్గంలో మొత్తం రెండు విడతల్లో కలిపి కేవలం 11.38 ఎకరాలు వేలం వేస్తే.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 2,500 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు ఇక్కడే ఆఫీస్ స్పేస్ కావాలని పోటీ పడుతుండటంతో రాయదుర్గం, నార్సింగి ఏరియాలు ఇప్పుడు మోస్ట్ కాస్ట్ లీయెస్ట్ ప్లేసెస్ గా మారిపోయాయి.
హకీంపేటలో అప్సెట్ ప్రైస్ రూ. 99 కోట్లు
మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి హెచ్ఎండీఏ కూడా తన ల్యాండ్స్ కనీస ధరలను భారీగా పెంచేసింది. షేక్‌పేట్ మండలం హకీంపేట గ్రామంలోని 8 ఎకరాల 24 కుంటల ప్రైమ్ ల్యాండ్‌కు ఎకరం కనీస ధరను రికార్డు స్థాయిలో రూ. 99 కోట్లుగా ఫిక్స్ చేశారు. అంటే వేలం మొదలవ్వడమే దాదాపు రూ. 851 కోట్ల బేస్ ప్రైస్‌తో స్టార్ట్ అవుతుందన్నమాట.
వేలంలో ఈ భూమి ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా రాబట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇది కాకుండా శంకర్‌పల్లి, మేడ్చల్, శేరిలింగంపల్లి ఏరియాల్లో ఉన్న ఖాళీ భూములను కూడా వేలం వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటి ద్వారా మరో రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
త్వరలో మరిన్ని భూముల వేలం
హెచ్ఎండీఏ వెబ్‌సైట్ ప్రకారం త్వరలో వేలానికి రాబోతున్న ప్లాట్ల కనీస ధరలు వివరాలు చూస్తే..శంకర్‌పల్లి (మోకిల లేఅవుట్): 100 ప్లాట్లు (300 – 500 చ.గజాలు) – కనీస ధర గజానికి రూ. 50,000గా ఉంది. మేడ్చల్ (మేడిపల్లి లేఅవుట్): 68 ప్లాట్లు (231 – 643 చ.గజాలు) – కనీస ధర గజానికి రూ. 45,000 ఉంది. చందానగర్: 484 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 60,000 ఉంది. నార్సింగి: 5,687 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 45,000గా ఉంది. కూకట్‌పల్లి/సూరారం: 4,840 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 60,000గా ఉంది. పీర్జాదిగూడ: 2,057 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 40,000గా ఉంది.
భూముల విలువ పెంపుతో మరింత బూస్ట్
దీనికి తోడు ప్రభుత్వం తాజాగా భూముల విలువ పెంచడంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి, ఎగువ వర్గాల స్థిరాస్తి లావాదేవీలు, నిర్మాణ రంగం ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. హెచ్ఎండీఏ (HMDA) కూడా భారీ లేఅవుట్లతో వేలానికి ప్లాన్ చేస్తోంది. సిటీ చుట్టుపక్కల మౌలిక వసతులను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఓఆర్ఆర్ రావిర్యాల నుంచి ఆమన్‌గల్లు వరకు నాలుగు లైన్లలో గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నారు. ఇది నగరాన్ని నేరుగా రాబోయే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో కనెక్ట్ చేయనుంది. బుద్వేల్ దగ్గర సిద్ధమవుతున్న భారీ లేఅవుట్‌ను ఔటర్ రింగ్ రోడ్డుతో కలపడానికి ఒక భారీ ఇంటర్‌ఛేంజ్ ట్రంపెట్‌ను కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ కనెక్టివిటీ చూస్తుంటే ఫ్యూచర్ సిటీ రూపంలో మరో మెగా సిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ రియల్ బూమ్ ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో సరికొత్త ఆధునిక భాగ్యనగరాన్ని మనం చూడవచ్చంటున్నారు నిపుణులు.
ఐటీ కారిడార్ లో పెరిగిన ఇళ్ల ధరలు
హైదరాబాద్ IT కారిడార్‌లో అద్దెలు 10-20% పెరగడంతో 2BHK ధరలు గరిష్టంగా రూ. వేలకు, ప్రీమియం ఇళ్లు రూ.70 వేలకు చేరినట్లుగా తెలుస్తుంది. పెరిగిన అద్దెల భారం, రోజువారి జీవన వ్యయం నేపథ్యంలో సొంతిల్లు దిశగా జనాన్ని ఆలోచింపచేస్తుందని రియల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే నిర్మాణ రంగం ఊపందుకోవచ్చని రియల్టర్లు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నట్లయితే..దాని ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూముల ధరల పెంపుకు దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.