హెచ్‌ఎండీఏ మెగా ఈ-వేలం.. హకీంపేటలో ఎకరం రూ.99 కోట్లు, మోకిల–మేడిపల్లిలో ప్లాట్లు
హెచ్‌ఎండీఏ హైదరాబాద్ పరిసరాల్లో ప్రీమియం భూములు, ప్లాట్ల ఈ-వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది. హకీంపేటలో ఎకరానికి రూ.99 కోట్ల అప్‌సెట్ ధర, మోకిల–మేడిపల్లిలో వందలాది నివాస ప్లాట్లు వేలానికి రానున్నాయి.
హైదరాబాద్ ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ప్రభావంతో నగర శివారు ప్రాంతాల్లో భూముల విలువలు పెరుగుతున్నాయి.
HMDA e-Auction 2026: Hakeempet Land at ₹99 Crore Per Acre, Mokila and Medipally Plots Up for Sale
విధాత సిటీ డెస్క్ | మే 22, 2026:
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరోసారి భారీ ఊపు ఇచ్చేలా హెచ్‌ఎండీఏ మెగా ఈ-వేలానికి సిద్ధమైంది. నగర శివార్లు, వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రోత్ కారిడార్లలోని ప్రీమియం భూములు, నివాస ప్లాట్లు, అక్కడక్కడ ఉన్న బిట్లను వేలం ద్వారా విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. హకీంపేటలో ఎకరానికి రూ.99 కోట్ల అప్‌సెట్ ధర నిర్ణయించడం ఈ వేలంలో సంచలనంగా మారింది. మోకిల, మేడిపల్లి లేఅవుట్లలో గృహనిర్మాణ ప్లాట్లు కూడా వేలానికి రానుండటంతో పెట్టుబడిదారులు, ఇండ్లు కట్టుకోవాలనుకునే వారి దృష్టి ఈ వేలంపైనే నిలిచింది.
హకీంపేటలో రూ.99 కోట్ల ఎకరం.. మోకిలలో 100 ప్లాట్లు

మోకిల లేఅవుట్‌లో నివాస ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది.
హెచ్‌ఎండీఏ తాజా వేలంలో అత్యంత విలువైన భూమి హకీంపేట ప్రాంతంలో ఉంది. షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 102/1, టీఎస్ నంబర్ 1/P, 3/Pలో 8.24 ఎకరాల భూమిని వేలానికి ఉంచారు. ఈ భూమికి ఎకరానికి రూ.99 కోట్ల అప్‌సెట్ ధరను ఖరారు చేశారు. ఈ ఒక్క ప్యాకెట్‌కు ముందస్తు ధరావత్తు(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ను రూ.5 కోట్లుగా నిర్ణయించారు.
జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటంతో హకీంపేట–షేక్‌పేట ప్రాంతానికి రియల్ ఎస్టేట్ వర్గాల్లో భారీ డిమాండ్ ఉంది. అందుకే ఈ వేలంలో హకీంపేట భూమికి భారీ పోటీ ఉండే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే వేలంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల లేఅవుట్‌లో 100 నివాస ప్లాట్లను కూడా విక్రయించనున్నారు. ఈ ప్లాట్లు 300 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల మధ్య ఉన్నాయి. మోకిల ప్లాట్లకు చదరపు గజానికి రూ.50 వేల అప్‌సెట్ ధరగా నిర్ణయించారు. కోకాపేట, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్, శంకర్‌పల్లి గ్రోత్ కారిడార్ ప్రభావంతో మోకిల ప్రాంతం ఇటీవలి కాలంలో ప్లాట్ల అభివృద్ధికి హాట్‌స్పాట్‌గా మారింది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి లేఅవుట్‌లోనూ 68 నివాస ప్లాట్లు వేలానికి రానున్నాయి. ఇవి 231.66 చదరపు గజాల నుంచి 643.22 చదరపు గజాల వరకు ఉన్నాయి. మేడిపల్లి ప్లాట్లకు చదరపు గజానికి రూ.45 వేల అప్‌సెట్ ధరను నిర్ణయించారు. ఉప్పల్, వరంగల్ హైవే కారిడార్, మెట్రో కనెక్టివిటీ, నివాసప్రాంత విస్తరణలతో తూర్పు హైదరాబాద్ పరిసరాల భూముల విలువలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మేడిపల్లి ప్లాట్లకు కూడా మంచి స్పందన రావొచ్చని భావిస్తున్నారు.
నార్సింగి నుంచి పీర్జాదిగూడ వరకు విడివిడి ప్లాట్లు కూడా..
హెచ్‌ఎండీఏ ఈసారి కేవలం పెద్ద భూములు, లేఅవుట్ ప్లాట్లకే పరిమితం కాలేదు. నగర పరిసరాల్లోని పలు కీలక ప్రాంతాల్లో విడివిడి ప్లాట్లు(స్ట్రే బిట్స్)ను కూడా ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. చందానగర్, బైరాగిగూడ, నార్సింగి, బౌరంపేట, సూరారం, పీర్జాదిగూడ ప్రాంతాల్లోని భూభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ బిట్స్‌కు చదరపు గజానికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు అప్‌సెట్ ధరలు నిర్ణయించారు. నార్సింగిలో 5,687 చదరపు గజాలు, సూరారంలో 4,840 చదరపు గజాలు, బైరాగిగూడలో 2,420 చదరపు గజాల పెద్ద భూభాగాలు వేలానికి రానున్నాయి. నార్సింగి, గండిపేట, చందానగర్ వంటి ప్రాంతాలకు ఇప్పటికే భారీ నివాస, వాణిజ్య డిమాండ్ ఉండటంతో వీటిపై కూడా బిల్డర్లు, డెవవపర్ల ఆసక్తి ఎక్కువగా ఉండొచ్చు.
వేలం ప్రక్రియ అధికారిక ఎంఎస్‌టీసీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరగనుంది. స్ట్రే బిట్స్‌కు రిజిస్ట్రేషన్ గడువు జూన్ 15, హకీంపేట భూమికి జూన్ 17, మేడిపల్లి లేఅవుట్‌కు జూన్ 22, మోకిల లేఅవుట్‌కు జూన్ 27గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఫీజును జీఎస్టీతో కలిపి రూ.1,180గా ఖరారు చేశారు.
హెచ్‌ఎండీఏ ప్లాట్లకు మంచి ఆదరణ

హైదరాబాద్ శివార్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మోకిల–షాబాద్ ప్రాంతాలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది.
హెచ్‌ఎండీఏ వేలాలు గత కొన్నేళ్లుగా పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కోకాపేట, మోకిల, నియోపోలిస్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో గత వేలాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చాయి. స్పష్టమైన టైటిల్, ఆమోదిత లేఅవుట్లు, ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతులు, రోడ్డు కనెక్టివిటీ, లిటిగేషన్ రిస్క్ లేకపోవడం వంటి అంశాల కారణంగా హెచ్‌ఎండీఏ ప్లాట్లపై కొనుగోలుదారుల్లో ప్రత్యేక నమ్మకం ఉంది.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్లాటెడ్ డెవలప్‌మెంట్లు, విల్లాలు, లగ్జరీ హౌసింగ్, కమర్షియల్ పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ వేలం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా నార్సింగి, గండిపేట, మోకిల, శంకర్‌పల్లి, మేడిపల్లి ప్రాంతాలు భవిష్యత్ పెట్టుబడి కారిడార్లుగా ఎదుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్‌ఎండీఏ వేలం ప్రభుత్వానికి భారీ ఆదాయం తీసుకురావడమే కాకుండా హైదరాబాద్ విస్తరణ దిశను కూడా మరోసారి స్పష్టంగా ప్రదర్శించనుంది.
హకీంపేటలో ఎకరానికి రూ.99 కోట్ల అప్‌సెట్ ధర నుంచి మోకిల, మేడిపల్లి నివాస ప్లాట్ల వరకు.. హెచ్‌ఎండీఏ తాజా వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి వేగాన్ని మరోసారి చాటుతోంది. నగర విస్తరణ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఐటీ కారిడార్ ప్రభావంతో ఈ వేలాలకు మంచి స్పందన వచ్చే అవకాశముంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram