Modi | మోదీ గుడ్‌న్యూస్‌: వృత్తిదారులకు లక్ష రుణం.. పలు రైల్వై లైన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

Modi | Union Cabinet | తెలంగాణలో పలు రైల్వే లైన్ల విస్తరణ..! న్యూఢిల్లీ : ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విశ్వకర్మ యోజనకు మరుసటి రోజే కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సంప్రదాయ నైపుణ్యాలతో వృత్తులు చేసుకునేవారికి ఈ పథకం కింద ఐదు శాతం వడ్డీకే లక్ష రూపాయలు రుణంగా ఇస్తారు. మరోవైపు దేశంలోని వంద నగరాల్లో పదివేల కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు ఈ-బస్‌, డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలకు గ్రీన్‌ […]

  • By: Somu    latest    Aug 16, 2023 10:58 AM IST
Modi | మోదీ గుడ్‌న్యూస్‌: వృత్తిదారులకు లక్ష రుణం.. పలు రైల్వై లైన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

Modi | Union Cabinet |

  • తెలంగాణలో పలు రైల్వే లైన్ల విస్తరణ..!

న్యూఢిల్లీ : ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విశ్వకర్మ యోజనకు మరుసటి రోజే కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సంప్రదాయ నైపుణ్యాలతో వృత్తులు చేసుకునేవారికి ఈ పథకం కింద ఐదు శాతం వడ్డీకే లక్ష రూపాయలు రుణంగా ఇస్తారు. మరోవైపు దేశంలోని వంద నగరాల్లో పదివేల కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు ఈ-బస్‌, డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రక్యాబినెట్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఆ వివరాలను కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్విని వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

13వేల కోట్లతో పీఎం విశ్వకర్మ

పీఎం విశ్వకర్మ యోజన కోసం 13వేల కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ పథకం కింద వృత్తిదారులకు ఐదు శాతం వడ్డీపై లక్ష వరకూ రుణం ఇస్తారు. ఇది మొదటి దఫా. రెండో దఫాలో ఐదు శాతం వడ్డీపై రెండు లక్షల వరకూ రుణ మద్దతు అందిస్తారు. ఈ పథకంలో తొలి విడతలో 18 రకాల కుల వృత్తులకు రుణ సహాయం అందుతుంది.

చేతివృత్తుల వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పథకం రుణాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తారు. పథకం సెప్టెంబర్‌ 17న ప్రారంభం కానున్నది. దీనితో దేశవ్యాప్తంగా 30లక్షల మంది వృత్తికార్మికులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రులు తెలిపారు.

వంద నగరాల్లో పదివేల కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు

ఈ-బస్‌లో భాగంగా 100 నగరాల్లో పదివేల కొత్త ఎలక్ట్రిక్‌ బసులు నడుపనున్నారు. ఇందు కోసం రూ.57,613 కోట్లు వెచ్చించనున్నారు. అయితే.. ఇందులో రూ.20వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ కార్యక్రమంలో 3 లక్షలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో 10వేల ఈ-బస్సులు నడుపనున్నారు. పదేళ్ల పాటు బస్సులు నడువనున్నాయి. అలాగే, డిజిటల్‌ ఇండియా పథకానికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పథకానికి రూ.14,903కోట్లు కేటాయించారు.

గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ హర్షనీయం: ప్రధానికి కోమటిరెడ్డి కృతజ్ఞతలు

గుంటూరు – బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టు మంజూరుతో ఇన్నాళ్లకు నా నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరబోతున్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట, వలిగొండ, నాగిరెడ్డిపల్లి మీదుగా సుమారు రూ.3000 కోట్లతో 239 కిలోమీటర్ల రూట్‌ డబ్లింగ్ జరగనుందన్నారు.

డబ్లింగ్ ప్రాజెక్టు కోసం చాలా కాలంగా నా నియోజకవర్గ ప్రజలు ఎదురుచేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ నల్గొండతో పాటు యాదాద్రి-భువనగిరి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. డబ్లింగ్ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం తగ్గనుందని, ఉత్తర భారతదేశంలోని సుదూర గమ్యస్థానాలకు వస్తువుల సరఫరా వేగవంతం అవుతోందన్నారు.

ఈ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లకు,
నా నియోజకవర్గ ప్రజల తరఫున ఎంపీ గా హృదయ పూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

ముద్ఖేడ్ – మేడ్చల్ డబ్లింగ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం : ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అర్వింద్

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముద్ఖేడ్ -మేడ్చల్ మరియు మహబూబ్ నగర్ -డోన్ సెక్షన్ల మధ్య 502.34. కి. మీ లతో 5655.4 కోట్ల అంచనా వ్యయంతో ప్రస్తుతమున్న సింగల్ రైల్వే లైన్ ను డబుల్ రైల్వే లైనుగా మార్చుటకు కేంద్ర కేబినెట్ ఆరోజు ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ మొన్నటికి మొన్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 53 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రాజెక్టు చేపట్టాలని తాను చేసిన విజ్ఞప్తులకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ గారికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇప్పటికే ముద్ ఖేడ్ నుండి బాసర వరకు పట్టాలు వేయుటకు భూమి చదును చేస్తున్నారని, అతి త్వరలోనే డబుల్ లైన్ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ పేర్కొన్నారు. డబుల్ రైల్వే మార్గం పూర్తయితే నిజామాబాద్ నుండి ముంబై,పూణే, షిరిడి మరియు నిజామాబాద్ నుండి బెంగళూరు ల మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగడమే కాకుండా ప్రయాణ మార్గం సులభతరం అవుతుందని, అలాగే మూడు నాలుగు గంటల ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉందన్నారు.