Telangana Land Registration Revenue : తెలంగాణలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ల రాబడి!
తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఫిబ్రవరిలోనే రూ.1,422 కోట్ల రికార్డు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మొత్తం రాబడి రూ.15 వేల కోట్లను దాటే అవకాశం ఉందని అంచనా.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తులు, సాగు భూముల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయి ఆదాయం దక్కింది. ఫిబ్రవరి నెలలో ఆస్తులు, వివాహ రిజిస్ట్రేషన్లు తదితర రాబడులు కలుపుకొని రూ.1,422 కోట్ల భారీ ఆదాయం లభించిందని, రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం అని ప్రభుత్వం పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి మాసాంతానికే రూ.13,863.22 కోట్ల ఆదాయం లభించిందని రెవెన్యూ శాఖ యంత్రాంగం వెల్లడించింది.
ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఈ ఏడాదికి రూ.15 వేల కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.1,212 కోట్లు రాగా.. మార్చిలో రూ.1,440 కోట్లు వచ్చింది. గత డిసెంబరులో రూ.1391.30 కోట్లు వచ్చింది. అంతకు ముందెన్నడూ డిసెంబరులో ఈ స్థాయి రాబడి రాలేదు. ఇప్పటి వరకు అత్యధిక వార్షిక రాబడి 2023-24లో రూ.14,296 కోట్లు వచ్చింది. ఈ ఏడాది దీనికన్నా రూ.800 కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు రిజిస్ట్రేషన్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026-27లో స్థిరాస్తి వ్యాపారం మరింత పుంజుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో బహిరంగ భూముల ధరలకు, రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువను అనుసరించి భూముల ధరలు సవరిస్తే వచ్చే ఏడాది రూ.19,500 కోట్ల మార్కును దాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆదాయం కంటే అప్పులే అధికం
2025-26 బడ్జెట్‌లో వార్షిక రెవెన్యూ ఆదాయం రూ.2,29,720.63 కోట్లుగా రేవంత్ సర్కార్ ప్రతిపాదించింది. గడిచినపది నెలల్లో జనవరి నాటికి రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.2,07,558 కోట్లు. ఇందులో సొంత పన్నుల ద్వారా సమకూరింది రూ.1,26,293 కోట్లు మాత్రమే అని కాగ్ గణంకాలు వెల్లడిస్తున్నాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన వార్షిక రుణ లక్ష్యం రూ.54,009 కోట్లు కాగా, సోమవారం నాటికి రూ.83,300 కోట్లకు(154.23 శాతం) చేరింది.. బడ్జెట్‌లో వార్షిక ఆదాయం రూ.2,84,837.30 కోట్లుగా ప్రతిపాదించగా, జనవరి నాటికి రూ.2,07,558.18 కోట్లు (72.87 శాతం) మాత్రమే వస్తే.. అప్పులు మాత్రం లక్ష్యాన్ని దాటి 130 శాతానికి పెరిగాయని కాగ్ గణంకాలు వెల్లడిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు : మంత్రి ఉత్తమ్
Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram