విధాత : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథార్టీ (వైటీడీఏ) పాలకమండలి శనివారం పదవీ ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. ప్రధానాలయ ముఖ మంటపంలో వైటీడీఏ బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి( ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఛైర్మన్ )తో పాటు 10 మంది సభ్యులు, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఆలయ చరిత్రలో దాదాపు 17 ఏండ్ల తర్వాత కొత్త పాలకమండలి ఏర్పాటు కాగా, అనువంశిక ధర్మకర్త కాకుండా ఇతరులు పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, పత్రికాధిపతి చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్ గౌడ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, నరసింహమూర్తి, బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం నూతన ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం ప్రెసిడెంట్ సూట్‌లో నిర్వహించారు. ఇందులో ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.