పాతికేళ్ల క్రితం అప్పు..మిత్రుడిని వెతికి మరి ఇచ్చాడు!

పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును తీర్చేందుకు కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ గూగుల్ సహాయంతో తెలంగాణలోని తన మిత్రుడిని వెతికి మరీ డబ్బు చెల్లించాడు. ఈ ఘటన నిజాయితీ, స్నేహానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 11, 2026, 3:39 pm IST
Read Time: 5 mins
పాతికేళ్ల క్రితం అప్పు..మిత్రుడిని వెతికి మరి ఇచ్చాడు!

ఆధునిక సమాజంలో మానవ సంబంధాలన్ని ఆర్థిక బంధాలుగా మారిపోయి..ఆస్తుల కోసం కొట్లాటలు, డబ్బుల కోసం హత్యలు, మోసాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి తను పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ. 25 వేల అప్పు తీర్చేందుకు గూగుల్ సాయంతో అప్పు ఇచ్చిన వ్యక్తిని వెతికి మరీ…అతడి అప్పు మొత్తాన్ని చెల్లించిన ఘటన వైరల్ గా మారింది.

కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో కలిసి పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడు వ్యక్తిగత అవసరాల నిమిత్తం లచ్చన్న వద్ద ఇస్మాయిల్ కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. ఇండియాకు వెళ్లాక ఆ డబ్బు తిరిగి ఇస్తానని మాటిచ్చారు. అయితే, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వేర్వేరు కారణాలతో వల్ల వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ తెగిపోవడం, ఫోన్ నంబర్లు మారడంతో ఒకరి సమాచారం మరొకరికి దొరకలేదు.

అయితే తను తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేయాలని ఇస్మాయిల్ పట్టువదలకుండా లచ్చన్న అడ్రస్ కోసం వెతుకుతునే ఉన్నాడు. ఈ క్రమంలో పాతికేళ్లు గడిచిపోయాయి. అప్పు చెల్లింపుపై ఇచ్చిన మాట మాత్రం ఎపుడూ ఇస్మాయిల్ మర్చిపోలేదు. అతని అప్పు ఎలా తీర్చాలా మధనపడుతూ వచ్చాడు. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. కానీ లచ్చన్నది “ధర్మపురి” అనే విషయం మాత్రమే అతనికి గుర్తుంది. ఊరు ధర్మపురి పేరు ఆధారంగా గూగుల్ సహాయంతో లచ్చన్న అడ్రస్ పట్టుకున్నాడు. కేరళ ఉన్న ఇస్మాయిల్ మిత్రుడికి సంబంధించిన అతడిని వెతుకుతూ 1000కిలో మీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లాకు వచ్చాడు.

చిరునామా, ఫోన్ నంబర్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్, స్థానికుల సహాయంతోఇస్మాయిల్ ఎట్టకేలకు లచ్చన్న ఇంటిని గుర్తించి చేరుకున్నాడు. అంతదూరం ప్రయాణించి తన మిత్రుడి ఇంటికి చేరుకున్న ఇస్మాయిల్ కు అతడు ఇంటివద్ద లేకపోవడం కొంత నిరాశకు గురి చేసింది. లచ్చన్న ప్రస్తుతం గల్ఫ్‌లో ఉండటంతో తనను నేరుగా కలవకపోయినప్పటికి..అతడితో ఫోన్‌లో మాట్లాడాడు. ఇన్నేళ్లకు తనను పలకరించిన ఇస్మాయిల్ గొంతును గుర్తు పట్టిన లచ్చన్న భావోద్వేగానికి గురయ్యాడు. పాతికేళ్ల క్రితం అప్పు ఇచ్చిన విషయాన్ని లచ్చన్న పూర్తిగా మర్చిపోయినప్పటికీ..అప్పు విషయాన్ని ఈ సందర్బంగా ఇస్మాయిల్ గుర్తు చేశాడు. లచ్చన్న కు తను ఇవ్వాల్సిన రూ. 25వేల అప్పు మొత్తాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేశాడు. “ఇన్నేళ్లుగా నా మనసులో ఉన్న రుణభారం, వెలితి ఈరోజుతో తీరిపోయింది” అంటూ ఇస్మాయిల్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇన్నేళ్ల తర్వాత కూడా అప్పు తీర్చిన మిత్రుడి నిజాయితీని లచ్చన్న అభినందించాడు. లచ్చన్న కుటుంబ సభ్యులు ఇస్మాయిల్ కు మర్యాదలు చేసి పంపించారు. ఈ ఘటన నేటి సమాజంలో ఇంకా మానవత్వం, స్నేహానికి విలువ, నిజాయితీ ఉందనడానికి నిదర్శనమని నెటిజన్లు భావిస్తున్నారు.