Dharani Vs Bhu Bharati | ధరణి Vs భూ భారతి.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి..? రైతులకు మేలైంది ఏది..?
Dharani Vs Bhu Bharati | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( Kalwakuntla Chandra Shekar Rao ) సర్కార్ తీసుకొచ్చిన ధరణి( Dharani ) వల్ల ఎంతో నష్టపోయామని అన్నదాతలు( Farmers ) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి( Bhu Bharati )పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న భూ భారతిపై రైతులకున్న అనేక సందేహాలను భూభారతి రూపకర్త భూమి సునీల్( Bhumi Sunil ) నివృత్తి చేశారు.

Dharani Vs Bhu Bharati | మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( Kalwakuntla Chandra Shekar Rao ) తీసుకొచ్చిన ధరణి( Dharani ) కాదని.. తెలంగాణ( Telangana ) రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) భూ భారతి ( Bhu Bharati ) అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా తీసుకొచ్చిన ఆర్‌వోఆర్ 2025( ROR 2025 ) చట్టంలో రిజిస్ట్రేషన్( Registration ), మ్యుటేషన్ ( Mutation ), రికార్డ్ ఆఫ్ రైట్స్ ( Record of Rights ) కరెక్షన్, నాలా ( Nala ), అప్పీల్ ( Appeal ), భూములకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు. ఈ క్రమంలో ధరణి, భూ భారతి మధ్య ఉన్న తేడాలేంటి..? అన్నదాతలకు ఏది మేలు చేస్తుంది..? భూ భారతి చట్టం ఏ భూములకు వర్తిస్తుంది..? రికార్డుల నకలు పొందడం ఎలా..? సివిల్ కోర్టుల పాత్ర, న్యాయసహాయం వంటి అనేక విషయాలను భూ భారతి రూపకర్త భూమి సునీల్( Bhumi Sunil ) సమగ్రంగా వివరించారు.
రికార్డ్ ఆఫ్ రైట్స్ (ROR) – భూమి హక్కుల రికార్డు
భూమిపై ఎవరికి, ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డు. గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్న భూమి యజమానులు వారు కలిగి ఉన్న భూమి వివరాలను తెలిపే రికార్డు ఇది. అందుకే దీన్ని భూయజమానుల రికార్డు అని కూడా అనొచ్చు. ఈ రికార్డులో పేరు ఉన్న వారికే భూ యజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు. ఆర్‌వోఆర్‌లో ఎవరి పేరు ఉంటే వారే భూమి యజమానిగా పరిగణించబడుతారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రికార్డు ఆధారంగానే జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు అందించే ఏ మేలైన ఈ రికార్డు ప్రకారమే అందజేయబడుతాయి. అందుకే ఆర్‌వోఆర్ చాలా కీలకమైన భూమి రికార్డు.
తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టాలు ఇలా..
ఖాస్రా పహాణి ( Khasra Pahani ) : హైదరాబాద్ రాష్ట్రంలో 1948లో చేసిన ఆర్‌వోఆర్ చట్టం కింద హక్కుల రికార్డుగా ప్రకటించబడింది.
1బీ రిజిస్టర్( 1B Register or ROR 1B ) : ఉమ్మడి రాష్ట్రంలో 1971లో చేసిన ఆర్‌వోఆర్ చట్టం కింద రూపొందించబడింది.
ధరణి ( Dharani ): 1బీ రిజిస్టర్‌నే 2017లో నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన(ఎల్ఆర్‌యూపీ) కార్యక్రమం ద్వారా సవరించి ధరణిలో పొందుపరిచారు. 2020లో చేసిన ఆర్‌వోఆర్ చట్టం కింద ధరణినే హక్కుల రికార్డుగా ప్రకటించారు.
భూ భారతి( Bhu Bharati ) : ఆర్‌వోఆర్ 2025 చట్టం కింద హక్కుల రికార్డు
ఆర్‌వోఆర్ చట్టంలో ఉండాల్సిన ప్రధాన అంశాలు
ఆర్‌వోఆర్ చట్టాల ప్రధాన ఉద్దేశ్యం హక్కుల రికార్డును రూపొందించడం, భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు ఆ రికార్డులో మార్పులు చేయడం.
1. భూమి హక్కుల రికార్డును రూపొందించి నిర్వహించడం.
2. హక్కుల రికార్డు లో ఉన్న తప్పులను సవరించడం
3. భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు హక్కుల రికార్డులో మ్యుటేషన్
4. హక్కుల రికార్డుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవస్థ.
ధరణి చట్టంలో లోపాలు
1. ధరణిలో తప్పొప్పుల సవరణకు రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవు. ధరణి సమస్యల పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదు.
2. ధరణి సమస్యలు తీరాలంటే కోర్టులను ఆశ్రయించాల్సిందే. పాత ఆర్‌వోఆర్ చట్టంలో ఉన్న అప్పీల్ వ్యవస్థను రద్దు చేశారు.
3. సాదా బైనామాల క్రమబద్దీకరణ కోసం చేసుకున్న పది లక్షల దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చట్టంలో నియమం లేదు.
4. పార్ట్ బీ చేర్చిన 18 లక్షల ఎకరాల భూమిని ధరణికి ఎక్కించడానికి నియమాలు లేవు.
5. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, ఇనాం భూములకు ఓఆర్‌సీ, 38 ఈ సర్టిఫికెట్ మొదలగు మార్గాల ద్వారా భూమి హక్కులు సంక్రమించినప్పుడు ధరణిలో నమోదు చేయడానికి నియమాలు లేవు.
6. వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే మ్యుటేషన్ చేయడం వలన వారసుల మధ్య భూమి వివాదాలు పెరిగాయి.
7. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూఎల్ పిన్ /భూఆధార్ /భూధార్) గ్రామాల్లోని ఇంటి స్థలాలకు ఆస్తి కార్డులు జారీ చేయడానికి నియమాలు లేవు. ఈ కార్యక్రమాలు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. కానీ అప్పటి తెలంగాణ ప్రభుత్వం వీటిని అమలు చేయలేదు.
భూ భారతి – కీలక అంశాలు
1. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు – భూ భారతి
2. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం.
3. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ
4. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం
5. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ
6. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు
7. పాసు పుస్తకాలలో భూమి పటం
8. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ
9. భూధార్ కార్డుల జారీ
10. ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు
11. రైతులకు ఉచిత న్యాయసహాం
12. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ
13. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం.
భూ భారతి – ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు(సెక్షన్ -4 )
1. భూమి హక్కుల రికార్డుగా భూ భారతి పోర్టల్
2. ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూ భారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతాయి.
3. హక్కుల రికార్డుల సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించొచ్చు.
4. రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డు రూపొందించొచ్చు.
1971 చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా ఉన్న 1బీ రికార్డే ధరణి చట్టం కింద హక్కుల రికార్డుగా కొనసాగింది. ఎలాంటి కొత్త రికార్డు రూపొందించలేదు. రికార్డు సవరణల కోసం ధరణి చట్టంలో ఎలాంటి నిబంధన లేదు.
ఆర్‌వోఆర్‌లో తప్పుల సవరణ(సెక్షన్ 4, రూల్ 4 & షెడ్యూల్ – ఏ)
1. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
2. రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
3. వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్, భూమి ట్రిబ్యునల్‌లో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు.
ధరణి చట్టంలో రికార్డుల సవరణ కోసం నియమం లేదు. తప్పుల సవరణకు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందే.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్(సెక్షన్ 5, రూల్ 5 & షెడ్యూల్ – బీ)
కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగపంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి, హక్కుల రికార్డులో మార్పులు చేసి, పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే రోజు జరిగిపోతుంది.
రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్ ప్రక్రియ
1. స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్ ఫీజు చెల్లింపు
2. నిర్దేశించిన తేదీ నాడు భూ భారతి చట్టంలో ఉన్న నమునాలో కాని, రిజిస్ట్రేషన్ & స్థిరాస్తి బదలాయింపు చట్టం ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాలి.
3. దస్తావేజుతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, భూమి పటం(ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి) సమర్పించాలి.
4. రికార్డులలోని వివరాలతో డాక్యుమెంట్ లోని వివరాలు సరిపోలి, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న భూమి నిషేధిత జాబితాలో లేకుండా ఉండి, పీవోటీ, ఎల్‌టీఆర్, అమలులో ఉన్న ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉన్నట్లైతే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు.
5. వెనువెంటనే భూ భారతిలో నమోదు చేసి పాత పాసుబుక్ ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ బుక్ జారీ చేయడం చేస్తారు. సవరించిన భూ భారతి రికార్డును రిజిస్టర్డ్ దస్తావేజుకు జతపరుస్తారు.
6. మ్యుటేషన్‌పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి, ఆ పై జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
7. ధరణి చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు. సర్వే మ్యాప్ లేదు.
8. మ్యుటేషన్‌పై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లడం తప్ప అప్పీల్‌కు అవకాశం లేదు.
వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ (సెక్షన్ 7, రూల్ 7 & షెడ్యూల్ – బీ)
వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేసి హక్కుల రికార్డులో మ్యుటేషన్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో తహసీల్దార్ మ్యుటేషన్ చేయకపోతే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతుంది. పాత పాస్‌బుక్ ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ బుక్ జారీ చేయడం చేస్తారు.
మ్యుటేషన్ ప్రక్రియ( Mutation )
1. భూ భారతి పోర్టల్‌లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు ఎకరానికి రూ. 2500 మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి.
2. దరఖాస్తుతో పాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం కూడా జత చేయాలి.
3. తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అలా నిర్దేశిత కాలంలో నిర్ణయం తీసుకోకుంటే దరఖాస్తుదారుని పేరు రికార్డులో ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ అవుతుంది.
4. దరఖాస్తుదారునికి పాత పాస్ బుక్ ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ బుక్ జారీ చేయడం చేస్తారు.
5. మ్యుటేషన్‌పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి, ఆపై జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
ధరణి చట్టం ప్రకారం మ్యుటేషన్ చేసే ముందు విచారణ లేదు. దీని వలన వారసుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి.
ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్(సెక్షన్ 8, రూల్ 8 & షెడ్యూల్ – బీ)
సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పు, లోక్ అదాలత్ అవార్డు, అసైన్‌మెంట్ పట్టా, 38 ఈ సర్టిఫికెట్, 13 బీ సర్టిఫికెట్, ఓఆర్‌సీ, సేల్ సర్టిఫికెట్ మొదలగు వాటి ద్వారా హక్కులు సంక్రమిస్తే ఆర్‌డీవోకు దరఖాస్తు చేసుకుంటే హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు.
మ్యుటేషన్ ప్రక్రియ
1. భూభారతి పోర్టల్‌లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు. హక్కుల నిరూపణకు కావాల్సిన పత్రాలు జత చేయాలి. ఎకరానికి రూ. 2500 మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. సీసీఎల్ఏ నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వేపటం కూడా జత చేయాలి.
2. రెవెన్యూ డివిజనల్ అధికారి విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి.
3. హక్కుల రికార్డులో మార్పులు చేసి దరఖాస్తుదారునికి పాత పాస్ బుక్ ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ బుక్ జారీ చేయడం చేస్తారు.
4. రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు, ఆపై భూమి ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
ధరణి చట్టం ప్రకారం కోర్టు ద్వారా భూమి హక్కులు సంక్రమించినప్పుడు తప్ప మరే విధంగా హక్కులు సంక్రమించినా మ్యుటేషన్ చేసే అవకాశం లేదు.
సాదా బైనామా( Sada Bainama )ల క్రమబద్దీకరణ ( సెక్షన్ 6 & రూల్ 6 )
2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం సన్న చిన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాస్ బుక్ ఇస్తారు.
మ్యుటేషన్ ప్రక్రియ
1. ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు.
2. స్థానిక విచారణ చేసి చుట్టు పక్క రైతులను విచారిస్తారు. మౌఖిక, రాతపూర్వక ఆధారాలను పరిశీలిస్తారు.
3. పీవోటీ, సీలింగ్, ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకుంటారు.
4. క్రమబద్దీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రూ. 100 అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు.
5. హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాస్ బుక్ ఇస్తారు.
ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ కోసం ఎలాంటి నియమానని పొందుపరచలేదు. దీని వలన గౌరవ హైకోర్టు సాదా బైనామాల క్రమబద్దీకరణపై స్టే విధించింది.
పట్టాదారు పాస్ పుస్తకాలు( PPB ) (సెక్షన్ 10, రూల్ 10 & షెడ్యూల్ – బీ)
1. భూ భారతి హక్కుల రికార్డులో నమోదై ఉన్న అందరికీ తనంత తానుగా కానీ, భూ యజమాని దరఖాస్తు చేస్తే కానీ రికార్డులు పరిశీలించి రూ. 300 ఫీజు వసూలు చేసి పాస్ బుక్ జారీ చేస్తారు.
2. హక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్స్‌డ్ సర్వేయర్‌తో తన భూమి సర్వే చేయించుకుని మ్యాప్ తయారు చేయించుకున్నట్లైతే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాస్ బుక్‌లో సర్వే మ్యాప్‌ను ఉంచుతారు.
3. ఎవరైనా పాస్ బుక్‌లోని వివరాలు, హక్కుల రికార్డుతో సరిపోలడం లేదని దరఖాస్తు చేస్తే తహసీల్దార్ పరిశీలించి సరి చేస్తారు.
4. తహసీల్దార్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి, ఆపై జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
ఈ వెసులుబాట్లు ఏవి ధరణి చట్టంలో లేవు.
అప్పీల్ ( Appeal )వ్యవస్థ(సెక్షన్ 15 &రూల్ 14)
రెండంచెల అప్పీల్ వ్యవస్థ
1. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా తహసీల్దార్ జారీ చేసిన పాస్ బుక్స్ లేదా భూధార్‌పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన తీర్పపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు రెండో అప్పీల్ చేసుకోవచ్చు.
2. రెవెన్యూ డివిజనల్ అధికారి చేసిన మ్యుటేషన్లపై లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి చేసిన సాదా బైనామాల క్రమబద్దీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్‌కు రెండో అప్పీల్ చేసుకోవచ్చు.
ధరణి చట్టం కింద అప్పీల్ వ్యవస్థ లేదు. కోర్టులను ఆశ్రయించాల్సిందే.
రివిజన్( Revision ) అధికారాలు(సెక్షన్ 16 & రూల్ 15 )
1. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేయమని ఎవరైనా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు దరఖాస్తు చేయవచ్చు.
2. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తనంత తానుగా కూడా చర్యలు తీసుకోవచ్చు.
ధరణి చట్టంలో ఇలాంటిది ఏర్పాటు కాలేదు.
అధికారాలు(సెక్షన్ 17)
రికార్డింగ్ అధికారులు, అప్పీల్ & రివిజన్ అధికారులు భూ భారతి చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు వారికి సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయి.
తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు(సెక్షన్ 19 అండ్ 20)
1. మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పాస్ బుక్స్ జారీ చేస్తే కమిషనర్ తనంతట తానుగా లేదా ఎవరైనా దరఖాస్తు చేసినా ఆ పాస్ పుస్తకాన్ని రద్దు చేసి భూమి స్వాధీనం చేసుకోవచ్చు. తహసీల్దార్, సంబంధిత అధికారులపై డిసిప్లీనరీ చర్యలతో పాటు క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు.
2. రికార్డులను టాంపర్ చేసినా లేదా మోసపూరిత ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. సర్వీసు నుంచి తొలగించొచ్చు.
3. భూమి హక్కుల రికార్డులో నమోదు లేదా తొలగింపునకు సంబంధించి ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారిపైన ఎలాంటి కేసు నమోదు చేయడానికి వీల్లేదు. సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఉండవు.
సివిల్ కోర్టు( Civil Court )ల పాత్ర(సెక్షన్ 18 & రూల్ 13)
1. యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం మాత్రమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి.
2. రికార్డుల సవరణ కోసం సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
ధరణి చట్టంలో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే.
న్యాయ సహాయం( Legal Aid )(సెక్షన్ 15(8) & రూల్ 16)
1. న్యాయ సేవ సంస్థలు లేదా ఇతర సంస్థలు వ్యవస్థల ద్వారా పేదలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి, మహిళలకు ఉచిత న్యాయ సహాయం, సలహాలు అందించాలి. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించాలి.
2. ఇలాంటి నియమం భూమి చట్టాలలో ఉంచడం దేశంలోనే ఇది మొదటిసారి.
ధరణి చట్టంలో ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఎలాంటి నియమం లేదు.
భూధార్ కార్డు( Bhudhar Card )(సెక్షన్ 9 & రూల్ 9)
1. డిజిటల్ ఇండియా భూమి రికార్డుల ఆధునీకరణ పథకంలో భాగంగా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూఎల్ పిన్/ భూ ఆధార్/ భూదార్) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. కొన్ని రాష్ట్రాలలో భూదార్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది.
2. భూ భారతి చట్టంలో ప్రతి భూకమతానికి భూధార్ సంఖ్య ఇచ్చి ప్రతి భూయజమానికి భూమలను సర్వే చేయకముందు తాత్కాలిక భూదార్, సర్వే చేసిన తర్వాత శాశ్వత భూదార్ ఇవ్వడానికి నియమాలు ఉన్నాయి.
ఇంటి స్థలాలకు హక్కుల రికార్డు(సెక్షన్ 4(2) & రూల్ 3 )
1. గ్రామీణ ప్రాంతాలోని అబాదీలను సర్వే చేసి ఇంటి స్థలాలకు ఆస్తి కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నాలుగేండ్ల కింద స్వామిత్వా ప్రాజెక్టును ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో డ్రోన్ సర్వే చేసి ఆస్తి కార్డుల జారీ చేసే ప్రక్రియ నడుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఆబాదీలకు హక్కుల రికార్డు లేదు.
2. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేయలేదు.
3. భూ భారతి చట్టంలో అబాదీ భూములకు, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయేతర భూములకు ప్రత్యేక హక్కుల రికార్డు రూపొందించడానికి నియమాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఈ నియమాలు అమల్లోకి వస్తాయి.
భూ భారతి చట్టం ఏ భూములకు వర్తిస్తుంది..?( సెక్షన్ 3 )
1. వ్యవసాయ భూములకు, వ్యవసాయేతర భూములకు, ఆబాదీలకు ఈ చట్టం వర్తిస్తుంది.
2. ప్రభుత్వ, జాగీరు, ఇనాం భూములకు వర్తించదు.
3. ధరణి చట్టం కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది.
హక్కుల రికార్డుకు ఎలాంటి విలువ ఉంది..?( సెక్షన్ 11)
1. భూమి హక్కుల రికార్డులో ఉన్న వివరాలు అవి తప్పు అని నిరూపించే వరకు లేదా చట్ట ప్రకారం రికార్డులలో మార్పు చేసే వరకు సరైనవిగా భావించాలి.
2. పాస్ పుస్తకానికి రిజిస్టర్డ్ దస్తావేజుకు ఉన్న విలువ ఉంటుంది.
గ్రామ రెవెన్యూ రికార్డులు (సెక్షన్ 13 & రూల్ 12)
1. గ్రామ పహాణీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్‌లను ప్రభుత్వం నిర్వహిస్తుంది.
2. భూమి హక్కుల రికార్డులోని వివరాలను ఈ రికార్డులో ఆన్‌లైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యుటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్‌లైన్‌లో గ్రామ లెక్కలలో మార్పులు జరుగుతాయి.
3. ప్రతి ఏడాది డిసెంబర్ 31న ఈ గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారు.
ధరణి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయింది. ధరణి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ప్రస్తావన లేదు.
రికార్డుల నకలు పొందడం ఎలా..? (సెక్షన్ 12 & రూల్ 11)
1. భూమి హక్కుల రికార్డులు భూ భారతి పోర్టల్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి.
2. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునేలా అవకాశం ఉండేది.
3. భూ భారతిలో హక్కుల రికార్డు పూర్తి రికార్డు పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంటుంది.
4. ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూ భారతిలో ఉన్న ఫారంలో రూ. 10 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీ జారీ చేస్తారు.