Ponguleti | అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

  • By: TAAZ |    telangana |    Published on : Mar 06, 2026 9:53 PM IST
Ponguleti | అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యం
  • అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
  • రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
  • తొలిసారి మహబూబాబాద్లో ఉమ్మడి వరంగల్ సమావేశం
  • పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు
  • సమావేశానికి మంత్రి సురేఖ హాజరు, సీతక్క గైర్హాజర్‌

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Ponguleti | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్ ఐడీఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం నిర్వహించారు. గత సంప్రదాయానికి భిన్నంగా తొలిసారి ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశాన్ని మహబూబాబాద్లో నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకాగా, మరో మంత్రి ధనసరి సీతక్క హాజరుకాలేదు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, శాసన సభ్యులు మురళి నాయక్, దొంతి మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆరుగురు కలెక్టర్లు స్నేహ శభరీష్, సత్యశారద, చాహత్ బాజ్ పాయ్, సందీప్ కుమార్ ఝా, దివాకర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా మరియు వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కొరత ఉండకుండా చూడాలని సూచించారు. ఉపయోగంలో లేని వైద్య పరికరాలను తొలగించి, అవసరమైన పరికరాలకు తగిన సిబ్బందిని నియమించి వాటిని సమర్థంగా వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. పాఠశాలల వాహనాలు ఫిట్ నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ఎక్కడైనా నిధులు మంజూరు సమస్య ఉంటే నివేదికలు పంపాలని తెలిపారు. ప్రతి హస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలని, విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాభితా తయారు చేయాలని తెలిపారు. మార్చి నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుండి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు.