Warangal : కేంద్ర ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్న అసమానతలు
కేంద్ర ప్రభుత్వ వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపు మేరకు వరంగల్ కలెక్టరేట్ ఎదుట రైతు, కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. రైతాంగ ఉద్యమంలో ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం అమలు చేయట్లేదని, విదేశీ పత్తి దిగుమతుల సుంకం ఎత్తివేసి దేశీయ రైతులకు అన్యాయం చేస్తుందని పెద్దారపు రమేష్ విమర్శించారు.
విధాత, వరంగల్ : కేంద్ర ప్రభుత్వ వినాశనకర విధానాలతో రైతులు కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారుతున్నదని ఇలాంటి పద్ధతులను మానుకోకపోతే తీవ్రమైన ప్రతిఘటన తప్పదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్ హెచ్చరించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం పిలుపులో భాగంగా రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఏకశిలా పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ గేటు ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్కేయం జిల్లా కన్వీనర్ కుసుంబ బాబురావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి రాతపూర్వక హామీలు ఇచ్చి ఆందోళన విరమింప చేసి ఆచరణలో అమలు చేయడం లేదని విమర్శించారు. విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంఖాన్ని ఎత్తివేసిందని విమర్శించారు. దీంతో దేశీయ రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర అమలు కాకుండా పరోక్షంగా ప్రయత్నిస్తోందని అన్నారు. సీసీఐ ద్వారా అనేక షరతులు పెట్టి రైతుల పత్తి కొనకుండా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నదని అన్నారు. పంటల కొనుగోలు సంస్థలైన నాఫేడ్, మార్క్ఫెడ్, సివిల్ సప్లై లాంటి వాటిని నిర్వీర్యపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అన్యాయమన్నారు. నూతన విద్యుత్ చట్టం పేరుతో రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజలందరికీ చౌకగా లభించే విద్యుత్తును ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు కాసు మాధవి, ముక్కెర రామస్వామి, ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలు కాపాడే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె ఎం రాష్ట్ర నాయకులు చిన్న చంద్రన్న, జిల్లా కన్వీనర్లు ఈసంపెళ్లి బాబు, రాచర్ల బాలరాజు, సోమిడి శ్రీనివాస్, చుక్క మొగిలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రావలసిన యాసంగి వరి ధాన్యం బోనస్ రైతు భరోసా డబ్బులను తక్షణమే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించి సరిత గతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు, కార్మిక సంఘాల నాయకులు గోనె కుమారస్వామి, నర్రా ప్రతాప్, ఆరూరి కుమార్, ఎండి బషీర్, బోడేపల్లి సాయిలు, రాజారాం, మైదం పాణి, ఓదెల రాజన్న, ముకిడే పీరయ్య, చిర్ర సూరి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram