• Telugu News
  • /National

Odisha Mining Officer : ఒడిస్సా విజిలెన్స్ వలకు అతిపెద్ద అవినీతి తిమింగలం!

ఒడిస్సా విజిలెన్స్ దాడుల్లో కట్టక్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి వద్ద రూ.4 కోట్లకు పైగా అక్రమ నగదు బయటపడింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 25, 2026, 4:14 pm IST
Read Time: 4 mins
Odisha Mining Officer : ఒడిస్సా విజిలెన్స్ వలకు అతిపెద్ద అవినీతి తిమింగలం!

విధాత : ఒడిస్సా విజిలెన్స్ దాడుల చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం పట్టుబడింది. రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కట్టక్ మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో తనిఖీలలో భాగంగా భారీ ఎత్తున నగదు, ఆస్తులు బయటపడటం సంచలనం రేపింది. బొగ్గు రవాణా అనుమతి కొరకు లైసెన్స్ పొందిన బొగ్గు వ్యాపారి నుండి డబ్బు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి.

దేబబ్రత ఇంటిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలలో కట్టకట్టలుగా రూ.4 కోట్లకు పైగా అక్రమ నగదు దొరికింది. ఒడిస్సా విజిలెన్స్ చరిత్రలో ఇంత భారీ అవినీతి సొమ్ము స్వాధీనం కావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.

దేబబ్రతను అరెస్టు చేసిన వెంటనే విజిలెన్స్ అధికారులు మూడు ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. భువనేశ్వర్‌లోని అతని ఫ్లాట్, భద్రక్ జిల్లా మథసాహిలోని అతని పూర్వీకుల ఇల్లు, కటక్‌లోని అతని కార్యాలయంలో తనిఖీలు చేశారు. భువనేశ్వర్‌లోని పాటియాలోని శ్రీవిహార్ ప్రాంతంలోని నేచర్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లోని అతని ఫ్లాట్ (నంబర్ 302) నుండి అధికారులు రూ.4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌లోని పహ్లా ప్రాంతంలో సుమారు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన రెండంతస్తుల ఇల్లు, సుమారు 130 గ్రాముల బంగారంతో సహా అదనపు ఆస్తులను ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. దేబబ్రతకు సంబంధించిన కేసులో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విభాగం గత 15 నెలల్లో అవినీతికి పాల్పడిన 200మందికపైగా ప్రభుత్వ అధికారులను పట్టుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నందుకు 77 కేసులు, 122 లంచం కేసులు నమోదయ్యాయి. అవినీతి అధికారుల నుంచి రూ.202 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా ప్రభుత్వం గణంకాల మేరకు.. వివిధ కోర్టులలో 3,661 అవినీతి కేసులు ఇప్పటికీ విచారణలో ఉండగా..గత ఐదు సంవత్సరాలుగా 722 కేసులు దర్యాప్తులో ఉండటంగ గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Rythu Bharosa | రైతు భరోసా ఆలస్యంపై రగిలిపోతున్న రైతాంగం!
Nani | ‘జడల్ జమానా’ సోషల్ మీడియాలో దుమారం… నాని సాంగ్ త‌ర్వాత మ‌న హీరోలంద‌రికి జ‌డ‌ల్ త‌గిలించారుగా..!