Elephants | హైద‌రాబాద్ : ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లో ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాల ప‌రిధిలో ఏనుగుల సంచారం వ‌ల్ల రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతుంటారు. ఎందుకంటే పంట పొలాల‌ను ఏనుగులు ధ్వంసం చేస్తుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఏనుగులు గ్రామాల్లోకి ప్ర‌వేశించి ఇండ్ల‌ను కూడా ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ముప్పు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొబోతుంద‌ని చెప్పాలి.

ఎందుకంటే.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుకు 80 కి.మీ దూరంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఏనుగుల గుంపు సంచరిస్తుంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ్య‌వ‌సాయ బావుల‌కు వ‌ద్ద‌కు వెళ్లే రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అట‌వీశాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణ అటవీ అధికారులు మహారాష్ట్ర అధికారులతో కలిసి వీటి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతానికి ఏనుగుల దిశ తెలంగాణ వైపు లేనప్పటికీ, సరిహద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.