న్యూఢిల్లీ : మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్(Maoists Leader Mallojula Venugopal) అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Maharashtra CM Devendra Fadnavis) ముందు ఆయుదాలు అప్పగించి లొంగిపోయారు(Surrendered). గడ్చిరోలి పోలీసులు మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
మల్లోజులపై వందకు పైగా కేసులు, 6కోట్ల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందించారు. మల్లోజుల భార్య తారక్క సైతం గత జనవరిలో గడ్చిరోలిలో సీఎం ఫడ్నవిస్ ముందు లొంగిపోవడం గమనార్హం.
శాంతిచర్చలు..విప్లవోద్యమ కొనసాగింపుపై మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తాను కూడా కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.
మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు. వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీలు ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీ ఉద్యమంలో 40ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసి అగ్రనేతలుగా ఎదిగారు. కిషన్ జీ 2011లో జరిగిన బెంగాల్ ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఆయన భార్య పోతుల సుజాతా తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక మల్లోజుల వేణుగోపాల్ పార్టీలో అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు.