Iranian Frigate IRIS Dena Destroyed by US Torpedo in Indian Ocean
- 87 మృతదేహాలు లభ్యం – పలువురి గల్లంతు
- తామే పేల్చేసామని అమెరికా ప్రకటన
- జలాంతర్గామి నుండి టార్పెడో ప్రయోగం
విధాత ప్రపంచం డెస్క్ | హైదరాబాద్:
శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ‘ఐఆర్‌ఐఎస్ దేనా’ మునిగిపోవడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. తర్వాత ఈ నౌకను తామే జలాంతర్గామి నుండి ప్రయోగించిన టార్పిడోతో ముంచేశామని అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 87 మృతదేహాలను శ్రీలంక నౌకాదళం గుర్తించగా, ఇంకా పలువురు గల్లంతైనట్లు సమాచారం.
మేమే టార్పెడోతో పేల్చేసాం : అమెరికా ప్రకటన
అమెరికా టార్పెడో దాడి సమయంలో పేలుడు దృశ్యం — జలాంతర్గామి పెరిస్కోప్ దృశ్యం
అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడిని ధృవీకరించారు. “అంతర్జాతీయ జలాల్లో భద్రంగా ఉందని భావించిన ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ద్వారా టార్పిడోతో ముంచింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు నౌకపై టార్పిడోతో చేసిన తొలి దాడి” అని తెలిపారు. ఈ దాడిని ఆయన ‘నిశ్శబ్ద మరణం’గా అభివర్ణించారు.
‘ఐఆర్‌ఐఎస్ దేనా(IRIS Dena)’ ఇరాన్‌కు చెందిన మౌడ్జ్-క్లాస్ ఫ్రిగేట్. ఇది ఇటీవల భారత్‌లో జరిగిన మిలాన్–2026 అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
భారత విన్యాసాల నుంచి తిరుగు ప్రయాణంలో దాడి
భారత్‌లో జరిగిన మిలాన్–2026 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ ఫ్రిగేట్ ‘ఐఆర్‌ఐఎస్ దేనా’
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ పార్లమెంటులో మాట్లాడుతూ, గాలె తీరానికి సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ యుద్ధనౌక ప్రమాదంలో ఉందని సమాచారం అందిన వెంటనే నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆ నౌకలో మొత్తం సుమారు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం ఉందన్నారు.
https://t.co/PiqQpVIrMu pic.twitter.com/Wc1e0B0um7
— Department of War 🇺🇸 (@DeptofWar) March 4, 2026
ఇప్పటివరకు 32 మందిని ప్రాణాలతో రక్షించగా, కొందరిని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 87 మృతదేహాలు లభించగా, ఇంకా 60 మందికిపైగా గల్లంతయ్యారని అంచనా. సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా జలాంతర్గామి ముందుగానే ఈ ఇరాన్ యుద్ధనౌకను నిశ్శబ్దంగా ట్రాక్ చేస్తూ వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. సాధారణంగా నౌకాదళాలు పరస్పరం సమాచార సేకరణ కోసం ఇతర దేశాల నౌకలను గమనిస్తూ ఉండటం సర్వసాధారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యల్లో భాగంగానే ఈ దాడి జరిగిందని పెంటగాన్ పేర్కొంది. ఇరాన్ నౌకాదళ సామర్థ్యాన్ని బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా వర్గాలు స్పష్టం చేశాయి.
