Internet Risk | ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోనుందా? ఇరాన్ వార్నింగ్‌తో మొదలైన కొత్త టెన్షన్!
Internet Risk | పర్షియన్ గల్ప్ సముద్రగర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్లు, కీలక డేటాసెంటర్లు, క్లౌడ్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అమెరికాపై కోపంతో ఇరాన్ అన్నంత పనిచేస్తే కమ్యూనికేషన్స్‌తో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Internet Risk | మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ నుంచి వస్తున్న తాజా హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్ద సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లు, కీలక డేటా సెంటర్లు, క్లౌడ్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడంతో ప్రపంచ ఐటీ రంగం వణికిపోతుంది.
ప్రపంచంలో అత్యంత కీలకమైన వ్యూహాత్మక మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ఇది చమురు రవాణాకు మాత్రమే కాకుండా యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా వంటి పర్షియన్ గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ప్రధాన మార్గంగా కూడా ఉంది. ఈ ప్రాంతం నుంచి అనేక అంతర్జాతీయ సబ్‌మెరైన్ కేబుల్ వ్యవస్థలు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని సూచిస్తూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఐఆర్‌జీసీ అనుబంధ మీడియా సంస్థ టస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
సముద్ర గర్భంలో అనేక ఇంటర్నెట్ కేబుళ్లతో పాటు, వాటి ల్యాండింగ్ స్టేషన్లు, క్లౌడ్ నెట్‌వర్క్‌లు ఉన్నాయని టస్నీమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు జీవనాడీగా మారాయని వివరించింది. వీటిపై ఈ చిన్న దాడి జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒకవేళ ఇరాన్ అన్నట్లుగానే చేస్తే దేశాల మధ్య డేటా మార్పిడి, బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. పలు దేశాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి.
ఇప్పటికే ఈ యుద్ధంలో డిజిటిల్ మౌలిక వసతులు లక్ష్యంగా మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడుల్లో యూఏఈ, బహ్రెయిన్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కేంద్రాలు దెబ్బతినట్లుగా సమాచారం వెలువడింది. దీంతో క్లౌడ్ మౌలిక వసతులు కూడా భౌతికంగా ఎంత ప్రమాదంలో ఉన్నాయో స్పష్టమైంది.
మరోవైపు కాల్పుల విరమణను పొడిగించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించినప్పటికీ నిర్బంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిర్బంధంలో భాగంగా 31 నౌకలను తిరిగి మళ్లించినట్లుగా యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా చర్యలతో ఆగ్రహంలో ఉన్న ఇరాన్ అన్నంత పనిచేస్తే టెక్నాలజీపరంగా ప్రపంచం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లిపోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ సేవల భద్రత, డేటా రక్షణపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram