former maoist leaders political entry| స్పేస్ మస్తుంది…మావోయిస్టులదే నిర్ణయం!

మావోయిస్టు ఉద్యమానికి వీడ్కోలు పలికిన మాజీ మావోయిస్టు నేతలు ప్రజా సమస్యలపై తమ పోరాటాలను ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ రూపంలో కొనసాగించబోతున్నారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. వారంతా సమీకృతమై కొత్త రాజకీయ పార్టీని పెడుతారా ? లేక ప్రస్తుతం ఉన్న పార్టీలలో భావసారుప్యత కల్గిన ఏదేని పార్టీలో చేరి ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగుతారా ? అన్నది ఆసక్తికరం. లొంగిపోయిన అగ్రనేతల భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఏమై ఉంటాయన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పెనుమార్పులకు కారణం కానున్న డీలిమిటేషన్ ప్రక్రియ రెడ్ కారిడార్ నుంచి రాజకీయాల్లోకి వచ్చే మాజీలకు రెడ్ కార్పేట్ పరుచబోతుండటం విశేషం.

విధాత : కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తలపెట్టిన.. మావోయిస్టు ముక్త భారత్ సాధన లక్ష్యం తుది అంకానికి చేరింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు అగ్రనేతలు సహా వందలాది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతమవ్వడం..లేదా లొంగిపోవడంతో ఉద్యమ ప్రస్థానం ఇక చరిత్రగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే లొంగిపోయిన అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్,  ఆశన్న,  దేవ్ జీ,  బడె చొక్కరావు(దామోదర్), మల్ల రాజిరెడ్డి, నరసింహారెడ్డి వంటి వారు క్రియాశీలక రాజకీయాలపై (former maoist leaders political entry) ఆసక్తి వ్యక్తీకరించడం కొత్త చర్చకు తెర లేపింది.

మావోయిస్టుల గెరిల్లా పోరాటం ముగిసినా…ప్రజా సమస్యలపై ప్రజాస్వామికయుతమైన చట్టబద్ద పోరాటాలు కొనసాగుతాయని..మేం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని వారు చేసిన ప్రకటనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. లొంగిపోయిన అగ్రనేతలలో కొందరు పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ(parliamentary democracy)లో అడుగుపెట్టాలని..ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారా చట్టసభలకు ఎన్నికై తమ గళాన్ని వినిపించాలనుకుంటున్నట్లుగా వెలువడుతున్న కథనాలు జనంలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

నిన్న ఎన్నికల బహిష్కరణ..రేపు ఎన్నికల గోదాలోకి !?

కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రభుత్వాల నుంచి పెరిగిన నిర్బంధం..వరుస ఎన్ కౌంటర్లు, కరువైన రిక్రూట్ మెంట్..కాలం చెల్లిన సిద్దాంతాల నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం ఉనికి కోల్పోయింది. ఈ క్రమంలో వాస్తవిక, ఆచరణాత్మక దృక్ఫథాలతో కూడిన ఆలోచనల సంఘర్షణల మధ్య.. ప్రభుత్వాల పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టు నేతలు తుపాకీతో వినిపించలేని ప్రజాగళాన్ని బ్యాలెట్ ప్రక్రియ ద్వారా వినిపించేందుకు ఆసక్తి చూపడం ఆహ్వానించ తగిందేనంటున్నారు విశ్లేషకులు. అయితే మావోయిస్టు ఉద్యమానికి వీడ్కోలు పలికిన మాజీ మావోయిస్టు నేతలు ప్రజా సమస్యలపై తమ పోరాటాలను ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ రూపంలో కొనసాగించబోతున్నారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. వారంతా సమీకృతమై కొత్త రాజకీయ పార్టీని పెడుతారా ? లేక ప్రస్తుతం ఉన్న పార్టీలలో భావసారుప్యత కల్గిన ఏదేని పార్టీలో చేరి ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగుతారా అన్నది ఆసక్తికరం. లొంగిపోయిన అగ్రనేతల భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఏమై ఉంటాయన్నదానిపై మునుముందు స్పష్టత రావచ్చు.

బందూకులు వీడి బ్యాలెట్ బరిలోకి…

గెరిల్లా పోరాటాలతో బందూకులు పట్టి విప్లవోద్యమం సాగించిన మాజీ మావోయిస్టు నేతలకు ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఎన్నికల ప్రక్రియలో ప్రయాణం అనుకున్నంత సులభతరం కాదు..అలాగని కష్టతరం కూడా కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చిన మంత్రి సీతక్క బుల్లెట్ వదిలి బ్యాలెట్ పోరులో నెగ్గి.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో పరిపాలనతో తనదైన విశిష్టతను చాటుతున్నారు. ముులుగు జడ్పీ చైర్ పర్సన్ గా పనిచేసి..అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్కపై పోటీ చేసి ఓడిన బడే నాగజ్యోతి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కుమార్తే కావడం గమనార్హం. తాజాగా బడే చొక్కారావు తాను కూడా రాజకీయాల్లోకి రావచ్చన్న వ్యాఖ్యానించడంతో వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయవచ్చన్న అభిప్రాయాలను రగిలించింది.

అలాగే భవిష్యత్తులో మల్లోజుల వేణుగోపాల్ గడ్చిబౌలీ ప్రాంతంలోగాని, తెలంగాణలో గాని ఎన్నికల బరిలో దిగవచ్చని, దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నరసింహరెడ్డి, తక్కళ్లపల్లి వాసుదేవరావు వంటి వారు ఎన్నికల ప్రక్రియలోకి వచ్చేందుకు ఆసక్తి చూపవచ్చన్న ప్రచారం వినిపిస్తుంది. గతంలో తెలంగాణ ఇన్ చార్జ్ కార్యదర్శి హోదాలో లొంగిపోయిన దివంగత మావోయిస్టు నేత కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు అప్పట్లో పార్లమెంటు ఎన్నికలలో పోటీకి సిద్దపడటం ఈ సందర్బంగా గమనార్హం. నయీమ్ ముఠా చేతిలో హత్యకు గురికాని పక్షంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సాంబశివుడు ఎంపీగా ఎన్నికయ్యేవారని అప్పట్లో బలమైన వాదనలు వినిపించాయి.

కొత్త పార్టీలకు స్పేస్ ఉందా…?

ఇప్పటికే పదుల సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికి..వాటిలో మెజార్టీ తోక పార్టీలుగా, నామమాత్రంగా మారిపోయిన నేపథ్యంలో మరో కొత్త పార్టీ పెడితే.. దాని మనుగడపై సందేహాలు కల్గకమానవు. కొత్త పార్టీ ఏర్పాటు, నిర్వహణ, నాయకత్వం, ఎజెండా జనాకర్షణ స్ట్రాటజీలు విజయంతమయ్యేందుకు సామాజిక, రాజకీయ, సమకాలీన పరిస్థితులు కూడా అనుకూలించాలి. ధన, కుల స్వామ్యాలు పెరిగిపోయిన ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియలో మాజీ మావోయిస్టులు ఎంతమేరకు రాణించి విజయం సాధించగలరన్న సందేహాలు వెన్నాడుతున్నాయి. మాజీలు నిజంగా ఓ కొత్త రాజకీయ పార్టీతో ముందుకు వస్తే.. ఆధునిక సాంకేతిక విద్య , జీవన శైలీలో కొట్టుకపోతున్న నేటి తరం యువతరాన్ని..మాజీల ఎజెండా ఎంతమేరకు ఆకట్టుకోగలదన్న ప్రశ్నలు ఎదురవ్వక తప్పదు.

కొంత మేరకు అర్భన్ నక్సలైట్లుగా పిలుస్తున్న ఆలోచన పరులతో పాటు, ట్రేడ్ వర్గాలు, ఆదివాసీ, దళిత, బలహీన వర్గాలు వారి వైపు ఆకర్షితులయ్యే అవకాశం లేకపోలేదు. చదువుకున్న వారిలో దేశంలో ఇప్పటికే చాల వరకు లెఫ్ట్, రైట్ భావజాలంలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య మాజీలకు భారత రాజకీయాల్లో స్పేస్ (Political Space) చాల ఉన్నప్పటికి..కొత్త పార్టీ రూపంలో మాత్రం స్పేస్ కరువేనన్న చర్చ వినిపిస్తుంది. సైద్దాంతిక నిక్కచ్చితనంతొ వ్యహరించే మావోయిస్టులు ఇతర పార్టీలలో చేరితే..ఆ పార్టీల ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని..ఇది కొత్త ఇబ్బందికరమేనంటున్నారు రాజకీయ నిపుణులు.

మావోయిస్టుల రాజకీయ ప్రవేశంతో బీజేపీకి కష్టమే!

మాజీ మావోయిస్టులకు కొత్త పార్టీ కంటే ఇప్పటికే ఉన్న కమ్యూనిస్టు పార్టీలలో ఏదో ఒకదానిలో చేరడం..లేక ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మాదిరిగా ఓ కొత్త ఫ్రంట్ గా బరిలోకి దిగడం వంటి ప్రతిపాదనలు కూడా వారి ముందున్నాయి. కాంగ్రెస్, బీజేపీల సహా పలు పార్టీలను బూర్జువా పార్టీలుగా ఇప్పటికే ప్రకటించిన మావోయిస్టులు అటువంటి పార్టీలలో చేరుతారా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా మనువాద పార్టీగా మావోయిస్టులు విమర్శించే బీజేపీకి మాజీలు దూరంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. అసలు ఓ రకంగా పట్టుబట్టి అడవుల నుంచి మావోయిస్టులను బయటకు రప్పించిన బీజేపీ..ప్రజాక్షేత్రంలో వారి నుంచి మునుముందు సైద్దాంతిక భావజాలంతో కూడిన పోరాటాల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఓ రకంగా బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికల్గించే పరిణామంగా భావించవచ్చు. భౌతికంగా మావోయిస్టులు అంతమైనా..మావోయిజం అంతం కాదని..పేదల, పీడిత ప్రజల పక్షాన మా గళాన్ని ప్రజాస్వామికంగా, చట్టబద్దంగా వినిపిస్తామని ఇప్పటికే మాజీలు స్పష్టం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

మాజీలకు రెడ్ కార్పెట్ పరుచనున్న డీలిమిటేషన్ !

తుపాకీ గొట్టంతో రాజ్యాధికార సాధన నినాదంతో కూడిన మావోయిస్టు ఉద్యమాన్ని వీడి..ఆయుధాలను, అడవులను వదిలేసి రెడ్ కారిడార్ నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు నేతలకు పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ డీలిమిటేషన్ ప్రక్రియ (delimitation process) రూపంలో రెడ్ కార్పెట్ పరుస్తుందనుకోవచ్చు. డీలిమిటేషన ప్రక్రియ భారత రాజ్యాంగ బద్ద పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో భారీ మార్పులను తీసుకరాబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డీలిమిటేషన్ తో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యుల స్థానాల సంఖ్య 543నుంచి 850కి పైగా పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలలోని అసెంబ్లీ సభ్యుల స్థానాల సంఖ్యలో కూడా పెరుగనుంది.

చట్టసభలలో పెరిగిన స్థానాల మేరకు రిజర్వేషన్లు..ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు కూడా పెరిగిపోనున్నాయి. ఈ పరిస్థితులలో కొత్తగా రాజకీయ వ్యవస్థలోకి వచ్చే వారికి ఎన్నికల గోదాలోకి దిగేందుకు అవసరమైన అదనపు అవకాశాలు.. కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయి. డీలిమిటేషన్ తో పెరుగునున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలతో ఏర్పడునున్న పొలిటికల్ స్పేస్ తో  దేశ వ్యాప్తంగా  మావోయిస్తు అగ్రనేతలు తమ ఎన్నికల సామర్ధ్యాన్ని పరీక్షించుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.  ఎన్నికల హార్డిల్స్ ను ధాటి చట్టసభలలోకి మాజీ మావోయిస్టులు అడుగుపెడితే.. చట్టాల రూపకల్పన..చర్చలలో ఎంతో కొంత గుణాత్మక మార్పులు వస్తే…అది నూతన ప్రజాస్వామిక విప్లవంగా అభివర్ణించవచ్చంటున్నారు.

Latest News