- మొన్న ఇంటి ముందు చూసిండ్రుగదా?
- ఎవ్వరినైనా తిట్టేందుకు వెనుకాడదు..
- పాత కథను గుర్తుచేసిన కొండా మురళి
- వచ్చేసారి పరకాలలో తన బిడ్డ పోటీచేస్తుందని ఉద్ఘాటన
- పట్టుంటే పరకాలను ఎందుకు వీడారంటున్న కొండా వైరి వర్గాలు
- ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Konda Murali | తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరిచిపోయిన పాత సంఘటను గుర్తు చేస్తూ మాట్లాడటం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత రెండేళ్ళుగా తరచూ వివాదంలో చిక్కుకుంటున్న మురళి వ్యాఖ్యలు తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మొన్నామధ్య ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి మాజీ పీఏను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చిన సమయంలో మంత్రి కుమార్తె సుస్మిత పోలీసులను తిట్టడమే కాకుండా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే అంశాన్ని కొండా మురళి గుర్తుచేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని కొమ్మాల జాతర సందర్భంగా ప్రభ బండ్లు కట్టిన నేపథ్యంలో మంగళవారం రాత్రి కార్యకర్తల నుద్దేశించి కొండా మురళి ‘నా బిడ్డ సుస్మిత ఇక్కడనే ఉంటది. మీ బాగోగులు చూసుకుంటది. నా కంటే ధైర్యవంతురాలు. మొన్ననే మీరు చూసిండ్రు. వాడెవడు.. వీడెవడు.. కొండా మురళికి అడ్డెవడు? మొన్న ఇంటి ముందు చూసిండ్రు. చిట్టక్క తిట్టాలంటే ఎవన్నిబడితేవాన్ని తిడుతది. వాడూ వీడూ అనే తేడా చూడదు. కార్యకర్తల కోసం ఏదైనా చేస్తది’ అన్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సుస్మిత పోటీ చేయడం ఖాయమంటూ మరో చర్చను లేవనెత్తారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత మాట్లాడుతూ వారంలో రెండు రోజులు వంచనగిరిలో మీకు అందుబాటులో ఉంటానని చెప్పారు. పరకాల నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో కలకలం
కొండా మురళి, సుస్మిత వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగుతోంది. సీఎంను తిట్టినప్పటికీ తర్వాత రాజీ కుదిరిందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే విపక్ష బీఆర్ఎస్ ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతుండగా తాజాగా కొండా మురళి ఈ సంఘటన గుర్తుచేయడం… మారిన గాయాన్ని రేపినట్లుగా ఉందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో కొండా మురళి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యల అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది. దీంతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటితో, పశ్చిమ ఎమ్మెల్యే నాయినితో విభేదాలు నెలకొన్నాయి. మేడారం జాతర సందర్భంగా కూడా వివాదాస్పదంగా మారారు. ఈ నేపథ్యంలో కొండా మురళి మాట్లాడుతూ పరకాల మా అడ్డా అంటూ కొత్త వివాదానికి తెరతీశారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నది. పరకాలలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రేవూరికి వ్యతిరేకంగా పరకాల నియోజకవర్గంలో ముఖ్యంగా గీసుకొండ మండలంలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కొందరు సర్పంచ్లను పోటీకి నిలబెట్టి గెలుచుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాలలో కొండా దంపతులు పెత్తనం చెలాయిస్తున్నారంటూ రేవూరి ఇప్పటికే అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ లొల్లి ముగియకముందే కొమ్మాలలో వచ్చే ఎన్నికల్లో తన బిడ్డ పరకాల నుంచి పోటీచేస్తందంటూ ప్రకటించి వివాదాన్ని మురళి మరింత తీవ్రం చేశారని భావిస్తున్నారు. దీనిపై రేవూరి వర్గం ఏ విధంగా స్పందిస్తోందోననే చర్చ సాగుతోంది.
పట్టుంటే పరకాలను ఎందుకు వీడారు?
పరకాలలో కొండా దంపతులకు అంత పట్టుంటే ఎందుకు పోటీచేయలేదని కాంగ్రెస్‌లోని కొండా వ్యతిరేక వర్గం నాయకులు ప్రశ్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత జరిగిన 2011లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2018లోనూ రెండు పర్యాయాలు పోటీచేసి ఓటమిపాలయ్యారని వారు గుర్తుచేస్తున్నారు. పరకాల వదిలి, పార్టీ మారి, 2014లో టీఆర్ఎస్ పక్షాన వరంగల్ తూర్పులో పోటీచేసి గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తూర్పును విడిచిపెట్టి వచ్చి కాంగ్రెస్ లో చేరి 2018లో పరకాలలో పోటీచేసి ఓటమిపాలయ్యారని, మళ్ళీ పరకాల వదిలి తిరిగి కాంగ్రెస్ పక్షాన వరంగల్ తూర్పులో పోటీచేసి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమకు అనుకూలంగా పోటీచేయడం వీరికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు తమ బిడ్డ పరకాలలో పోటీచేస్తుందని చెబుతున్నారని కాంగ్రెస్‌లోని కొండా వ్యతిరేక వర్గాలు విమర్శిస్తున్నాయి. కొమ్మాల వేదికగా కొండా మురళి చేసిన తాజా ప్రకటన మరోసారి పార్టీలో అంతర్గత విబేధాలను రచ్చకెక్కించాయని అంటున్నారు. దీనిపై ప్రత్యర్ధులు ఏ విధంగా స్పందిస్తారనే చర్చసాగుతోంది.
