Minister Konda Surekha | సురేఖ రాజీ పడతారా? రాజీనామా చేస్తారా?

క్యాబినెట్‌కూ వెళ్లలేదు.. ప్రభుత్వ వాహనం వాడలేదు.. పోలీస్‌ సెక్యూరిటీని వద్దన్నారు. ముఖ్య నేతలను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.. ఇంతకీ కొండా సురేఖ ఏం చేయబోతున్నారు? మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?

  • By: TAAZ |    telangana |    Published on : Oct 17, 2025 9:12 AM IST
Minister Konda Surekha | సురేఖ రాజీ పడతారా? రాజీనామా చేస్తారా?

హైదరాబాద్, అక్టోబర్‌ 17 (విధాత ప్రతినిధి):

Minister Konda Surekha | రాష్ట్ర అడవులు, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి సురేఖ ఆఫీసర్ ఆన్ డ్యూటీ (ఓఎస్డీ) సుమంత్‌ తొలగింపు వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి.. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బుధవారం రాత్రి సురేఖ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వెళ్లడం, సురేఖ కుమార్తె సుస్మిత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై బహిరంగ విమర్శలు చేయడంతో ఒక్కసారిగా హీటెక్కింది. అది గురువారం రాత్రి వరకు అనేక మలుపులు తిరిగి.. ఇంకా కొనసాగుతునే ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సీ రోహిన్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు సుస్మిత ప్రకటించడం గమనార్హం. అయితే.. బహిరంగ విమర్శలు చేయవద్దని ఢిల్లీ హైకమాండ్ పెద్దల ఆదేశం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు గురువారం ఉదయం నుంచి సురేఖ, ఆమె కుమార్తె మౌనం వహించారు. వాస్తవానికి ఇవాళ ఉదయం మీడియాతో సురేఖ మాట్లాడతారని ప్రచారం జరిగినప్పటికీ పార్టీ పెద్దల ఆదేశంతో తాత్కాలికంగా విరమించుకున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డి స్పందించలేదు.

కుదిపేస్తున్న దక్కన్‌ సిమెంట్స్‌ గొడవ

దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ గొడవ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. దీనికితోడు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ ప్రవేశంతో రచ్చ రచ్చ అవుతోందంటున్నారు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌కు తన ప్రైవేటు వాహనంలో మంత్రి కొండా సురేఖ వెళ్లి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. వివాదం ఎలా మొదలైందనే అంశపై ఆయనకు వివరణ ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… సూర్యాపేట జిల్లాలోని భవానీపురంలో దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీ విషయంలోనే చర్చల కోసం సుమంత్‌ను రోహిన్ రెడ్డి వద్దకు పంపించినట్లు ఆమె తెలిపారు. అసలు ఈ గొడవతో తమకు సంబంధం లేదని, అనవసరంగా తన ఓఎస్డీని ఇరికించి బద్నాం చేస్తున్నారని ఆమె చెప్పారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తన ఇంటి వద్దకు రాగా, ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడానన్నారు. ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన పాత గొడవతో తనకు సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన తనతో తెలిపారని ఆమె చెప్పారు. ఆ తరువాత సురేఖ బేగంపేట ప్రజాభవన్‌కు వెళ్లి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. సుమారు గంట పాటు ఆయనతో చర్చించారు. దక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు పూసగుచ్చినట్టు ఆయనకు వివరించారు. అయితే.. మంత్రి మండలి సమావేశానికి సమయం కావడంతో ఆయన సచివాలయానికి వెళ్లిపోయారు. ప్రజా భవన్ నుంచి బయటకు వచ్చిన తరువాత సురేఖ తన కుమార్తె సుస్మితను వెంట తీసుకుని హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత తనకు ఎదురవుతున్న అవమానాలు, వ్యతిరేక శక్తులపై సవివరంగా ఆమె తెలియచేశారని సురేఖ వర్గీయులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని, తనకు తెలియకుండా తన శాఖలో నిర్ణయాలు జరుగుతున్నాయని మీనాక్షి, మహేశ్‌గౌడ్‌కు ఆమె చెప్పారని తెలిసింది. వీటిని తను ప్రశ్నించడం మూలంగానే తన ఓఎస్డీపై పోలీసు కేసు పెట్టారని, ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను అవమాన పరుస్తున్న విషయాన్ని కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు ఇతర పెద్దలకు తెలియచేశానని అన్నారు. గంటన్నరకు పైగా వీరి సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయవద్దని మీనాక్షీ, మహేష్.. సురేఖకు స్పష్టం చేసినట్టు సమాచారం. అనంతరం బయటకు వచ్చిన సురేఖ.. మీడియాతో కుప్లంగా మాట్లాడారు. తన ఆలోచనలు, ఇబ్బందులను వారికి తెలియచేశానని, వారందరూ కూర్చుని పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు. వాళ్లిద్దరికి చెప్పాల్సింది చెప్పి, వారికే వదిలేసి వచ్చానన్నారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సురేఖ తెలిపారు.

మంత్రి మండలి సమావేశానికి గైర్‌హాజర్‌

గురువారం మధ్యాహ్నం మంత్రి మండలి సమావేశానికి సురేఖ హాజరుకాలేదు. మంత్రి మండలి సమావేశానికి రావాల్సిందిగా ఆమెకు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) సమాచారం పంపించారంటున్నారు. అయినప్పటికీ ఆమె ఉదయం నుంచి వరుసగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో సమావేశం అయి తనకు ఎదురవుతున్న అవమానాల గురించి ఏకరువు పెట్టారు.

బుల్లెట్ ఫ్రూప్ వాహనం, సెక్యూరిటీ వదిలి..

ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం, పోలీసు సెక్యురిటీని గురువారం ఉదయమే సురేఖ వదిలేశారు. ఇకనుంచి తన వెంట రావాల్సిన పని లేదని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తెలియచేశారు. విషయాన్ని సిబ్బంది వెంటనే తమ పై అధికారులకు తెలియచేశారు. ఆమె వారించినప్పటికీ వెంట వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ ఆమె తనతో రావద్దని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి స్పష్టం చేయడం గమనార్హం. ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం కూడా వదిలేసి, తన వ్యకిగత వాహనంలో వెళ్లిపోయారు.

మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?

ఉదయం నుంచి వరుస భేటీలో బీజీ గా ఉన్న ఆమె గురువారం అర్థరాత్రికి వరంగల్ నగరానికి చేరుకోనున్నారు. అక్కడ తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుతో గురువారంనాటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. సన్నిహిత వర్గాల కథనం ప్రకారం ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. విలువ లేని మంత్రివర్గంలో కొనసాగే బదులు వదిలేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. అయితే.. గతంలో రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా రాజీనామా సమర్పించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్ధతు పలికారని ఒక ముఖ్య నాయకుడు గుర్తు చేస్తున్నారు. అంతటి సాహసం ఇప్పుడు చేయకపోవచ్చని, అధిష్ఠానం నుంచి సానుకూలత ఉన్న సమయంలో రాజీనామా చేయకపోవచ్చని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ భావాలు కలదని, ప్రాంతీయ పార్టీ కాదని, ఇలాంటి వివాదాలు జరుగుతునే ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. హైకమాండ్‌ పెద్దల జోక్యంతో త్వరలో వివాదానికి ఫుల్ స్టాప్‌ పడుతుందంటున్నారు.