Warangal Congress rift | ఒడువని వరంగల్ కాంగ్రెస్ లొల్లి … కొండా సురేఖ పై ఫిర్యాదు

వరంగల్ తూర్పులో రచ్చకెక్కిన కాంగ్రెస్ విభేదాలు ఒడువని ముచ్చటగా తయారయ్యాయి. తాజాగా తూర్పులో నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరాయి

  • By: Tech |    telangana |    Published on : Dec 19, 2025 11:41 PM IST
Warangal Congress rift | ఒడువని వరంగల్ కాంగ్రెస్ లొల్లి … కొండా సురేఖ పై ఫిర్యాదు
  • ఒడువని వరంగల్ తూర్పు కాంగ్రెస్ లొల్లి
  • రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షిని కలిసిన రమేష్
  • మంత్రి కొండా సురేఖ వ్యతిరేకుల ఫిర్యాదు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:  వరంగల్ తూర్పులో రచ్చకెక్కిన కాంగ్రెస్ విభేదాలు ఒడువని ముచ్చటగా తయారయ్యాయి. తాజాగా తూర్పులో నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరాయి. వరంగల్ తూర్పులో గత కొంతకాలంగా చాపకింద నీరులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ దంపతులకు ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య విభేదాలు తీవ్రమై గ్రూపు వార్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు ఆయూబ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులకు మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ మేరకు వీరంతా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ లవారీగా ఈ వర్గం కాంగ్రెస్ నాయకులు నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశాలపై మంత్రి సురేఖ ఇటీవల తీవ్రంగా స్పందించారు. తమకు వ్యతిరేకంగా చిల్లగాండ్లంతా ఒక్కటవుతున్నారంటూ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శల పై ఎదుటి పక్షం అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. ఈ చిల్లరగాండ్లే కలిసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిగా చేశారంటూ ఘాటుగా ప్రతిస్పందించారు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో పీసీసీ సభ్యుడు, కొండా వర్గానికి సన్నిహితునిగా ముద్రపడి, ఇటీవల వారిని వ్యతిరేకిస్తున్న నల్లగొండ రమేష్ ఆధ్వర్యంలో తూర్పునకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి తూర్పులో తాజాగా జరిగిన పరిణామాల పై, మంత్రి కొండా సురేఖ దంపతులపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా మంత్రి అనుచరులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీకి నష్టం కలిగించే విధానాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందిన మీనాక్షి పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్ తూర్పు కాంగ్రెస్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారినట్లు భావిస్తున్నారు.