Medaram Photos | జాతరమ్మ … జాతరో మేడారం జాతర.. తీరొక్క రంగులతో ఊర్లకూర్లువచ్చే జాతర!

మేడారం జాతర ప్రారంభమై గురువారానికి రెండు రోజులవుతోంది. గద్దెలపైకి ముగ్గరు పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మలు చేరుకున్నారు. రాత్రికి సమ్మక్క గద్దెలపైకి చేరుకోనున్నారు. దీంతో జాతర పతాక స్థాయికి చేరింది.

  • By: TAAZ |    telangana |    Published on : Jan 29, 2026 9:44 PM IST
Medaram Photos | జాతరమ్మ … జాతరో మేడారం జాతర.. తీరొక్క రంగులతో ఊర్లకూర్లువచ్చే జాతర!

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Medaram Devotees Rush | జాతరమ్మ…జాతర…మేడారం జాతర. తీరొక్క రంగులతో ఊర్లు తరలివచ్చే జాతర. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలు మూడు రోజులు కొలువుదీరే జన జాతర. రెండేళ్ళకోసారి జరిగే జాతరకు సబ్బండవర్ణాలు తరలివస్తాయి. జాతర వస్తుందంటేనే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఉన్నంతలో మేడారం వెళ్ళడం అక్కడ వనదేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. మట్టిమనుషులతో ఎక్కడెక్కడి నుంచే తరలివచ్చి ఆ నాలుగు రోజులు మేడారం పరిసరాల్లో గుఢారాలు, తాత్కాలికంగా పందిళ్ళు, వీలైతే టెంట్లు, వచ్చిన వాహనం కింద తగిన ఏర్పాట్లు చేసుకుని ఇంటిల్లిపాది నాలుగు రోజులు మకాం వేయడం ఆనవాయితీగా వస్తోంది.

నాలుగు రోజులు కాకపోయినా రెండు రోజులైనా అక్కడే ఉండేవిధంగా సరంజామాతో వస్తారు. జంపన్నవాగులో స్నానాలు చేసి గద్దెలపైకి చేరిన తల్లులను దర్శనం చేసుకుని తల్లులకు ఇష్టమైన బంగారం (బెల్లం), పసుపు, కుంకుమలు, వడిబియ్యం సమర్పించి. తమకు చేతనైన మేరకు హుండిలో కానుకలు సమర్పించుకునే సామాన్యమైన జాతర. కొబ్బరి కాయలు కొట్టి కోడిపిల్లో…మేకపిల్లో బలిఇచ్చి మాంసం, మద్యంతో విందారగించి తిరిగి ఇంటికి చేరుకోవడం మేడారం జాతరలో సాధారణంగా కనిపించే దృశ్యం. మేడారం చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా గుఢారాలు, చెట్ల కింద సేదదీరడం, వంటలు, వార్పులు, కోళ్ళు, మేకలు కోయడం ఇంటిల్లిపాది బిజిబిజీగా కనిపిస్తారు. ప్రస్తుతం మేడారం పరిసరాలు జనంతో నిండిపోయింది. కొంత స్థోమత ఉన్న వారు కొందరు కిరాయి గుడారాల్లో ఉంటున్నారు.

ఇక మేడారం, జంపన్నవాగు, బస్టాండు ఏరియా, గద్దెల ప్రాంగణంలో వ్యాపారాలు, దుకాణాల సముదాయం, చిన్న చిన్న వస్తువులు, ఆభరణాలు, ఇంటిసామాన్లు, రకరకాల వస్తువులూ, తినుబండారాలతో రద్దీగా మారిపోయాయి. మేడారంలోని రోడ్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. శివసత్తుల పూనకాలు, జంపన్నవాగులో తలనీళ్ళారా స్నానాలు జాతరలో ఒక్కోక్కటి ఒక్కో దృశ్యం. పిల్లాపాపలు, గుంపులు, గుంపులుగా తండొపతండాలుగా తరలివచ్చే జాతర. ఈ సారి మేడారం జాతర ప్రారంభమై గురువారానికి రెండు రోజులవుతోంది. గద్దెలపైకి ముగ్గరు పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మలు చేరుకున్నారు. రాత్రికి సమ్మక్క గద్దెలపైకి చేరుకోనున్నారు. దీంతో జాతర పతాక స్థాయికి చేరింది.