Kagaar Operation | కగార్ చక్రబంధంలో కామ్రేడ్ల యుద్ధతంత్రం… థ్రిల్లర్‌ సినిమా దీని ముందు దిగదుడుపే

మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా సాగుతున్న కగార్ ఆపరేషన్ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమవుతుండగా, పలువురు నాయకులు లొంగిపోతున్నారు. కుల్హాడిఘాట్ ఘటనలపై ఒడిశా రాష్ట్ర కార్యదర్శి ఫినిక్స్ చెప్పిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Kagaar Operation | కగార్ చక్రబంధంలో కామ్రేడ్ల యుద్ధతంత్రం… థ్రిల్లర్‌ సినిమా దీని ముందు దిగదుడుపే
  • కత్తుల వంతెన పై నిత్యపోరాట జీవనం
  • కుల్హాడి ఘాటిలో భద్రతాదళాల వరుస దాడులు
  • చక్రబంధాలను చేదిస్తూ బయటపడిన తీరు
  • మావోయిస్టు పార్టీ ఒరిస్సా మాజీ సెక్రెటరీ ఫినిక్స్ అనుభవం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Kagaar Operation | మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర బీజేపీ సర్కారు చేపట్టిన కగార్ ఆపరేషన్లో భాగంగా మారుమూల అటవీప్రాంతంలో మావోయిస్టులను వేల మందితో కూడిన కేంద్ర సాయుధ దళాలు వెంటాడి వేటాడి ఎన్ కౌంటర్లలో హతమారుస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మధ్య భారతంలోని అటవీ ప్రాంతాలు, మారు మూల గిరిజన ప్రాంతాలు నిత్యం రక్తమోడుతున్న సంగతీ తెలిసిందే. వరుసగా జరిగిన భారీ స్థాయి ఎన్‌కౌంటర్లలో, చుట్టుముట్టి సాగిస్తున్న దాడుల పరంపరలో ఇప్పటికే వందల మాది మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు, కార్యకర్తలు మృతిచెందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆయుధాలు లేకుండా కొందరు, ఆయుధాలతో భారీ సంఖ్యలో లొంగిపోయారు. ఈ పరంపర ఇంకా సాగుతున్నది. ఈ నేపథ్యంలో గత నెలలో కుల్హాడిఘాట్ అటవీ ప్రాంతంలో సాయుధ బలగాల చక్రబంధనం నుంచి వరుస దాడుల నుంచి బయటపడిన తీరును ఇటీవల లొంగిపోయినమావోయిస్టు పార్టీ ఒరిస్సా కార్యదర్శి ముప్పిడి సాంబయ్య అలియాస్ ఫినిక్స్ పేరుతో రాసిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.

మూడు చక్రబంధనాలు

కుల్హాడిఘాట్ అడవిలో మూడు రోజుల చక్రబంధం నుండి 33 మందిమి బయట పడ్డాక ముందే నిర్దారించుకున్న ఆర్.వి స్థలంలో 30 మందిమి రీ గ్రూప్ అయ్యాం. ఇందులో ముగ్గురు మాత్రం గందరగోళ పడి ఆర్.వి స్థలంలో ఆగకుండా వెళ్లిపోయి పిభ్రవరి 5న గరియాబంద్ పోలీసుల ముందు సరెండయ్యారు. ఈ 30 మందిలో 8 మంది గాయపడిన కామ్రేడ్లు ఉన్నారు. అప్పటికీ తమ దాడిలో తప్పించుకున్న వాళ్ల కోసం అడవిలో కూంబింగ్ కొనసాగుతున్నది. పైన డ్రోన్ నిరంతరం తిరుగుతున్నది. వాటి మధ్యనే అనేక జాగ్రత్తలతో దాగుడు మూతలు ఆడుతూ గాయపడిన కామ్రేడ్స్‌కు ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం. ఓ నెల రోజుల పాటు రోజుకు ఒక్క పూట మాత్రమే మనిషికి (దొప్పెడు) కప్పు అన్నం… అది కూడా ఉప్పుతో నంజుకుని తింటూ గడిపాం. గాయపడిన కామ్రేడ్సుకు మాత్రం డొప్పన్నర అన్నం ఇచ్చే వాళ్లం. నెల పదిహేను రోజులు ఇలా డేరాలు మారుస్తూ (మూవింగులో మూవింగు) గడిపాక SDK ఏరియాలోని ఆమమొర వాగు వైపుకు వెళ్లాం. ఆ వాగుకు కింద సికాసార్ డ్యాం కట్టారు.

రెండో చక్రబంధం

కుకుడార్, సరాయినాల అనే రెండు ఊర్లను కలిసి కొన్ని తిండి సరుకులు తీసుకుని వాగుకు ఇవతలి వైపు డేరా వేశాం.రెండవ రోజు రాత్రికి రాత్రే చత్తీస్ఘడ్, ఒడిశా పోలీసులు సమన్వయంతో వాగును రెండు వైపుల నుండి చుట్టు ముట్టారు.ఆరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మేమంతా రెండు బ్యాచ్ లుగా విడిపోవాల్సి వుంది. అవసరమైన విషయాలన్నీ మాట్లాడుకుని ఎపిటి (అప్పాయింట్ మెంట్) లు కూడా పెట్టుకున్నాం. మరో పది నిమిషాల్లో మాటలు ముగిస్తామనుకుంటుండగా ఔటర్ సర్కిల్లో సివిల్ పెట్రోలింగు డ్యూటీలో వున్న ఇద్దరు మహిళా కామ్రేడ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసు బ్యాచ్ సెంట్రీ పోస్టుకు వంద గజాల దూరం వరకు వచ్చిందని కబురు చెప్పారు. వెంటనే మేమంతా అలర్టై ముఖ్యమైన సామాన్లు తీసుకుని శత్రువు కనిపించిన దానికి వ్యతిరేక దిశలో వాగును దాటి గుట్ట పైకి ఎక్కాం. సికాసార్ డ్యాం దిశలో కొంత ముందుకు వెళ్లి ఒడిశా వైపు నుండి వాగులోకి దిగే ఓ కాలి బాటను దాటి ముందు కెళ్లాలని… పోతున్నాం. ఆ కాలి బాటకు ఇవతలి వేపే ఒక పోలీసు పార్టీ మాటుకాచి (ఆంబుష్) కూర్చున్నది. మేము డేరా ఖాళీ చేసి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే డేరాను ఆక్రమించిన పోలీసు పార్టీ మేం వెళుతున్న దిశ గమనించి మాటుగాచిన బ్యాచీలకు కబురు ఇవ్వడంతో అన్ని బ్యాచీలు కాచుకుని వున్నాయి. మేం చక్రబంధం మధ్యలో వున్నాం. మేం దగ్గరికి సమీపించగానే ఒకేసారి హఠాత్తుగా గుండ్ల వర్షం కురిపించారు. అందరం వెనక్కి పరిగెత్తుతుండగా నేను స్లిప్పయ్యి కింద పడ్డాను. మోచేతికి గాయమయింది. కొన్ని సామాన్లు అక్కడే వదిలేసి రిట్రీటయాం. ఇది ఒక బ్యాచ్ కాదు… అనేక బ్యాచీలున్నాయి. ఇది మరో కుల్హాడిఘాటీనే అని అందరం అనుకున్నాం. ముందుకెళ్తుంటే అంతటా పోలీసుల బూట్ల గుర్తులే.

మేం కుల్హాడిఘాట్ ఘటనను సమీక్షించి గుణపాఠాలు రాసుకున్నాం. గనుక వాటి వెలుగులో మేం ఒక దిశలో పోతున్నట్లు శతృవును తప్పుదారి పట్టించి, పిల్లి అడుగులతో కాల్పులు చేసిన పోలీసుల వెనుకన చేరాం. శతృవు దృష్టంతా మేం మళ్లీ నదిని దాటి అవతలికి వెళతారనుకున్నారు. మేం వ్యతిరేక దిశలో తిరిగి శతృవు వెనక చేరడం వాళ్లు ఊహించి వుండరు. అలా బతికి బట్టకట్టాం. ఇప్పుడు జరుగుతున్న కగార్ దాడులన్నీ చుట్టు ముట్టి మట్టుబెట్టే దాడులే. చుట్టివేత అనేది 15 కిలోమీటర్ల దూరం వరకు అనేక వలయాలుగా ఉంటున్నది. కాబట్టి ఉదయం పది గంటలకు ప్రారంభమైన నడక ఏకధాటిగా 18 గంటలు నడిచి, తెల్లవారు జాము నాలుగు గంటలకు మరో ఏరియాలో తేలాం. తిండి పదార్థాలు పోగొట్టుకున్నాం. మళ్లీ రేషనింగే. తగిన జాగ్రత్తలతో పరిస్థితి క్లియర్ అయ్యే వరకు ఉండి, ఓ ఐదు రోజుల తర్వాత మేం రెండు బ్యాచ్ లుగా విడిపోయాం. ఓ పది మందితో కూడిన మా బ్యాచ్ బలంగీర్, బర్గడ్, మహా సముంద్ డివిజన్ కు ప్రయాణం అయింది. ఆమమొర వాగు చక్రబంధ నుండి తప్పుకున్న బ్యాచ్ ఎటు వెళ్లి ఉంటుందనే అంచనాలతో వేట కొనసాగుతూనే వుంది.

మూడో చక్రబంధం

మా డివిజన్లో ముందు నుండే ఓ ఏడుగురి బ్యాచ్ తిరుగుతూ ఉండింది. వాళ్లతో రెగ్యులర్ గా వాకీటాకీ ద్వారా సమన్వయం కొనసాగుతున్నది. అయితే ఈ ఏపిటీలన్నీ చూస్తున్న కామ్రేడ్ కుల్హాడిఘాటీ ఘటనలో భయకంపితుడై, బలహీన పడి సరెండర్ అయి వున్నాడు. అతనికి నేను BBM డివిజన్ కు పోయే ప్రోగ్రాం మొత్తం తెలుసు. ప్రయాణం ప్రమాదకరమైందే. అయితే నేను పోక పోతే చిన్న చిన్న టెక్నికల్ పొరపాట్లతో డివిజన్లో ఉన్న 7 గురు కామ్రేడ్సును కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్లను రక్షించుకునేందుకైనా పోవాల్సిందే తప్పదు. మా బ్యాచ్ అందరినీ మోటివేట్ చేసి అదనపు జాగ్రత్తలతో కూడిన పథకం రూపొందించుకున్నాం. శతృవుకు మా ప్రయాణం గురించి తెలుసు అనే విషయం తెలిసీ దాగుడు మూతలతో కత్తి మీది సాములా మా ప్రయాణం సాగింది. ఒక చోట సాయంత్రం 6 నుండి తెల్లవారి జాము 6 గంటల వరకు సుమారు 12 గంటలు ఏకధాటిగా నడిచి రెండు పెద్ద హైవే రోడ్లు దాటి మైదానంలోనే ప్రయాణం చేయాలి. తర్వాత ఒక రోజు పగలంతా ఓ చిన్న గుట్టబోర్ కు పగలంతా ఎవరి కంటపడకుండా దాక్కోవాలి. సాయంత్రం 6 గంటలకు బయలు దేరి మైదానాలు, పెద్ద రోడ్లు, రైల్వే లైన్ దాటి గందమర్దన్ పర్వతం అంచుకు చేరాల్సి వుంటుంది. BBM నుండి సోనబెడకు రాకపోకలు చేయడంలో అన్నిటికంటే బలహీనమైన స్థలం ఈ గుట్టబోరే. చుట్టూ మైదానం, పెద్ద ఊర్లు, పెద్ద రోడ్లు, పోలీసు స్టేషన్లకు అతి సమీపంలో ఒక పగలంతా (6 నుండి 6 వరకు) గడపడం ప్రమాదంతో కూడుకున్నదే అయినప్పటికి మరో మార్గం లేదు. ఆ గుట్ట బోర్లో నీళ్లు ఉండవు. కిలోమీటర్ దూరాన మైదానంలో వున్న ఓ వ్యవసాయ బావి నుండి రాత్రికి రాత్రే నీళ్లు తెచ్చుకోవాలి. పగలు వంట చేస్తే పొగ రావడం కూడా చుట్టూ ఉన్న ఊర్లకు కనబడుతుంది. కాబట్టి సమస్యనే. మరో అదనపు సమస్య ఏమిటంటే 2023 లో మా డివిజన్ నుండి పారిపోయి సరెండరయిన ముగ్గురు శతృవు చేతిలో వుండి మా ప్రయాణపు రూట్లు, డేరా వేసే స్థలాలు, రోడ్లు, రైల్ లైన్లు దాటే పాయింట్స్ అన్నీ శతృవుకు చెప్పి వున్నారు. కాబట్టి ఏ చిన్న పొరపాటుకు కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మేం ఈ సారి ఆ గుట్టబోర్ దగ్గరి వాటర్ పాయింట్ టచ్ చేయలేదు. పాత డేరాలన్నీ వదిలేసి శతృవు ఊహకందని కొత్త స్థలంలో ఆగాం. వెంట తీసుకెళ్లిన నీళ్లతోనే సరిపెట్టుకున్నాం. రెండు పూటలా వెంట తెచ్చుకున్న రొట్టెలతోనే సరిపెట్టుకున్నాం. ఆరోజు చాయికి రెస్ట్ ఇచ్చాం. కాబట్టి పొగ సమస్యే లేదు. ఇవన్నీ కగార్ దాడి నుండి రక్షించుకునేందుకు తీసుకుంటున్న అదనపు జాగ్రత్తలు. మేం వాకీలో శతృవును మిస్ గైడ్ చేసేలా సమాచారం ఇస్తూ కలుసుకునే స్థలాన్ని ఇటూ అటూ మారుస్తూ మొత్తం మీద ఎపిటి స్థలానికి చేరుకున్నాం. మేం గందమర్దన్ చేరుకున్న రాత్రే మేం పడుకున్న స్థలంపై డ్రోన్ తిరిగింది. ఉదయమే 7:30 నిమిషాలకల్లా ఎపిటి స్థలానికి చేరాం.8-, 9 గంటలకు ఎపిటి. మేం గుట్ట పైన వున్నాం. కింద 15 నిమిషాల దూరం వాగు నుండి నీళ్లు తెచ్చుకుని చాయి చేసుకోవాలని అందరూ ఆతురత పడుతున్నారు. నేను వాకీలో స్థానిక దళం కలిసి వాటర్ పాయింట్ సేఫ్ అని చెప్పాక మాత్రమే నీళ్లు తెచ్చి చాయి చేయాలని నేను గట్టిగానే చెప్పాక ఆగారు. కొద్ది మంది గొణగడం చూసి, సరే! మనం తాగే నీళ్ల తోనే టీ చేయండని చెప్పడంతో టీ చేశారు. తాగుతుండగానే లోకల్ దళం వాకీలో కలిసి మీరు ఆ స్థలంలో వుండకండి.. కింద వాటర్ పాయింట్ లో నిన్నటి నుండి ఒక పోలీస్ ఆంబుష్ కూర్చున్నది.. అనే వార్త చెప్పారు. మేం వెంటనే ఖాళీ చేసి గుట్ట పైకి పోయి ఆగాం. వాకీ ద్వారా సమన్వయం చేసుకుంటూ పోలీసు బలగాల మధ్యలోనే ఇరువైపులా ఉన్న కామ్రేడ్సును కలుసుకున్నాం.

గందమర్దన్ దళం చెప్పిన రిపోర్టు ప్రకారం గత నెల రోజులకు పైగా కూంబింగు బాగా పెరిగింది. ఒకసారి సరుకుల కోసం అనుపల్లి అనే ఊరుకు పోతే రింకు టీంపై ఫైరింగ్ జరిగింది. ఏ గ్రామానికి పోయినా అరగంట లోపే పోలీసులు చుట్టుముడుతున్నారు. రెండు సార్లు సివిల్ లో ఊరిని కాంటాక్ట్ చేయడానికి పోయిన వాళ్లు పోలీసులు వెంటబడితే తప్పుకొని వచ్చారు. అడవిలో వాళ్లు తిరగని జాగ లేదు. దాంతో లోకల్ దళం వాళ్లు కొంత ఆందోళనతో ఉన్నారు. నేను కలువడంతో కొంత తేరుకున్నారు.

అయితే మేమంతా చాలా గంటలు నడిచి అలిసిపోయి వున్నాం. తిండి కావాలి. చుట్టూ పోలీసు బలగాల మధ్య పోలీసుల బూట్ల గుర్తుల్ని చూస్తూ జాగ్రత్తగా కొన్ని గంటలు ముందుకెళ్లి వంటకోసం ఒక వాగు ఒడ్డున ఆగాం. ఒక పోలీసు పార్టీ అక్కడి నుండే గుట్ట పైకి ఎక్కిన గుర్తులు ఉన్నాయి. పైలట్ టీం ఆగి, మమ్మల్ని ఆగమని సిగ్నల్ ఇచ్చి పోలీసుల అడుగు జాడల్ని పరిశీలించి ఈ బ్యాచ్ ఉదయం ఎక్కిందని నిర్ధారించారు. (ఆదివాసీ కామ్రేడ్స్ అడుగుజాడలు ఎప్పటివి అని నిర్దారించడంలో మంచి ఎక్స్‌పర్టులు)

మేం నీళ్లు తెచ్చి వంట మొదలెట్టాం. అరగంట వ్యవధిలోనే హరిశంకర్ క్యాంపు నుండి ఒక డ్రోన్ వచ్చి మూడు సార్లు చక్కర్లు కొట్టి పోయింది. కింద పోలీసు బలగాల మోహరింపు అర్ధమవుతున్నది. హరి శంకర్ క్యాంపు నుండి 20, 25 వరకు మోటర్ సైకిళ్లు మొహుల్ పల్లి ఊరు దాటి మేం వంట చేస్తున్న గుట్ట కింద వున్న గుప్తేశ్వర్ మందిరం వరకు వచ్చాయి. వెంటనే మేం ఎమర్జెన్సీ మీటింగ్ జరిపి వంట తొందరగా ముగించుకుని డేరా ఖాళీ చేసి రాత్రికి రాత్రే లైట్లు వేయకుండా చేతి కర్రల సహాయంతో గుట్ట దిగి పోలీసులకు టచ్ కాకుండా వాళ్ల ముడ్డి కింది నుండే నిశ్శబ్దంగా చుట్టు తిరిగి మైదానం దాటి మరో గుట్ట పైకి వెళ్ళాం. వెంట నీళ్లు తీసుకెల్లి నీళ్లు లేని ఎక్కరాని, దిగరాని ప్రాంతంలో ఆగాం. మధ్యాహ్నం వరకు నిశ్శబ్దంగా ఉండి మద్యాహ్నం చుట్టు పరిస్థితి క్లీయర్ అయాక కిచిడీ చేసుకుని తిన్నాం. మాకు పది నిమిషాల దూరం నుండి ఒక బ్యాచ్ గుట్టెక్కిన బూట్ల గుర్తులు చూశాం.

సాయంత్రం నాలుగు గంటలకు బయలు దేరి హరిశంకర్ వాగుకు వంట చేసుకుని తిని, రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం లేచి ఇంకా ముందుకెళ్లాలనేది ప్లాను.మేం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హరిశంకర్ వాగులోకి దిగి ఒక మూల మలుపు వద్ద కిట్లు, మూటలు దించుకున్నాం. ఓ ముగ్గురి టీం పాత డేరా చెక్ చేసి రావడానికి కొంత ముందుకెళ్లగానే అవతలి వైపు ఒక పోలీసు పార్టీ దిగుతుండడం కనిపించింది. ఇరువైపులా ఒకేసారి ఒకరినొకరు చూసుకోవడం మూలంగా మేమే చొరవగా ముందు కాల్పులు ప్రారంబించడంతో శతృవు ఆత్మ రక్షణలో పడడాన్ని అవకాశంగా తీసుకుని మేం వేగంగా వెనక్కి పరిగెత్తి వాళ్ల కాల్పుల రేంజి నుండి దూరంగా వెళ్లి పోయాం. అయితే మా కామ్రేడ్సులో 7 గురి కిట్లు, వంట గిన్నెలు, వంట సామాన్లన్నీ పోగొట్టుకున్నాం.

సాయంత్రం చీకటి పడగానే చీకటిని ఆధారంగా చేసుకుని రాత్రంతా నడిచి శతృవు ఊహించని దిశలో ప్రయాణం చేసి ఓ చోట రక్షణ తీసుకున్నాం.పగలు పరిస్తితి క్లీయర్ అయినంక మిగిలిన కొద్దిపాటి నూకల్ని పల్చని జావలాగా కాచుకుని తాగాం.మరునాడు ఉదయానికల్లా ఒక పోలీసు పార్టీ మేమున్న చోటికి పది నిమిషాల దూరంలో మకాం వేసింది.మా స్కౌట్లు సమాచారం ఇవ్వడంతో మేము చడీ చప్పుడు లేకుండా వాళ్లు వెళ్లిపోయే దాక నిరీక్షించాం.వాళ్లకు మేము అక్కడ ఉన్నట్లు అర్థం కాలేదు.పోయే బ్యాచ్ లు పోతున్నాయి. వచ్చే బ్యాచీలు వస్తున్నాయి. పైన మాత్రం రాత్రి, పగలు డ్రోన్లు తిరుగుతూనే వున్నాయి. ఇలా ఓ పదిహేను రోజుల చక్రబంధం కొనసాగింది. ఈ మధ్యలోనే ఎలా బతకొచ్చో పరిస్థితులే మాకు నేర్పాయి. 15 రోజుల గాలింపులో ఎక్కడా మా ఉనికిని కనిపెట్టలేని శతృవు.. చివరికి బలగాల్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు మేం బయటపడి దూరంగా మరో ప్యాకెట్లోకి వెళ్లిపోయాం.

2025 సంవత్సరమంతా కగార్ బతుకే. ఇంటర్నెట్ ఉపయోగించడం గురించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి, దాని ప్రమాద తీవ్రత గుర్తించి దాన్ని పూర్తిగానే వదిలేయడంతో రక్షణ దొరికిన మాట నిజమే గాని బయటి ప్రపంచానికి వారధిగా కేవలం అబద్దాల ఆకాశవాణి తప్ప మరో సాధనం లేదు.దాని మూలంగా సంవత్సర కాలంగా చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది.