రాహుల్, రేవంత్ పై కేటీఆర్ ఫైర్.. కేటీఆర్ పై భగ్గుమన్న పీసీసీ చీఫ్

వరంగల్‌ సభలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌, బీఆరెస్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

  • By: TAAZ |    telangana |    Published on : May 06, 2026 9:32 PM IST
రాహుల్, రేవంత్ పై కేటీఆర్ ఫైర్.. కేటీఆర్ పై భగ్గుమన్న పీసీసీ చీఫ్
  • రాష్ట్రంలో రగిలిన రాజకీయ వేడి
  • సదస్సుతో బీఆర్ఎస్ లో ఉత్సాహం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీ అధినేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుద్ధేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన పరుష వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. రైతుల సమస్యలు కేంద్రంగా కేటీఆర్ రాజకీయ విమర్శల పేరుతో చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య అగ్గిరాజేసింది. దీంతో ఇరువర్గాలు మాటల యుద్ధానికి తెరతీశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 34 హామీల్లో ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శిస్తూ ఆయా సందర్భాల్లో ఆయన ఉపయోగించిన భాష, మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ మాట్లాడిన మాటల పై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు.

అరె హౌలా…. దివానా… బట్టేబాజ్

రైతు సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ రైతు ద్రోహి అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి మంది రైతులు మృతి చెందారన్నారు. పొరాటాల విల్లు ఎక్కుపెడితే ద్రోహులకు గుండె జల్లుమంటదంటూ వరంగల్ గొప్పదనాన్ని, కాళోజీ కవితను వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్ చిత్తుకాగితం, బోగస్ పత్రం, బక్వాస్ ముచ్చట అంటూ విమర్శించారు. ‘ అరె హౌలా… అరే దివానా… ఎందుకు బంద్ పెట్టినవ్ … రైతు బంద్ నీ అయ్య సొమ్మా… నీ అబ్బ సోమ్మా కొడుకా… అంటూ సీఎం రేవంత్ ను ఉద్ధేశించి విమర్శించారు. రైతు బంద్ బంద్ పెట్టిన హౌలాగాడు ఎవడు? రైతు బంద్ ఎగ్గొట్టిన దివానా గాడు ఎవడు? రైతు బీమాను బొందపెట్టిన హౌలా గాడు ఎవడు? బోనస్ ఎగ్గొట్టిన దోకేబాజ్ గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్ గాడ్ ఎవడు? అని కేటీఆర్ అంటుంటే సదస్సులోని కేడర్ రేవంత్ రెడ్డి అంటూ పెద్ద పెట్టున వారితో అనిపించారు. ఎక్కే విమానం దిగే విమానం తప్ప నువ్వు పీకేదేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అంటూ… కరోనా సమయంలో కూడా కేసీఆర్ ఇంటి దగ్గరికొచ్చి ధాన్యం కొంటె … ఈ సంచులు మోసే సన్నాసి రేవంత్’ రైతులను నడిరోడ్డుమీద నిలబెట్టారని విమర్శించారు. దండం పెట్టడం కాదు కాంగ్రెస్ కు పిండం పెట్టాలన్నారు. రైతు బందు బంద్ పెట్టి రాహుల్ బందు అమలు చేస్తున్నారని, నెలనెల ఢిల్లీకి కప్పం కడుతున్నారని, రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు… రెనివల్ సీఎం అంటూ విమర్శించారు. కాంగ్రేసోడు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని మాట్లాడితే ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలంటూ పిలుపునిచ్చారు.

ఎక్కడ సచ్చినవ్ రాహుల్

ఇక రాహుల్ నుద్ధేశించి కేటీఆర్ మాట్లాడుతూ ‘నువ్వు ఎక్కడ సచ్చావు రాహుల్ గాంధీ.. నువ్వు చేసిన రైతు డిక్లరేషన్ ఎక్కడ సచ్చింది… నువ్వు ఇక్కడ నిలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ గాడిద పండ్లు తోముతున్నాడు రైతులు కల్లాల కాడ అవస్థలు పడుతుంటే ఎక్కడికి పోయారు మీరు అంటూ విమర్శించారు. దొంగలున్నారు జాగ్రత్త, ఓటు దొంగలున్నారంటూ విమర్శించారు.

కేటీఆర్ నువ్వెంత…నీ బతుకెంత? : పీసీసీ చీఫ్

రైతు సదస్సులో రాహుల్ గాంధీ, రేవంత్ పై కేటీఆర్ చేసిన విమర్శల పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ నువ్వెంత…నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? ఏంటీ నీ బతుకు? ఉద్యమం ఎగిసిపడుతున్నప్పుడు వచ్చి చీమలు పెట్టిన పుట్టలో పాములెక్క దూరి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయిన నీవు అనేక త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని, సీఎం రేవంత్ ను విమర్శిస్తావా? అంటూ భగ్గుమన్నారు. జ్క్షానముండాలే? మన గతమేంటీ? మన చరిత్ర ఏంటని మరిచిపోయి మాట్లాడితే ఇబ్బందులొస్తాయన్నారు? మాదక ద్రవ్యాల ప్రభావంతో ఇలా మాట్లాడుతున్నారేమో? వాటి ప్రభావంతో నీ మానసిక స్థితి బాగా లేదంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా ఇంకా సిగ్గులేకుండా, దిగజారి కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు రాజ్యం? నెరెళ్ళలో ఇసుక దందా, భూముల ఆక్రమణ, దళితుల పై దాడులు, దళితున్ని సీఎం చేస్తామంటూ మాటతప్పితే తలకాయ తెగ్గొసుకుంటానని అన్న కేసీఆర్ పదేళ్ళు ఎవరి తలకాయ పెట్టుకున్నాడంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని, తెలంగాణ ఎట్ల వచ్చింది? ఇద్దరు ఎంపీల వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. బీఆర్ ఎస్ పాలనలో కల్లాల మీద రైతులు చనిపోయిన సంఘటనలు అప్పుడే మరిచిపోయారా? ఎందుకీ డ్రామాలంటూ విమర్శించారు.

కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: సీతక్క

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, దొర ధోరణికి పరాకాష్ట అని ఆమె మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ సంస్కారహీనతకు నిదర్శనమని సీతక్క విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ తక్షణమే రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్ సంస్కృతిని, ఫారిన్ టూర్ల అలవాటును వీడి ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీ పేరుతో రైతులను వంచించారని సీతక్క విమర్శించారు. నాలుగు విడతల పేరుతో వడ్డీల భారం మోపిన చరిత్ర బీఆర్ఎస్‌ది అన్నారు.

హరీష్ రాకపోవడం పై సదస్సులో చర్చ

రైతు సంగ్రామ సదస్సుకు ఆ పార్టీ నేత హరీష్ రావు రాకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్న జగిత్యాల సభ, ఈ రోజు వరంగల్ సదస్సుకు ఆయన రాకపోవడం పై రకరకాలుగా మాట్లాడుతున్నారు. పేరుతో బీఆర్ఎస్ నిర్వహించిన సదస్సు పూర్తిగా రాజకీయ సదస్సుగా మారిందని, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రైతుల సమస్యలు, రైతులు తమ బాధలు చెపుకోవడం కంటే అధికార పార్టీ పై విమర్శలు చేయడానికే ప్రాధాన్యతనిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలు తప్ప పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం లేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లాలో నాయకులు డీలా పట్టారు. తాజాగా రైతు సదస్సు పేరుతోనైనా పార్టీ కేడర్ తో సమావేశం కావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.