Medaram Maha Jatara|| పారవశ్యంలో మునిగిన మేడారం
సమ్మక్క,సారలమ్మ మహా జాతరకు నెలవైన మేడారంలో తాజాగా నెలకొన్న అధ్యాత్మిక వాతావరణం భక్తులను నిలువెల్లా పారవశ్యంలో ముంచెత్తుతోంది. తల్లుల ఆశీస్సుల కోసం తరలివచ్చే లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం అడవి ఆసాంతం పులకించి పోతోంది. మహాజాతరలో కీలక అంకమైన సమ్మక్కతల్లి రాకకు ముందే అక్కడికి చేరిన లక్షలాది మంది భక్తులు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనవుతున్నారు
విధాత, ప్రత్యేక ప్రతినిధి: సమ్మక్క,సారలమ్మ మహా జాతరకు నెలవైన మేడారంలో తాజాగా నెలకొన్న అధ్యాత్మిక వాతావరణం భక్తులను నిలువెల్లా పారవశ్యంలో ముంచెత్తుతోంది. తల్లుల ఆశీస్సుల కోసం తరలివచ్చే లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం అడవి ఆసాంతం పులకించి పోతోంది. మహాజాతరలో కీలక అంకమైన సమ్మక్కతల్లి రాకకు ముందే అక్కడికి చేరిన లక్షలాది మంది భక్తులు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనవుతున్నారు. సమ్మక్క రాక కోసం ఎదురుచూసే ఆ క్షణాలు గురువారం సాయంత్రానికి పూర్తికానున్నాయి. జాతర యావత్తు అధ్యాత్మిక వాతావరనంలో మునిగితేలే సమ్మక్క రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జాతరలో ప్రధానమైన ఈ ఘట్టానికి సాయంత్రం తెరతీయనున్నారు. దీనికి అవసరమైన పూర్తరంగాన్ని మేడారం జాతర వడ్డెలు, జిల్లా అధికార యంత్రాంగం సర్వం సంసిద్ధం చేస్తున్నారు.
కంకవనం (వెదురు కర్రలను) గద్దె పై ప్రతిష్టాపన
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో గురువారం సమ్మక్క చిలుకల గుట్ట నుండి గద్దెల వద్దకు చేరుకోనుంది. సమ్మక్క రాకకు ముందుగా కంక వనం (వెదురు బొంగులను) గద్దె పై ప్రతిష్టించారు. వనదేవతల జాతరలో వనం ( వెదురు) కు విశిష్ఠత ఉంది. వనం అంటే అడవి అనే అర్ధమున్నప్పటికీ అందులో వెదురుపొదలు అంటే కంకబొంగులు ఆదివాసీ జీవనంలో ఈ జాతరలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. కంక వనం నుండి తల్లులు గద్దెల పైకి వస్తారు, సమ్మక్కను తీసుకొచ్చే కుంకుమ భరిణ కూడా వెదురుతో చేసిందే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముందుగా ఏపుగా పెరిగిన వెదురు బొంగులను ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క గడ్డెవద్దకు తీసుకు వచ్చి గద్దె పై ప్రతిష్టిస్తారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభంగా గురువారం ఉదయం నిర్వహించారు. ఈ అంకం ముగిసిన తర్వాత సాయంత్రం చిలుకలగుట్ట నుండి సమ్మక్క ను అత్యంత వైభంగా గద్దెలపైకి తీసుకువస్తారు. ప్రకృతితో మానవుడి అనుబంధాన్ని వివరించారు. వన సంపద పరిరక్షణతోనే సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని, వన దేవతల అనుగ్రహంతో మంచి వర్షాలు, పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
గద్దెలపైకి చేరిన కన్నెపెల్లి కల్పవల్లీ
బుధవారం అంగరంగవైభవంగా సంప్రదాయపద్ధతిలో కన్నెపల్లి కల్పవల్లిగా పేరొందిన సారలమ్మను వడ్డెలు గద్దెపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం గద్దెలపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు సమ్మక్కకు భక్తులు మొక్కులు సమర్పిస్తున్నారు. దీంతో జాతరలో తొలి కీలక ఘట్టం పూర్తయ్యింది. బుధవారం పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య,పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుమార్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయి లతో పాటు గోవిందరాజుల పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7, గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు. జంపన్న వాగు మీదుగా అర్ధరాత్రి 12.30 మేడారం గద్దెల వద్దకు చేరుకున్నారు. పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు, డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పరవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. తొలి కీలక ఘట్టం విజయవంతంగా పూర్తికాగా ఇక జాతరలోని తదుపరి ఘట్టమైన సమ్మక్కరాక కోసం భక్తజనం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
మహానగరమైన మేడారం
సమ్మక్క జాతర నేపథ్యంలో మారుమూల కుగ్రామమైన మేడారం గురువారం మహానగరంగా మారిపోయింది. మేడారం పూర్తిగా భక్తజన జాతరగా మారింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం జనసంద్రాన్ని తలపిస్తోంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర,ఏపీ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు,భక్తులు మేడారానికి తరలివచ్చారు. దీంతో మేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. గత నెల రోజుల నుంచే భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. రానున్న రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారానికి తరలిరానున్నారు. దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు, కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి.
కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం
కోళ్లను వనదేవతల గద్దెల సమీపంలో గాల్లోకి ఎగురవేస్తూ భక్తులు సందడి చేస్తున్నారు. కుటుంబాలను చల్లగా దీవించు తల్లీ అంటూ దేవతలను భక్తితో కొలుస్తున్నారు. ఎత్తు బంగారాలను సమర్పిస్తున్నారు. ఆధునిక కాలంలోనూ ఆదివాసీ సంప్రదాయాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో చాటిచెప్పే ఈజాతర, కేవలం ఒక పండుగ మాత్రమేకాదని, ఇది కోట్లాది మంది ప్రజల నమ్మకం. విశ్వాసం అంటూ నిరూపిస్తోంది. మేడారంలో ఎక్కడ చూసినా బెల్లం (బంగారం) కుప్పలే కనిపిస్తున్నాయి. భక్తులు తమ కోరికలు తీరినందుకు తల్లులకు’బంగారం’ సమర్పించుకుంటున్నారు. గిరిజన ఆచారం ప్రకారం వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉండగా గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా అత్యాధునిక సెన్సార్ల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.
జంపన్నవాగులో పుణ్యస్నానాలు
మేడారంలో కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నజంపన్న వాగు ఇప్పుడు భక్తుల స్నానాలతో జన సముద్రాన్ని తలపిస్తోంది. వాగులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జలకాలతో జంపన్న వాగు పుష్కరశోభను తలపిస్తున్నది. భక్తుల రద్దీతో విద్యుత్ వెలుగులతో , రాత్రి వేళ అద్భుతమైన దృశ్యంతో మేడారం మెరిసిపోతున్నది. చిన్న చిన్న వాగుల ఒడ్డున, చెట్లకింద వేలాది మంది భక్తులు వంటలు చేసుకుంటూ, చిన్న చిన్న దీపాల వెలుగులో ఆనందంతో కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నారు. కలిసి సామూహిక, బంతి భోజనాలు చేస్తూ ఇంటిల్లిపాది సమ్మక్క సమక్షంలో గడుపుతున్నారు. భక్తులు తమ ఇళ్ల నుంచే బియ్యం,పప్పు తెచ్చుకుని, మేడారం చెట్ల కింద వండుకుని ‘వనభోజనాలు’ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప అధ్యాత్మిక అనుభవాన్ని భక్తులకు మేడారం ఇస్తుంది. మేడారంఅంటే కేవలం మొక్కులు తీర్చుకోవడం మాత్రమే కాదు, అది తెలంగాణ ఆదివాసీ గిరిజన అస్తిత్వానికి, వనదేవతల ధైర్యానికి ప్రతీక. ఆధునిక ప్రపంచంలో మనిషికి, ప్రకృతికి ఉన్న విడదీయరాని బంధాన్ని ఈ మహా జాతర గుర్తు చేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంథ్రోపాలజీస్టులు కూడా ఈ జాతరను అధ్యయం చేసేందుకు రావడం పరిపాటిగా మారుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram