Medaram Jathara | వైభవంగా మేడారం జాత‌ర‌.. వ‌నంలోకి దేవ‌త‌లు.. ఇళ్ల‌కు భ‌క్తులు

Medaram Jathara | ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ముగిసింది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ లు గద్దెలను శనివారం 7.గంటల 55నిమిషాలకు వీడి వన ప్రవేశం చేయడంతో ఈ జాతర పరిసమాప్తమైంది.

  • By: raj |    telangana |    Published on : Jan 31, 2026 11:00 PM IST
Medaram Jathara | వైభవంగా మేడారం జాత‌ర‌.. వ‌నంలోకి దేవ‌త‌లు.. ఇళ్ల‌కు భ‌క్తులు

పోరాటం, త్యాగం, నమ్మకాల సమ్మిళితం మేడారం జాతర

Medaram Jathara | విధాత, ప్రత్యేక ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ముగిసింది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ లు గద్దెలను శనివారం 7.గంటల 55నిమిషాలకు వీడి వన ప్రవేశం చేయడంతో ఈ జాతర పరిసమాప్తమైంది. వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య, ఉద్విగ్న వాతావరణంలో అమ్మవార్లు పయనమయ్యారు. కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమ్మక్క, పగిడిద్దరాజు పూనుగొండ్లకు, గోవిందరాజులను కొండాయికి గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లారు.

లక్షలాది మంది భక్తుల మొక్కులు

బుధవారం సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమై, ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారం, శనివారం అశేష భక్త జనం వన దేవతలకు మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి.. బంగారం తులా భారం వేసుకుని వనదేవతలకు దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. కాగా, సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత పూజారులు రాత్రి వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. ‘దేవతలు వనం లోకి మేము ఇంటికి అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.

ఇళ్లకు తిరుగు ప్రయాణమైన భక్తులు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు దేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తి వచ్చారు. నాలుగు రోజులుగా మేడారం పరిసర ప్రాంతాలు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తుల తో కిట కిట లాడాయి. మేడారం జాతర చివరి రోజు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో అమ్మవార్లను దర్శించుకునీ భక్తులు తిరిగి వారి వారి స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. భక్తుల తిరుగు ప్రయాణం సందర్భంగా ఆర్.టి.సి బస్టాండ్ ప్రాంతం లోని క్యూ లైన్లు నిండిపోయాయి.ఇప్పటి వరకు దాదాపు 12వేల ట్రిప్పుల బస్సులు నదిచినట్లు అధికారులు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గుడారాలు, టెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భక్తులు తమ సామగ్రినీ, పిల్లలను చేతిలో పట్టుకొని తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు.