కాంగ్రెస్‌లో ‘సమన్వయం’ ఓ పజిల్!? రేవంత్ మాటలపై సర్వత్రా తీవ్ర చర్చ
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో సమన్వయం అంశం మరోసారి చర్చకు వచ్చింది. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి Revanth Reddy నాయకుల మధ్య సమన్వయం అవసరాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఐక్యత అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
- కాంగ్రెస్ కు రాబోయేది గడ్డు కాలమే
- జిల్లాలో ఎక్కడా జాడలేని కోఆర్డినేషన్
- మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికివారే
- ఉత్సవ విగ్రహాలుగా పార్టీ జిల్లా అధ్యక్షులు
విధాత,ప్రత్యేక ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నది అందరికీ తెలిసిందే. అదే సమయంలో సమన్వయం కూడా సమస్యే. ప్రజా ప్రతినిధులు, పార్టీలోని నాయకులు ఒక్కతాటిపై సాగటం అనేది పెద్ద సవాలే. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ‘నాయకుల మధ్య సమన్వయం’ అంశం… ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అన్నీ తెలిసీ సీఎం ఇలా మాట్లాడారేంటి? అంటూ కొందరు నాయకులు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలపై సీఎం రేవంత్‌కు భారీ ఆశలున్నట్లున్నాయంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకుల మధ్య సమన్వయం ఓ పజిల్ అంటూ ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్ర మంత్రివర్గంలో, పార్టీ సీనియర్ నేతల మధ్య ఎన్ని విభేదాలు, గ్రూపులున్నాయో అందరికీ తెలిసిందేనని గుర్తుచేస్తున్నారు.
ఇప్పటికీ సన్నాయి నొక్కులు
తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ దశాబ్దకాలం అధికారానికి దూరంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ నేతల్లో పూర్తి స్థాయి ఐక్యతరాలేదనే అంశాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. కాలం కలిసొచ్చి రేవంత్ రెడ్డికి సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని, ఎక్కడ కాస్త పట్టుజారినా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇప్పటికీ నల్లగొండ జిల్లాలో రాజగోపాల్, రంగారెడ్డి జిల్లాలో కొందరు సన్నాయి నొక్కులు నొక్కతున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. సమన్వయం, ఐక్కతను ఆశించడం తప్పుకాదుగానీ, దాన్ని ఆచరణాత్మకంగా తీసుకెళ్ళేందుకు అవసరమైన ప్రణాళిక అమలుచేయడంలోనే సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు.
పాత అనుభవాలు మరిచారా?
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహించిన కాలంలో నల్లగొండలాంటి కొన్ని ప్రధాన జిల్లాల ప్రవేశం, పర్యటనలను సైతం కొందరు నేతలు అనుమతించని విషయాలను కొందరు ప్రస్తావిస్తున్నారు. అప్పుడే సీఎం అన్ని విషయాలూ మరిచిపోయారా? అని అంటున్నారు. సీఎం అయిన తర్వాత పరిస్థితులు కొంత మారిపోవచ్చేమోగానీ, రెండున్నరేళ్ళ క్రితం ఆయన పరిస్థితికి.. ప్రస్తుతం పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల స్థితికి పెద్దగా తేడాలేదంటున్నారు.
అసెంబ్లీలో ఫ్లోర్ కోఆర్డినేషన్ అవసరమే?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఫ్లోర్ కోఆర్డినేషన్‌తోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, మొత్తంగా సీఎల్పీ మధ్య సమన్వయం, సహకారం గురించి వివరిస్తూ సీఎం పలు అంశాలు లేవనెత్తినప్పటికీ, ఇప్పటి వరకు రెండున్నరేళ్ళల్లో సీఎంగా తాను తీసుకున్న చర్యలపై ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. ఇచ్చిన హామీల అమలుపై సర్కారును విపక్షాలు ప్రశ్నించడం, బోనులో పెట్టేందుకు ప్రయత్నించడం పెరుగుతూనే ఉన్నదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీటిని తిప్పి కొట్టాలంటే.. పాలకవర్గంలో ఐక్యత, సమయస్ఫూర్తితో పాటు ఇచ్చిన హామీల అమలు పట్ల నిజాయితీ, ప్రజలను ఒప్పించి, మెప్పించడమే ప్రమాణికంగా నిలుస్తుందంటున్నారు.
సీఎం అనుభవంలోకి వాస్తవాలు
రెండున్నరేళ్ళ అధికారం తర్వాత సీఎం రేవంత్ అనేక వాస్తవాలు గుర్తించినట్లు తాజా మాటలను బట్టి ఆ పార్టీ నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నోటి వెంట పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ అనే అంశాలు వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు గత పాలకుల వైఫల్యాలు, వారిలోటు పాట్ల పై విమర్శలు, రాజకీయ ఆరోపణలు చేస్తూ కాలం నెట్టుకొచ్చినప్పటికీ.. ఇక ముందు కూడా అవే అంశాలు చెబుతూ పాలన సాగిస్తే ప్రజా విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముందనే చేదు నిజాన్ని జీర్ణింపచేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. గత పాలక నేతలు, పార్టీ విఫలమైందునే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారనే వాస్తవాన్ని రానున్న రోజుల్లో ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉంటుందనే అంశాన్ని ఈ సమావేశంలో నొక్కి చెప్పడం గమనార్హం.
మరోవైపు విపక్షాలలో ఎన్ని లోపాలున్నా కాబోయే కాలంలో తమ విమర్శలకు మరింత పదునుపెట్టడం ఖాయంగానే కనిపిస్తున్నది. గత పాలకుల తప్పిదాలు సహజంగానే కాలం గడిచే కొద్దీ మరుగునపడిపోతాయి. దాని స్థానంలో కొత్త అంశాలు తెరపైకి వస్తాయి. అంటే రాబోయే కాలం ప్రభుత్వ చిత్తశుద్ధి, నిజాయితీ, పథకాలు, కార్యక్రమాల అమలు… అనేవి ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటాయనే అంశాన్ని సీఎం వివరించే ప్రయత్నం చేసినట్లు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయాన్ని నొక్కి చెప్పడంలో ఔచిత్యమిదేనని అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటూ సీఎం చెప్పకుండానే చెప్పారంటున్నారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ కొత్త బాటకు సీఎం శ్రీకారం చుడుతూ తన పట్టును పెంచుకునేందుకు యత్నిస్తున్నట్లు పార్టీ సీనియర్లు అంచనావేస్తున్నారు.
జిల్లాల్లో ఎవరికి వారే యమునా తీరే
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో క్షేత్రస్థాయి విభేదాలున్నప్పటికీ ప్రధానంగా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉందా? అనేది ఏ ప్రభుత్వం, పార్టీకైనా ప్రధానమైన అంశంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో ఆశించిన స్థాయిలో సమన్వయం ఉందా? అనేది అనుమానమే. దాదాపు మెజార్టీ జిల్లాల్లో ఈ రెండున్నరేళ్ళలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భాలు లేవనే చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప, ఇతరత్రా సమావేశాలు నిర్వహించి, ఆయా జిల్లాల అభివృద్ధి, సంక్షేమం, సమస్యలు, సమన్వయం, లోటుపాట్లు, నియోజకవర్గాల్లో కార్యకలాపాలు, చేపట్టాల్సిన అభివృద్ధి, సీఎం దృష్టికి, ఇతర మంత్రుల దృష్టికి తేవాల్సిన సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. కొందరు మంత్రులైతే తమ నియోజకవర్గానికి లేకుంటే హైదరాబాద్ కు పరిమితమవుతున్నారు. సీఎం స్థాయిలో జిల్లాలవారీగా అప్పుడప్పుడు నిర్వహించే సమావేశాలకు అంతా హాజరుకావడం తప్ప, జిల్లాలో అందరితో సమన్వయం చేసుకుంటూ సీఎంకు తమ సమస్యలు వివరించే ప్రయత్నమే లేదని చెబుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలను కలువడంగానీ, ఎమ్మెల్యేలు మంత్రులను కలువడంగానీ లేనేలేదంటున్నారు. పైగా ఆధిపత్యపోరు, గ్రూపులతో సతమతమవుతున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యే మధ్య సమన్వయలోపం
ఉదాహరణకు ఖమ్మంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు,పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముగ్గురు మంత్రులున్నా ఎవరికివారే యమునా తీరే తప్ప, ఆ ముగ్గురు మంత్రులు జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో సమావేశమై వారి సమస్యల గురించి చర్చించిన సందర్భాలు లేవంటున్నారు. పైగా మంత్రుల్లో ఆధిపత్యానికి తోడు ఎమ్మెల్యేల్లో గ్రూపులు సృష్టించి తమ పెత్తనం చెలాయించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ , చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ లున్నా అక్కడే ఇదే పరిస్థితి. చివరికి ఎన్నికల సందర్భంలో ఏదో మొక్కుబడి సమన్వయం తప్ప ప్రత్యేకంగా జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భాలే లేవంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, ధనసరి సీతక్క, చీఫ్ విప్ రామచంద్రు నాయక్ లున్నా ఎవరికివారుగానే కొనసాగుతున్నారు. ఈ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాల సంగతి పక్కనపెడితే కలిసి సమావేశాలు నిర్వహించిన దాఖలాలే లేవు. పైగా కొండా సురేఖ అంటే మిగిలిన ఎమ్మెల్యేలకు గిట్టని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సరాసరి సీఎంను కలువడం తప్ప ఆ సందర్భంలో మంత్రుల జాడ కూడా లేని పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ మంత్రులున్నప్పటికీ అక్కడ కూడా జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చేసుకుంటున్న సమన్వయం లేదంటున్నారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం పర్యటనల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసినడువడం తప్ప ప్రత్యేకంగా జిల్లా ఎమ్మెల్యేల స్థితిగతులపై పెద్దగా మంత్రులు పట్టించుకోలేదంఉన్నారు. ఇక్కడ సీనియర్ మంత్రి జూపెల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలున్నప్పటికీ పెద్దగా తేడాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివేక్ వెంకటస్వామి, మెదక్ జిల్లాల్లో దామోదర రాజనర్సింహాలున్నప్పటికీ అక్కడా ఇదే పరిస్థితి ఉంది. రంగారెడ్డి, నిజామాద్ జిల్లాల నుంచి మంత్రుల ప్రాతినిధ్యమే లేదు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మధ్య సమన్వయం తీసుకరాకుండా ఆయా జిల్లాల్లో నెలకొన్న సమస్యలు ఎలా? పరిష్కరిస్తారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్న సందర్భాలు చాలా తక్కువంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంతో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకుండా రానున్న రోజుల్లో ప్రతిపక్షాలను రాజకీయంగా, నిర్మాణాత్మకంగా ఎదుర్కొవడమనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి సవాలుగానే భావిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram