వరంగల్​లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం – మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనకు సీఎం ఓకే.!

వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల వద్ద 30 ఎకరాల కుడా భూమిని కూడా  గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఫైల్​ ముందుకు కదిలింది.

Warangal International Cricket Stadium proposed in Telangana aerial view concept image

వరంగల్‌లో ప్రతిపాదిత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం – 30 ఎకరాల్లో నిర్మాణానికి ప్రభుత్వ ప్రణాళిక

International Cricket Stadium Proposed in Warangal on 30 Acres

వరంగల్‌కు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

  ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల వద్ద 30 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రతిపాదన పరిశీలనలో ఉంది. స్పోర్ట్స్ పాలసీ 2025లో భాగంగా వరంగల్‌లో క్రీడా మౌలిక వసతులు విస్తరించనున్నాయి.

 

విధాత తెలంగాణ డెస్క్​ | హైదరాబాద్​

ఓరుగల్లు కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల విస్తరణలో భాగంగా వరంగల్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామ శివారులో జాతీయ రహదారి 163కి ఆనుకుని ఉన్న 30 ఎకరాల పట్టణాభివృద్థి సంస్థ భూమిని దీనికోసం గుర్తించారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

30 ఎకరాల్లో స్టేడియం – అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ సన్నాహాలు

స్టేడియం నిర్మాణానికి ఎంపికైన స్థలం రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉంది. జాతీయ రహదారి సమీపంలో ఉండటం వల్ల భవిష్యత్తులో పెద్ద మ్యాచ్‌ల నిర్వహణకు సౌలభ్యం కలుగనుంది. హనుమకొండలో ప్రస్తుతం ఉన్న జవహర్​లాల్​ నెహ్రు స్టేడియం జిల్లా స్థాయి పోటీలకే పరిమితమవుతోంది. పెరుగుతున్న జనాభా, యువతలో క్రీడాపై ఆసక్తి దృష్ట్యా ప్రత్యేక క్రికెట్ వేదిక అవసరం ఏర్పడింది.

ప్రతిపాదిత స్టేడియంలో ఆధునిక గ్యాలరీలు, డ్రెస్సింగ్ రూములు, ప్రాక్టీస్ నెట్‌లు, ఫ్లడ్‌లైట్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌ ఉప్పల్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ క్రికెట్​ స్టేడియం(Rajiv Gandhi International Cricket Stadium) కంటే కూడా ఆధునిక సౌకర్యాలు ఉండేలా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. రంజీ, రాష్ట్ర స్థాయి టోర్నీలతో పాటు భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యంతో వేదికను రూపకల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణ క్రీడా విధానం – 2025లో భాగంగా చర్యలు

వరంగల్‌కు క్రికెట్ స్టేడియం – యువ క్రీడాకారులకు కొత్త వేదికగా మారనున్న ఓరుగల్లు

తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025లో భాగంగా రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు, ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్‌లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. అకాడెమిక్ విద్యతో పాటు క్రీడా శిక్షణ అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉన్నారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. వారికి సరైన వేదికలు కల్పిస్తే మరింత మంది యువత ముందుకు వస్తారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టేడియం నిర్మాణం కార్యరూపం దాల్చితే ఓరుగల్లు కీర్తి మరింత పెరిగే అవకాశం ఉంది. వరంగల్​లో విమానాశ్రయం కూడా నిర్మితం కాబోతున్న దృష్ట్యా భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా అనువుగా ఉంటుంది. ఈ ప్రతిపాదన ఉత్తర తెలంగాణ క్రీడారంగానికి పెద్ద ఊపిరిగా మారనుంది.

Latest News