టి20 ప్రపంచకప్ సెమీఫైనల్: ఫిన్ అలెన్ విధ్వంసం… 33 బంతుల్లో సెంచరీ, ఫైనల్లో కివీస్
టి20 ప్రపంచకప్ 2026 తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లో శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికా విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే చేధించి ఫైనల్‌కు చేరింది.
టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 33 బంతుల్లో రికార్డు శతకం బాదిన న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్
Finn Allen’s 33-Ball Century Storm Sends New Zealand Into T20 World Cup Final
- దక్షిణాఫ్రికాపై కివీస్ మెరుపు విజయం
- టి20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్
- 5 ఓవర్లలోనే 173 పరుగులు దంచేసారు
- ఫిన్ అలెన్ 10 ఫోర్లు, 8 సిక్సర్లతో రికార్డు శతకం
విధాత క్రీడా విభాగం | మార్చి 4, 2026 | హైదరాబాద్:
టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ బ్యాట్ నుంచి నిప్పులు కురిసాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై కివీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
అలెన్ కేవలం 33 బంతుల్లో శతకం సాధించి టి20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. అతని సునామీ ఇన్నింగ్స్ వల్ల 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే చేధించింది.
జాన్సెన్ ఒంటరి పోరాటం… దక్షిణాఫ్రికా169 పరుగులకు పరిమితం
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. క్వింటన్ డీకాక్, ర్యాన్ రికెల్టన్ త్వరగా అవుట్ కావడంతో ప్రోటీస్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (16), డేవాల్డ్ బ్రేవిస్ (15) కొంతవరకు పోరాటం చేసినా పెద్ద స్కోరు చేయలేకపోయారు.
తర్వాత డేవిడ్ మిల్లర్, బ్రేవిస్ వికెట్లు పడిపోవడంతో జట్టు 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో మార్కో జాన్సెన్ అద్భుత పోరాటం చేశాడు.
జాన్సెన్ కేవలం 30 బంతుల్లో 55 పరుగులు చేసి స్కోరును నిలబెట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో పోరాడిన మార్కో జాన్సెన్ (ఎడమ) – రికార్డు శతకంతో మెరిసిన ఫిన్ అలెన్ (కుడి)
అలెన్ తుఫాన్… ఏకపక్షంగా మారిపోయిన మ్యాచ్
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ – ఫిన్ అలెన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. పవర్‌ప్లేలోనే వీరిద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి స్కోరును 84 పరుగులకు చేర్చారు. సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు.
కానీ మ్యాచ్‌ను పూర్తిగా మార్చింది ఫిన్ అలెన్ బ్యాటింగ్. అతను కేవలం 33 బంతుల్లో శతకం సాధించి చరిత్ర సృష్టించాడు.
అలెన్ తన ఇన్నింగ్స్‌లో సాధించిన బౌండరీలు:
- 10 ఫోర్లు
- 8 సిక్సర్లు
అలెన్ సరిగ్గా 100* పరుగులు చేసాడు. అందులో 88 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయంటే అలెన్ విధ్వంసం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రౌండ్ నలువైపులా షాట్లు బాదుతూ దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేశాడు. చివరకు న్యూజిలాండ్ రికార్డు స్థాయిలో 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిన్ అలెన్
న్యూజిలాండ్ ఇప్పుడు టి20 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. అలెన్ మెరుపు శతకం ఈ టోర్నమెంట్ చరిత్రలోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఈ సెంచరీ టి20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram