శ్రీలంక ఎలెవన్‌ పై భారత్ విజయం

శ్రీలంక ఎలెవన్‌ తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక ఎలెవన్ నిర్ధేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే... 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Reported by: Y.V. Narsimha Reddy | క్రీడలు | Aug 09, 2026, 6:34 pm IST
Read Time: 3 mins
శ్రీలంక ఎలెవన్‌ పై భారత్ విజయం

విధాత : శ్రీలంక ఎలెవన్‌ తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడోరోజు లంక జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 200/6 వద్ద డిక్లేర్ చేసి భారత్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ని టీమ్ఇండియా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే… 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆట ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరంగా కాగా ఓ దశలో మ్యాచ్ డ్రా అవుతుందని భావించారు. అయితే అనూహ్యంగా సిరాజ్ (32*; 15 బంతుల్లో) వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టుకు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించడం విశేషం.

తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో లక్ష్య చేధనకు కెప్టెన్ గిల్ తో కలిసి వన్డే తరహాలో రెచ్చిపోయాడు. యశస్వీ (61 రిటైర్డ్ హర్ట్; 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించి భారత్ గెలుపు బాటలు వేశాడు. చేేతి వేలికి గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కు దిగి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించి (44 పరుగులు; 54 బంతుల్లో 7 ఫోర్లు) సత్తా చాటుకున్నాడు.

రిషభ్‌ పంత్ (28), రవీంద్ర జడేజా (22 రిటైర్డ్ హర్ట్), ధ్రువ్ జురెల్ (17) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎలెవన్ 363/8 చేయగా, టీమ్ఇండియా 357/6 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్ తో టీమ్ఇండియా ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించినట్లయ్యింది.