Mallojula Venugopal | సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ (అభయ్) 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు. 22 పేజీల లేఖలో పార్టీ వైఫల్యాలు, నాయకత్వంపై విమర్శలు చేశారు.

Mallojula Venugopal alias Abhay surrenders with 60 Maoist cadres in Gadchiroli
మావోయిస్టు ఉద్యమానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ (అభయ్) పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆయనతో పాటు ఏకంగా 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు.
అనితరసాధ్యమైన మేధస్సు, వ్యూహాత్మక నైపుణ్యాలతో పార్టీకి ముఖ్యమైన సైనిక, రాజకీయ మార్గదర్శకుడిగా పేరుగాంచిన వేణుగోపాల్ ఇటీవలి కాలంలో పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాను ఇకపై ఆయుధ పోరాటం కొనసాగించనని, ప్రజలతో బహిరంగ రాజకీయాల వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పార్టీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎవరీ మల్లోజుల వేణుగోపాల్?
మల్లోజుల వేణుగోపాల్ రావు, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా(పాత కరీంనగర్ జిల్లా) లోని పూజారి కుటుంబంలో జన్మించారు.
అతని తాత మల్లోజుల వెంకటయ్య, తండ్రి ఇద్దరూ భారత స్వాతంత్ర్య సమరయోధులు. వేణుగోపాల్ విద్యార్థి దశలోనే వామపక్ష భావజాల ప్రభావంతో ఉద్యమంలోకి ప్రవేశించారు. ఆయన పెద్ద సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్‌జీ) కూడా ప్రముఖ మావోయిస్టు నాయకుడు. వేణుగోపాల్ “భూపతి”, “సోనూ”, “మాస్టర్”, “అభయ్” అనే పేర్లతో కూడా పిలువబడేవారు. మొదట పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) లో చేరి, తరువాత CPI (Maoist) ఏర్పడినప్పుడు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు చేపట్టారు.
దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయపరచిన ఆయన, డండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ చీఫ్‌గా పనిచేశారు. తరువాత పశ్చిమ కనుమల (Western Ghats) ప్రాంతం — గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు — కొత్త గెరిల్లా జోన్ ఏర్పాటుకు నియమితులయ్యారు. ఆయన భార్య తారక్క, 2024 డిసెంబర్ 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. వేణుగోపాల్ ఆ సమయానికి కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ, పార్టీ ప్రచురణ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో మనగలిగారు.
మావోయిస్టు ఉద్యమంలో మల్లోజుల పాత్ర
- 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ (అజాద్) మరణం తర్వాత CPI (Maoist) అధికార ప్రతినిధిగా (Spokesperson) వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు.
- పార్టీ ప్రచురణ విభాగం (Publication Division) ఆయన ఆధ్వర్యంలో నడిచింది.
- 2010 ఏప్రిల్‌లో దంతేవాడలో 76 మంది CRPF జవాన్లు మరణించిన దాడికి ఆయనే వ్యూహాత్మక సూత్రధారిగా పోలీసులు అనుమానించారు.
- ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఆయన తలపై భారీ వెలలు ప్రకటించాయి.
- కిషన్‌జీ మరణం తర్వాత, పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గఢ్ ఉద్యమానికి ఆయన నేతృత్వం వహించారు.
అందులో ఆయన ఇలా పేర్కొన్నారు – “నిన్నటి పొరపాట్లను విశ్లేషించి గుణపాఠాలు నేర్చుకుంటేనే రేపటి విజయానికి మార్గం ఏర్పడుతుంది. విప్లవోద్యమం త్యాగం, ఓపిక, అధ్యయనం అవసరమైన యాత్ర. సైన్యం తప్ప విప్లవ పార్టీ లేదు – ఇదే మన వైఫల్యమంటూ ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఆయన 22 పేజీల లేఖ రాశారు.
ఆ లేఖలో ఆయన మూడు ప్రధాన తప్పిదాలను ప్రస్తావించారు:
- సైన్యంపైనే ఆధారపడడం: పార్టీ నిర్మాణం కంటే సైనిక నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీ రహస్య నెట్‌వర్క్ బలహీనపడిందని పేర్కొన్నారు.
- బేస్ ఏరియా వ్యూహం: 2007లో దండకారణ్యం, బీహార్–జార్ఖండ్‌లో బేస్ ఏరియాలు నిర్మించడమే రెండో వ్యూహాత్మక తప్పిదమని అన్నారు.
- చట్టబద్ధ పోరాటాల విస్మరణ: ప్రజల హక్కులు, ఆధార్, భూమి పట్టాలపై పార్టీ తప్పుడు వైఖరిని అవలంబించిందని విమర్శించారు.
“ఇక ఉద్యమానికి సానుకూల మార్పు కావాలి. అనవసర త్యాగాలకు ముగింపు పలుకుదాం. బహిరంగంగా ప్రజల మధ్యకు వెళదాం. అంతిమ విజయం ప్రజలదే,” అంటూ ఆయన లేఖను ముగించారు.
నాయకత్వంపై విమర్శలు, బాధ్యత స్వీకారం
తాను 28 ఏళ్లుగా కేంద్ర కమిటీలో, 18 ఏళ్లుగా పొలిట్‌బ్యూరోలో ఉన్నానని వేణుగోపాల్ లేఖలో వెల్లడించారు. పార్టీ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ, యావత్ క్యాడర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. “ఇంతటి నష్టాలకు కారణమైన నాయకత్వ బాధ్యతల్లో కొనసాగడానికి నేను అనర్హుడిని,” అని ప్రకటించారు. గత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బసవరాజు) కూడా శాంతి చర్చల ఆలోచనలో ఉన్నారని, పార్టీకి ఈ మార్గం తప్ప గత్యంతరం లేదని వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు.
మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం అత్యంత భారీ విఘాతంగా భావిస్తున్నారు. ఆయన స్థాయి నేత లొంగిపోవడం వల్ల ఉద్యమ దిశలో కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని భద్రతా వర్గాలు, కమ్యూనిస్టు మేధావులు విశ్లేషిస్తున్నారు.