వాహనదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి టోల్ ప్లాజాలు ఉండవు.. ప్రయాణించిన దూరానికే చార్జ్
ఇకపై టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాల్సిన అవసరం లేదు. మీరు రహదారులపై ప్రయాణించిన దూరానికి మాత్రమే ఇక చెల్లిపులు చేసే కొత్త విధానం పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ నేపథ్యంలో డిసెంబర్ నుంచి అన్ని రహదారులపై టోల్‌ప్లాజాలను తొలగించనున్నారు.
టోల్‌ప్లాజా వ్యవస్థ లేక ముందు జాతీయ రహదారులపై ఎలాంటి ఆటంకాలు లేకుండా రయ్ రయ్ మంటూ వాహనాల్లో ప్రయాణించేవారు. గడచిన రెండు దశాబ్ధాలుగా ఈ రహదారులపై వాహనదారులకు టోల్ ఫ్లాజాలు ఆటంకాలుగా మారాయి. పండగలు, పర్వదినాలు, సెలవులు వచ్చాయంటే ప్రతి టోల్ ఫ్లాజా వద్ద నిమిషాల తరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తున్నది. ఈ సమస్యల నుంచి వాహనదారులను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా టోల్ ఫ్లాజాలు లేని రోడ్లు కన్పిస్తాయి. పూర్వకాలం మాదిరి టోల్ ఫ్లాజాల బాధలు లేకుండా ప్రయాణాలు సాగించవచ్చు. అయితే ఎంతదూరం ప్రయాణిస్తూ అంత దూరానికి మాత్రమే టోల్ వసూలు చేసేందుకు అధునాతన విధానాన్ని తీసుకువస్తున్నారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. సత్ఫలితాలు ఇవ్వడంతో డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా టోల్ ఫ్లాజాలను తొలగించాలని నిర్ణయించారు.
గడచిన రెండు దశాబ్ధాలుగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నాలుగు వరుసలు, ఆరు వరుసల్లో నిర్మాణం చేస్తున్నది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నది. రవాణా సౌకర్యం పెరగడంతో ప్రజలు కూడా సెలవులు లభిస్తే చాలు దూరపు ప్రయాణాలు చేసి వస్తున్నారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు వంటి ప్రదేశాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో చుట్టి వస్తున్నారు. ప్రభుత్వానికి టోల్ ద్వారా, పర్యాటక రంగం ద్వారా ఆదాయం సమకూరుతున్నది. అయితే టోల్ ఫ్లాజాలా మూలంగా దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతున్నది. నిమిషాల తరబడి ఫ్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. పండుగలు, సెలవు రోజులు అయితే గంటల తరబడి వాహనాలు ముందుకు కదలడం లేదు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ సందర్భంలో అయితే ప్రత్యేకంగా పోలీసులను నియమించాల్సి వస్తున్నది. ఇలా దేశ వ్యాప్తంగా ఇవే సమస్యలు ఎదురవుతుండడంతో విదేశాల మాదిరి టోల్ విధానం అమలు చేయలని నిర్ణయించారు.
టోల్ ఫ్లాజాల స్థానంలో మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సాంకేతికతను వినియోగించాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో వాహనం ప్రయాణిస్తుండగానే ప్రయాణించిన దూరం బట్టి ఆటోమెటిక్ గా టోల్ కట్ అవుతుంది. ఆ వెంటనే వాహన యజమానికి క్షణాల్లో మెస్సేజ్ వస్తుంది. వాహనాల ముందు భాగంలో అతికించిన పాస్టాగ్ స్టిక్కర్ ను ఆర్.ఎఫ్.ఐ.డీ రీడర్స్ స్కాన్ చేయడంతో పాటు అత్యాధునిక ఏఐ కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తిస్తాయి. ఈ రెండింటిని గుర్తించిన తరువాత సదరు వాహన యజమాని ఖాతా నుంచి టోల్ మొత్తం ఆటోమెటిక్ గా తీసుకుంటుంది. ఒక వేళ ఫాస్టాగ్ పనిచేయకపోయినా నెంబర్ ప్లేట్ ఆధారంగా టోల్ ను మినహాయించుకునే విధంగా సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేశారు. 80 కిలోమీటర్ల వేగంతో వాహనం ప్రయాణించినా ఏమాత్రం ఆటంకం లేకుండా టోల్ స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల జాతీయ రహదారులపై ప్రయాణ సమయం తగ్గడంతో పాటు టోల్ ఫ్లాజాల వద్ద రద్దీ పూర్తిగా తగ్గిపోతుంది. పెట్రోల్, డీజిల్ కూడా ఆదా అవుతుంది.
వాహన యజమాని ఫాస్టాగ్ లో డబ్బులు నిల్వ చేయకుండా ప్రయాణాలు సాగిస్తే కఠినంగా వ్యవహరించేలా సాఫ్ట్ వేర్ రూపొందించారు. చెల్లించకుండా వాహనం ముందుకు కదిలితే ఈ నోటీసులు మెస్సేజి ద్వారా పంపిస్తారు. అప్పటికీ స్పందించకపోతే ఫాస్టాగ్ ను సస్పెండ్ చేసి, వాహన్ డేటా బేస్ లో రికార్డు చేస్తారు. ఏ జాతీయ రహదారిపై డబ్బులు చెల్లించడానికి ఫ్లాజాలు అనేవి ఉండవు. ఈ నూతన విధానం అమలులోకి వస్తే ప్రతి సంవత్సరం రూ.8వేల కోట్ల వరకు ఆదా అవుతుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఒక అంచనాకు వచ్చింది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం రూ.50వేల నుంచి రూ.60వేల వరకు టోల్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. నూతన విధానం అమల్లోకి వస్తే రాబడిలో లోటుపాట్లు తగ్గుతాయని, అక్రమ రవాణా తగ్గే అవకాశాలున్నాయి. ఐఐటీ చెన్నై, ఖరగ్ పూర్, బెంగళూరు అధ్యయనాల ప్రకారం సరకుల రవాణాలో వ్యయం తగ్గింది. అంతకు ముందు 16 శాతం ఉండగా, ఇప్పుడది 10 శాతానికి చేరుకున్నది. నూతన టోల్ విధానం అమలులోకి వస్తే ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సరకుల రవాణాలో వ్యయం మరింత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
మరో స్కైలాబ్? భూమిపై పడిపోనున్న స్పేస్ టెలిస్కోప్.. మళ్లించేందుకు నాసా వినూత్న ప్రయోగం
మెట్రో స్వాధీనానికి కేంద్రం బ్రేక్.. ప్రత్యామ్నాయంగా RRTS మోడల్ సూచన!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram