Greenfield Highway | మే నుంచి అందుబాటులోకి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే.. విశాఖ, హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరాభారం
విజయవాడ, హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గిపోనుంది. దానితోపాటు సమయం కూడా ఆదా అవనుంది. ఖమ్మం, దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. మే నెలలో దీనిని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
- ఖమ్మం–దేవరపల్లి రోడ్డు పనులు దాదాపు పూర్తి
- రూ.4,451 కోట్లతో ఆధునికంగా నిర్మాణం
- హైదరాబాద్ – విశాఖ మధ్య తగ్గనున్న దూరం, ప్రయాస
విధాత, హైదరాబాద్:
Greenfield Highway | ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మొత్తం 162 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ హైవేకు రూ.4,451 కోట్లు వెచ్చించారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. దీనికి ఎన్‌హెచ్ –365బీజీ నంబర్ కూడా కేంద్ర ఉపరితల రవాణా శాఖ కేటాయించింది. మే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ హైవేను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను రెండు రాష్ట్రాలు ప్రతిపాదించగా 2017లో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ‘భారత్ మాల పరియోజన’ కార్యక్రమం కింద ఈ రోడ్డుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఐదు ప్యాకేజీలుగా విభజించారు. తెలంగాణ పరిధిలో మూడు ప్యాకేజీలు (105.240 కిలోమీటర్లు), ఏపీలో రెండు ప్యాకేజీలు (56.890 కిలోమీటర్లు) ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇది తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు. తెలంగాణలో 106 కిలోమీటర్లు ఉండగా ఏపీలో 57 కిలోమీటర్ల రోడ్డు నాలుగు లేన్లతో నిర్మాణం దాదాపు పూర్తయింది.
- విద్యుత్ అవసరం లేకుండా సోలార్ వీధి లైట్లను ఏర్పాటు చేశారు.
- ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక చొప్పున ప్రయాణికులు సేదతీరేందుకు షెడ్లను ఏర్పాటు చేశారు.
- ఐదెకరాల విస్తీర్ణంలో వీటిని డెవలప్ చేశారు.
- ఎక్కడా లేని విధంగా క్యూఆర్ కోడ్ బోర్డులను నెలకొల్పారు.
- ఈ కోడ్‌ను మొబైల్ ఫోన్‌లో స్కాన్ చేస్తే ఇప్పుడు ఉన్న ప్రాంతం, దగ్గరలోని పోలీసు స్టేషన్, పెట్రోల్ బంక్ వంటి పౌర సమాచార వివరాలు కన్పిస్తాయి.
- మొత్తం 10 భారీ బ్రిడ్జ్‌లు, 49 చిన్న బ్రిడ్జ్‌లు, 295 కల్వర్టులు, 98 అండర్ పాస్‌లు నిర్మించారు.
- వైరా (బోనకల్లు), లింగాల (కల్లూరు), తుమ్మిడికుంట (కొత్తగూడెం), వేంసూరు (తిరువూరు), రేచర్ల (సత్తుపల్లి) కీలకమైన ఎగ్జిట్ పాయింట్లు.
- ప్రతి రెండు కిలోమీటర్లకు పూర్తి హెచ్‌డీ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో పనిచేసేలా అమర్చారు.
- ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి వయా సూర్యాపేట, విజయవాడ మీదుగా వెళ్తున్నారు.
- ఈ మార్గం దూరం 676 కిలోమీటర్లు. ఖమ్మం–దేవరపల్లి మార్గంలో వెళ్తే 56 కిలోమీటర్లు తగ్గుతుంది.
ఖమ్మం పట్టణం సమీపంలోని ధంసలాపురం వద్ద రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. విల్లు ఆకారంలో 52 మీటర్ల పొడవునా నిర్మిస్తున్న బ్రిడ్జ్ 360 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. 11 మీటర్ల ఎత్తుతో ఉండే ఈ కట్టడం పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. రైల్వే సేప్టీ టీమ్ తనిఖీలు చేసి, అనుమతించిన తరువాతే బ్రిడ్జ్ పనులు ముందుకు సాగుతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు నేషనల్ హైవే అధికారులు సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మున్నేరు మీద బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపు ముగింపునకు వచ్చాయి.
దూరంతో పాటు తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారు వయా విజయవాడ మీదుగా ప్రయాణాలు చేస్తున్నారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దూరం కాకుండా ప్రయాణ సమయం కూడా 4 గంటల వరకు తగ్గనున్నదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం 16 ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పెట్టి, టోల్ ప్లాజాలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్ అమలు చేయనున్నారు. ప్రమాదం జరిగినా, వాహనాలు ఆగిపోయినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్ళిపోయేలా టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
సంక్రాంతి సందర్భంగా రాకపోకలకు అనుమతి
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ – విజయవాడ హైవే పై రద్దీని తగ్గించేందుకు తాత్కాలికంగా ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలను అనుమతించారు. పండుగ తరువాత కూడా కొద్ది రోజులు అనుమతించినప్పటికీ కొందరు మితిమీరిన వేగంతో వాహనాలు, టూవీలర్లు నడపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్లూరు వద్ద జరిగిన టూ వీలర్ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అధికారికంగా ప్రారంభించిన తరువాతే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తల్లాడ, వైరా మండలాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది తీవ్రంగా గాయాలపాలయ్యారు. పొగమంచు, పరిమితికి మించిన వేగం, అనుమతి లేనప్పటికీ టూ వీలర్లు రోడ్డు మీదికి రావడంతో ప్రమాదాలు జరిగాయి. గరిష్ఠ వేగం 100 కిలోమీటర్లు కాగా 120 కిలోమీటర్ల వేగంతో నడపడం మూలంగా ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
మొత్తం ఐదు ప్యాకేజీల వివరాలు
ప్యాకేజీ పొడవు (కి.మీ) నిధులు (రూ.కోట్లలో)
తల్లంపాడు నుంచి సోమవరం – 33.604 (1,063)
సోమవరం నుంచి చింతగూడెం – 29.513 (761.73)
చింతగూడెం నుంచి రేచర్ల – 42.119 (948.64)
రేచర్ల నుంచి గురవాయిగూడెం – 27.428 (752.02)
గురవాయిగూడెం నుంచి దేవరపల్లి – 29.462 (926.48)
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram