అండమాన్ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో పడవ బోల్తా ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Apr 15, 2026, 2:49 pm IST
Read Time: 3 mins
అండమాన్ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు

విధాత : అండమాన్ సముద్రంలో పడవ బోల్తా ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా పడవ మునిగినట్లు వెల్లడించారు. కాగా.. ఈ పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ పడవ ఏప్రిల్‌ 4న దక్షిణ బంగ్లాదేశ్‌ లో టేక్‌నాఫ్‌ ప్రాంతం నుంచి బయల్దేరినట్లుగా ఐరాస అధికారులు పేర్కొన్నారు. కాక్స్‌ బజార్‌లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేసియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలిపారు. వాస్తవానికి రోహింగ్యాలు.. మయన్మార్‌కు చెందినవారు. కానీ 2017లో అక్కడి సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. దీంతో ఆ దేశంలోని కాక్స్‌ బజార్‌లో రోహింగ్యాలతో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అయితే, ఇటీవల ఇక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వీరంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటు ప్రాణాలు కోల్పోతున్నారు.