హైలైట్స్:

  • నీట్‌ పేపర్‌ లీకేజీపై గట్టి పోరాటం నిర్వహించలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీ
  • ఆందోళనల్లో ముందుండే వామపక్షాలు, వాటి విద్యార్థి సంఘాలకూ సాధ్యం కాలేదు..
  • కాక్రోచ్‌ పార్టీ పిలుపుతో జంతర్‌ మంతర్‌కు పోటెత్తిన జెన్‌ జీ
  • రాజకీయ పార్టీలు అప్‌డేట్‌ కావాలా?
  • కాక్రోచ్‌ ఆందోళన చెబుతున్న తక్షణ గుణపాఠాలేంటి?

నీట్‌ పేపర్‌ లీకేజీ, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం అవకతవకల నేపథ్యంలో ఒక్క పిలుపుతో వేల మంది ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్దకు పోటెత్తారు. ఆ పిలుపునిచ్చింది దేశంలోనే అత్యంత సీనియర్‌ పార్టీగా, దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించామని చెప్పుకొనే కాంగ్రెస్‌ కాదు. ప్రజల హక్కులు, సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టు పార్టీ కూడా కాదు. విద్యార్థులకు నష్టం వాటిల్లితే లాఠీ దెబ్బలు తినైనా సరే నిలబడి కొట్లాడే వామపక్ష విద్యార్థి సంఘాలు కాదు. సోకాల్డ్‌ ప్రతిపక్ష పార్టీలేమీ కాదు. ఆఖరుకు పైన చెప్పుకొన్న అందరూ కలిసి.. ప్రభుత్వాన్ని నిగ్గదీసేందుకు  ఇచ్చిన సంయుక్త పిలుపు కూడా కాదు. ఒక సగటు పౌరుడు.. అదీ వ్యంగ్యాత్మకంగా ఏర్పాటు చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు.. దేశ యువతరాన్ని ఉద్యమ బాట పట్టించేలా చేసింది. ప్రతిపక్షాలకు మించిన సవాలును అధికార పక్షానికి విసిరింది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితిని సృష్టించింది.

ఈ ఆందోళనలో పాల్గొన్న ఒక విద్యార్థి ‘మా తరం వాళ్లలో కోపం చాలా ఉంది. దాన్ని ఎటు మళ్లించాలో ఈ ఉద్యమం మాకు చూపింది’ అని చెప్పిన అంశం.. దేశంలోని ఢక్కాముక్కీలు తిన్న, మహామహా నేతలు ఉన్న రాజకీయ పార్టీలకు ఒక సవాలు విసిరింది. పదమూడు లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని, వారి కుటుంబ సభ్యుల ఆకాంక్షలను క్రూరంగా తుంచిపారేసిన ఒక దుర్మార్గాన్ని ‘ఖండిస్తున్నాం’ అంటూ ప్రకటనలకు, చిన్నచిన్న నిరసన ప్రదర్శనలకు పరిమితమైన పార్టీలు.. వేల సంఖ్యలో వెల్లువెత్తిన విద్యార్థులను, వారిలో ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందా? అనే చర్చను ప్రారంభించింది. ఈ ధర్నా లేదా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొంత ఖర్చులపైనే ఇక్కడకు వచ్చామని చెబుతున్నారు. అంటే.. ఒక అంశం తీవ్రత.. వారిని జంతర్‌ మంతర్‌వైపు నడిపించింది. ఇదే తీవ్ర అంశంపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ కానీ.. ఉద్యమాలకు ఊపిరులూదే వామపక్షాలు కానీ ఎందుకు ఈ స్థాయిలో పిలుపునివ్వలేకపోయాయి? అన్యాయాలపై గొంతెత్తుదామని పిలుపునిస్తే కదలలేని జడత్వంతో విద్యార్థులు ఉన్నారనే నెగెటివ్‌ భావన ఆ రాజకీయ పార్టీల్లో పేరుకుపోయి ఉందా? నేటి పిల్లలు మొబైల్‌ ఫోన్లకు బానిసలయ్యారని పదే పదే ఆవేదన చెందే మేధావులు.. లేక జెన్‌ జీ భాషను, భావ వ్యక్తీకరణ శక్తిని ఆ పార్టీలు అంచనా వేయలేక పోతున్నాయా? ఇదే అంశంపై ఏ రాజకీయ పార్టీ ఆందోళనకు రానంత స్థాయిలో కాక్రోచ్‌ జనతా పార్టీ పిలుపుతో ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ అంశాలన్నింటిపై ప్రజలందరిలో చర్చ సాగుతున్నది.

నిజానికి కాక్రోచ్‌ జనతా పార్టీ పుట్టుక చాలా సింపుల్‌ ఆగ్రహంతో సంభవించింది. ఒక కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు లేదా నకిలీ డిగ్రీలతో లాయర్లుగా చలామణి అవుతున్నారని, సోషల్ మీడియాలో ప్రవేశించి వ్యవస్థను పరాన్నజీవుల్లా పీడిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై వివాదం రేగడంతో మరుసటి రోజే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదని భాష్యం చెప్పారు. దేశ యువతను తాను అవమానించలేదని, వారు దేశానికి మూల స్థంభాలని కుండబద్దలు కొట్టారు. కానీ.. అప్పటికే యువత ఆ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉంది. అదే సమయంలో అదే అంశాన్ని చేపట్టి, జస్టిస్‌ సూర్యకాంత్‌ సంబోధించిన కాక్రోచ్‌ల పేరుతో ఆవిర్భవించింది కాక్రోచ్‌ జనతా పార్టీ. అది ప్రారంభంలో ఒక సెటైరిక్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయి ఉండొచ్చు కానీ.. అది లేవనెత్తిన అంశాలు యువతకు కనెక్ట్‌ అయ్యాయి. ఆ యువత చదువుకున్నారు.. కానీ.. ఉద్యోగాలు రావడం లేదు. ఏటా కోట్ల ఉద్యోగాలంటున్న ప్రభుత్వం.. పకోడీలు వేయడం కూడా ఉద్యోగాల కోటా కింద జమకట్టేస్తున్న తరుణం. పరీక్షా పే చర్చ పేరుతో ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మోటివేషనల్‌ క్లాసులు పీకుతున్న సమయంలో.. అవే పరీక్షల పత్రాలు బజారులో పల్లీబఠానీల తరహాలో అమ్ముడవుతున్న సందర్భం. వీటికి బాధ్యులెవరు? వీటికి అంతం ఎప్పుడు? కష్టపడి చదివిన విద్యార్థులను కాదని.. పరీక్ష పత్రాలు కొని పరీక్ష పాస్‌ అవుతున్న దారుణాలు ముగిసేదెన్నడు? యువతలో కోపం వెనుక దాగి ఉన్న ఈ ప్రశ్నలే.. వారిని కాక్రోచ్‌ జనతా పార్టీ సామాజిక మాధ్యమాలను ఫాలో అయ్యేలా చేసింది. చినుకు చినుకు కలిసి.. తుదకు వరదైనట్టు.. చిన్న కాల్వలన్నీ కలిసి.. ఉధృతంగా పొంగే వాగైనట్టు.. స్థాపించిన కొద్ది రోజులకే దేశ రాజకీయ ఉద్ధండులనే కళ్లింత చేయించింది కాక్రోచ్‌ జనతా పార్టీ.

మళ్లీ ఇదే ప్రస్తుత ప్రధాన స్రవంతి ప్రతిపక్ష రాజకీయ పార్టీల వద్దకు వద్దాం. ఈ పార్టీల నేతలంతా గతంలోనూ పరీక్ష పత్రాల లీకేజీలపై పార్లమెంటులో ఉపన్యాసాలు దంచినవారే. ఈ కొన్నేళ్ల కాలంలో ఎన్ని పరీక్షా పత్రాలు లీకయ్యాయో ఢంకా బజాయించి.. అధికార పక్షంపై నిప్పులు చెరిగినవారే. నిజానికి ప్రభుత్వ తరఫున జరిగే లోపాలపై గతంలో ప్రతిపక్షపార్టీగా ఉన్న నేటి అధికార పక్షం సైతం ఒంటికాలిపై లేచిన ఉదంతాలు చూశాం. ఎక్కడో యుద్ధం జరిగితే మనపై ఎందుకు ప్రభావం అని వెక్కిరించిన నాయకులు.. ఇప్పుడు రూటు మార్చి.. యుద్ధం వల్లే సంక్షోభం అని సెలవిస్తున్నారు. రూపాయి విలువ పడిపోతే.. మనకు చుట్టుపక్కల ఉన్న దేశాల రూపాయి ఎందుకు పడిపోలేదు? మన రూపాయి విలువే ఎందుకు పడిపోయిందో ‘నాకు తెలియాలి.. తెలిసి తీరాలి’ అని గంభీర వచనాలు పలికిన అదే నేతలు.. అధికారంలోకి రాగానే.. రూపాయి పతనానికి మన తప్పేమీ లేదని, డాలర్‌ బలపడటంతోనే రూపాయి పడిపోయిందని ముక్తాయిస్తున్న పరిస్థితి. ప్రతి దశలో ఒక నాటకం. ప్రతి చర్యలో ఒక నాటకం. యావత్‌ రాజకీయాలు డ్రామాగా మారిపోయిన నేపథ్యం. సరిగ్గా ఇదే యువతకు జీర్ణం కాని విషయం. ఇదే యువతలో ఆగ్రహం రేపుతున్న విషయం.

నిజానికి ఈ విషయాలు కూడా ఇప్పటి జెన్‌ జీ తరానికి అనవసరం. వారు ఆలోచించేది తమ జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి? తమకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు? తమ తల్లిదండ్రుల ఖర్చులు ఎందుకు పెరిగిపోతున్నాయి? తమ మొబైల్‌ ఫోన్‌ నెట్‌ బిల్లు జేబులకు చిల్లులు ఎందుకు వేస్తున్నది? వీటికి సమాధానాలు చెప్పేవాళ్లు కరువయ్యారు. వారి భాషలో వారితో మాట్లాడేవారు కరువయ్యారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, వారి ఆవేదన, ఆక్రోశాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయనే భావన విద్యార్థుల్లో, యువతలో నాటుకుపోయిందని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు ఈ దారుణ ఘటనపై ఉద్యమాలు చేయడంలో ప్రధాన భూమిక పోషించలేకపోయాయనే ఆగ్రహం వ్యక్తం అవుతోందని అన్నారు. అందుకే ఒక విద్యావంతుడు ప్రారంభించిన ఉద్యమానికి… శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారని విశ్లేషించారు.

ఏది ఏమైనా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోలేదని అర్థమవుతోంది. గతంలో అవినీతిపై అన్నా హజారే న్యూఢిల్లీలో ఉద్యమించగా, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం వెనకాల బీజేపీ ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇవాళ ఢిల్లీలో చేపట్టిన నిరసన వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ మద్ధతు ఉందనే ప్రచారాన్ని బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఒక ఉద్యమం వెనక ఒక పార్టీ ఉందంటూ బద్నాం చేసుకుంటున్నారు తప్పితే, ప్రజల ముందు ఏ విధంగా నమ్మకం కోల్పోతున్నామనే విషయాన్ని రాజకీయ పార్టీలు పసిగట్టకపోవడం శోచనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుందా? ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకూ మరిన్ని రూపాల్లో ఆందోళనలు ఉంటాయా? తదుపరి ఎజెండాపై సీజేపీ తన కార్యాచరణ ప్రకటిస్తుందా? వాటిపైనా యువత కదిలి వస్తుందా? వీటికి వచ్చే సమాధానాలు.. ‘అవును’ అయితే.. అవి భావి భారత రాజకీయాలను కీలక మలుపు తిప్పడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.