పట్టపగలే చిమ్మ చీకటి.. ఆగస్ట్‌ 2న ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్య గ్రహణం.. భారత్‌లో?

అతి త్వరలో ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోనున్నది. 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్ట్‌ 2, 2026న ఏర్పడబోతున్నది. భారతదేశంలోని కొన్ని నగరాల్లో కూడా పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.

Reported by: Jagan Mohan Talluri | సైన్స్​ – టెక్నాలజీ | Edited by: విధాత సైన్స్ డెస్క్ | May 28, 2026, 1:50 pm IST
Read Time: 8 mins
పట్టపగలే చిమ్మ చీకటి.. ఆగస్ట్‌ 2న ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్య గ్రహణం.. భారత్‌లో? 2027 ఆగస్టు 2న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది.

ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణాన్ని అనుభూతించే అవకాశం ఆగస్ట్‌ 2, 2027న కలుగబోతున్నది. ఆ రోజు ఆరు నిమిషాలకు పైగా సూర్యుడు కనిపించకుండా పోతాడు. ఫలితంగా పట్టపగలే చిమ్మచీకట్లు అలముకుని రాత్రిని తలపిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేయడంతో వెలుతురు మాయం అవుతుంది. 21వ శతాబ్దంలోనే ఇది అత్యంత సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణమని నాసా చెబుతోంది. మరో 157 సంవత్సరాల వరకూ ఇలాంటి అద్భుతాన్ని వీక్షించే అవకాశం లేదు.

గ్రహణం సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఆరు నిమిషాల 23 సెకన్లు ఉంటుందని నాసా గాడర్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ అంచనా వేసింది. ఈ శతాబ్దం ముగిసేలోపు ఇంతటి సుదీర్ఘ సూర్యగ్రహణం మళ్లీ కనిపించదు. గతంలో 1991లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఇంతటి స్థాయిలో 2114లో మాత్రమే దర్శనమిచ్చే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదీ ప్రత్యేకత…

చంద్రుడు ఈసారి భూమికి అత్యంత దగ్గరగా ఉండే పెరిజీ స్థితిలోకి వెళతాడు. దానివల్ల ఆకాశంలో చంద్రుడు కొంచెం పెద్దగా అగుపిస్తాడు. ఫలితంగా సూర్యడిని పూర్తిగా కప్పేయగలడు. గ్రహణం అత్యధికంగా కనిపించే ప్రాంతాల్లో సూర్యుడు దాదాపు నడినెత్తిన ఉంటాడు. ఆ కారణంగా ఆ యా ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సమయం మరింత పెరుగుతుంది.

పూర్తిగా వీక్షించే అవకాశం ఈ దేశాలకే..

సంపూర్ణ సూర్య గ్రహణ మార్గం ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో దక్షిణ స్పెయిన్‌, మొరాకో, అల్జీరియా, ట్యునీసియా, లిబియా, ఈజిప్ట్‌, సౌదీ అరేబియా, యెమెన్‌ దేశాల ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది.

ఎక్కడెక్కడ.. ఎంతసేపు చీకటి?

వివిధ దేశాల భౌగోళిక స్థితి కారణంగా ఆ యా దేశాల్లోని కొన్ని నగరాల్లో సమయాలు భిన్నంగా ఉంటాయి. స్పెయిన్‌లోని టరీఫాలో 4.39 నిమిషాలు గ్రహణం ఉంటుంది. మొరాకోలోని టాంగియర్‌లో 4.50 నిమిషాలు, లిబియాలోని బెంఘాజీలో 6.7 నిమిషాలు, ఈజిప్ట్‌లోని లక్సర్‌లో 6.19 నిమిషాలు, ఎర్ర సముద్రం (రెడ్‌ సీ) తీర ప్రాంతంలో 6.20 నిమిషాలు గ్రహణం కనిపిస్తుంది.

ఎంతమంది చూసే అవకాశం?

ఈ ఖగోళ అద్భుతం అందరికీ కనిపించదు. కానీ.. సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో నివసించే దాదాపు 9 కోట్ల మందికి దీనిని వీక్షించే అవకాశం కలుగుతుంది. 2024లో ఉత్తర అమెరికాలో కనిపించిన సూర్యగ్రహణంతో పోల్చితే.. ఈసారి మూడు రెట్లు ఎక్కువ మందికి వీక్షణావకాశం లభిస్తున్నది.

అరుదైన దృశ్యాలు..

హైలైట్స్:

  • సూర్య గ్రహణంలో కొన్ని అద్భుత దృశ్యాలు కూడా కనిపిస్తాయి.
  • అందులో బైలీస్‌ బీడ్స్‌ అనేవి ఒకటి. ఇవి ప్రకాశ బిందువులు. చంద్రుడి అంచుల మధ్యగా సూర్యకాంతి ప్రయాణించడం కారణంగా ఇవి ఏర్పడుతాయి.
  • ఆ వెంటనే డైమండ్‌ రింగ్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తుంది. ఈ సమయంలో సూర్యుడికి ఒక కొసన కాంతి.. వజ్రంలా మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తుంది.
  • ఆకాశం మొత్తం చీకటిమయం అవడం కారణంగా నక్షత్రాలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది.
  • సూర్యుడి ‘కరోనా’గా పిలిచే బాహ్య కాంతి వలయం స్పష్టంగా చూడవచ్చు.
  • ఉష్ణోగ్రత కూడా ఒక్కసారిగా తగ్గిపోతుంది.

కంటి భద్రత అత్యంత ముఖ్యం

సూర్యగ్రహణం వీక్షణంలో అత్యంత కీలకమైనది కంటి భద్రత. తగిన భద్రతా పరికరాలు ఉపయోగించి మాత్రమే గ్రహణాన్ని చూడాలి. లేనిపక్షంలో కంటి చూపు దెబ్బతింటుంది. అందుకని.. ఐఎస్‌వో 12312–2 ప్రమాణలు ఉన్న సర్టిఫైడ్‌ ఎక్లిప్స్‌ గ్లాసెస్‌ను మాత్రమే వినియోగించాలి. సంపూర్ణ సూర్యగ్రహణం ఉండే కొన్ని క్షణాలు తప్పించి.. మిగిలిన సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం అత్యంత ప్రమాదకరమని నాసా హెచ్చరించింది.

భారత్‌లో పాక్షికమే..

భారతదేశంలో సూర్యగ్రహణం ఆ రోజు సంపూర్ణంగా కనిపించదు. పాక్షికంగా మాత్రమే చూసే అవకాశం కలుగుతున్నది. హైదరాబాద్‌లో 38శాతం నుంచి 49 శాతం వరకూ సూర్యుడిని చంద్రుడు కప్పేస్తాడు. సుమారుగా మధ్యాహ్నం 3.55 గంటలకు సూర్యగ్రహణం మొదలవుతుంది. గరిష్ఠ స్థితికి సాయంత్రం 4.55 గంటలకు చేరుకుంటుంది. సాయత్రం 5.45 గంటలకు ముగుస్తుంది. దేశంలోని ఇతర నగరాలైన నాగర్‌ కోయిల్‌లో సుమారు 53 శాతం సూర్యడు కవర్‌ అవుతాడు. బెంగళూరులో 49 శాతం, ముంబైలో 30శాతం, న్యూఢిల్లీలో 17శాతం గ్రహణం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి..

రాజ్యసభకు సిద్దరామయ్య…సీఎంగా డీకే శివ‌కుమార్!
AI దెబ్బకు ఫోన్ల ధరలు పెరుగుతాయా? చిప్‌ల కొరతపై మొబైల్​ కంపెనీలకు కొత్త టెన్షన్‌