AI దెబ్బకు ఫోన్ల ధరలు పెరుగుతాయా? చిప్‌ల కొరతపై మొబైల్ కంపెనీలకు కొత్త టెన్షన్
AI డేటా సెంటర్ల కోసం భారీగా మెమరీ చిప్‌ల కొనుగోలు జరగడంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై కూడా కొత్త ఒత్తిడి మొదలైంది. DRAM, NAND చిప్‌ల కొరత కారణంగా 2026లో ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ రీసెర్చ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
AI బూమ్‌తో మెమరీ చిప్‌లకు భారీ డిమాండ్.. మొబైల్ ధరలు పెరిగే అవకాశం
AI Boom May Push Smartphone Prices Higher As Memory Chip Shortage Deepens
- 🔴 AI బూమ్‌తో చిప్ మార్కెట్‌పై ఒత్తిడి
- 🔴 మెమరీ కొరతతో స్మార్ట్‌ఫోన్ ధరలకు టెన్షన్
- 🔴 బడ్జెట్ ఫోన్ల ధరలపై ఎక్కువ ప్రభావం
- 🔴 RAM, storage స్పెసిఫికేషన్లలో మార్పుల అవకాశం
విధాత టెక్ డెస్క్ | మే 26, 2026:
హైదరాబాద్: కృత్రిమ మేధస్సు.. అంటే AI మన రోజువారీ జీవితంలోకి వేగంగా వస్తోంది. ఫోన్లలో ఏఐ ఫీచర్లు, ల్యాప్‌టాప్‌లలో ఏఐ టూల్స్, ఆఫీసుల్లో ఏఐ అసిస్టెంట్లు, డేటా సెంటర్లలో భారీ ఏఐ మోడల్స్.. ఇలా టెక్నాలజీ ప్రపంచమంతా ఇప్పుడు ఏఐ చుట్టూనే తిరుగుతోంది. కానీ ఈ AI బూమ్ వల్ల సాధారణ వినియోగదారుడి జేబుపై కొత్త భారం పడే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే కంప్యూటర్లు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లకు చిప్‌లు కరువై, వాటి ధరలు దాదాపు 3 రెట్లు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్లు, గేమింగ్ కన్సోల్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే మెమరీ చిప్‌లకు కూడా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. AI డేటా సెంటర్ల కోసం టెక్ కంపెనీలు భారీగా మెమరీ చిప్‌లు, ప్రాసెసర్లు కొనుగోలు చేస్తుండటంతో, సాధారణ కన్జ్యూమర్ గ్యాడ్జెట్లకు అవసరమైన DRAM, NAND చిప్‌ల సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, 2026లో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
AI డేటా సెంటర్లకు చిప్‌ల వేట
AI మోడల్స్ పనిచేయాలంటే భారీ డేటా సెంటర్లు అవసరం. ఆ డేటా సెంటర్లకు అత్యంత వేగంగా పనిచేసే చిప్‌లు కావాలి. అందుకే చిప్ తయారీ కంపెనీలు ఇప్పుడు ఎక్కువ లాభం వచ్చే AI డేటా సెంటర్ చిప్‌లవైపు దృష్టి మళ్లిస్తున్నాయి. అదీ కాక, డాటాసెంటర్లకు సరిపడా చిప్స్ తయారుచేయడానికే కంపెనీలకు తీరిక లేదు. దీంతో స్మార్ట్‌ఫోన్లు, పీసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సాధారణ మెమరీ చిప్‌ల సరఫరా దారుణంగా పడిపోయింది.
IDC విశ్లేషణ ప్రకారం, మెమరీ తయారీదారులు స్మార్ట్‌ఫోన్లు, పీసీల్లో వాడే సాధారణ DRAM, NAND కంటే AI డేటా సెంటర్లకు అవసరమైన HBM, high-capacity DDR5 వంటి చిప్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల సాధారణ మెమరీ మాడ్యూల్స్ సరఫరా తగ్గి, ధరలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే కొన్ని కంపెనీల ఫలితాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. షావోమీ(Xiaomi) తాజా త్రైమాసిక ఫలితాల్లో మెమరీ, ఇతర కాంపొనెంట్ ఖర్చులు పెరగడం లాభాలపై ఒత్తిడి తెచ్చిన అంశాల్లో ఒకటిగా కనిపించింది.
బడ్జెట్ ఫోన్లపై ప్రభావం ఎక్కువేనా?

AI డేటా సెంటర్ల డిమాండ్‌తో చిప్‌ల మార్కెట్‌పై ఒత్తిడి.. స్మార్ట్‌ఫోన్ ధరలపై ప్రభావం పడే అవకాశం
స్మార్ట్‌ఫోన్ ధరల్లో మెమరీ చిప్‌ల పాత్ర కీలకం. ముఖ్యంగా చౌక ఫోన్లలో కంపెనీల లాభాల మార్జిన్ తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మెమరీ, స్టోరేజ్ ఖర్చులు పెరిగితే కంపెనీలకు రెండే మార్గాలు. ఒకటి — ధర పెంచడం. రెండోది — అదే ధరలో ర్యామ్, స్టోరేజ్ వంటి కీలక విషయాలు తగ్గించడం.
Counterpoint Research అంచనా ప్రకారం, మెమరీ చిప్‌ల కొరత కారణంగా 2026లో స్మార్ట్‌ఫోన్ల సగటు అమ్మకం ధర 6.9 శాతం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మెమరీ ధరలు Q2 2026 వరకు మరో 40 శాతం వరకు పెరగొచ్చని కూడా ఆ సంస్థ తన విశ్లేషణలో పేర్కొంది.
గార్ట్నర్ అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2026 చివరినాటికి DRAM, SSD ధరలు కలిపి 130 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ ధరలు 2025తో పోలిస్తే 13 శాతం వరకు పెరగొచ్చని ఆ సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 8.4 శాతం తగ్గే అవకాశం ఉందని Gartner అంచనా వేసింది.
ఇది భారత మార్కెట్‌కు కూడా ప్రమాద సంకేతమే. ఎందుకంటే భారత్‌లో చౌక, మిడ్‌రేంజ్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంది. ఒకవేళ కంపెనీల తయారీ ఖర్చులు పెరిగితే, కొత్త మోడళ్ల ధరలు కాస్త పెరగడం లేదా అదే ధరలో స్పెక్స్ తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. ముఖ్యంగా ₹10,000 నుంచి ₹20,000 మధ్య ఫోన్ కొనేవారికి ఈ ఆశాభంగం తప్పేట్టు లేదు.
అయితే ఫోన్ కొనేవారు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీలు ఒకేసారి ధరలు పెంచుతాయని చెప్పలేం. పెద్ద బ్రాండ్లకు ముందస్తు సరఫరా ఒప్పందాలు ఉండొచ్చు. కొన్ని కంపెనీలు ధర పెంచకుండా, offers తగ్గించడం లేదా స్టోరేజ్ వేరియంట్లను మార్చడం వంటి మార్గాలు ఎంచుకోవచ్చు. కానీ AI బూమ్ వల్ల చిప్ మార్కెట్‌లో మొదలైన ఈ ఒత్తిడి, రాబోయే నెలల్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అవకాశముంది.
మొత్తంగా చూస్తే, AI మన పనులను సులభం చేస్తోంది. కానీ అదే AI కోసం నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లు ప్రపంచ చిప్ సరఫరాను ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఆ ప్రభావం చివరకు మన చేతిలోకి వచ్చే మొబైల్ ధరపైనా పడొచ్చు. అందుకే రాబోయే కాలంలో ఫోన్ కొనేవారు కేవలం కెమెరా, బ్యాటరీ, డిజైన్ మాత్రమే కాదు.. ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ల ధరల మార్పులనూ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram