Oneplus N Series | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తక్కువ ధరలో కొత్త మొబైళ్లు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బడ్జెట్ విభాగంలో నార్డ్ సిరీస్ ఫోన్లతో మంచి ఆదరణ పొందుతున్న కంపెనీ.. ఇప్పుడు వన్‌ప్లస్ ఎన్ సిరీస్ పేరుతో మరో కొత్త లైనప్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేసినట్లుగా లీకుల ద్వారా తెలుస్తోంది.

టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ ఎన్ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో భారత మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదిక ట్విట్టర్(ఎక్స్) ద్వారా వెల్లడించారు. యోగేశ్ బ్రార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ సిరీస్‌లోని కొన్ని మోడళ్లు రూ.20వేల లోపు ధరతోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై వన్‌ప్లస్ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువలేదు.

వన్‌ప్లస్‌లో అత్యంత చవకైన ఫోన్‌గా నార్డ్ సీఈ6 లైట్ అందుబాటులో ఉంది. గత నెలలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ.20,999గా ఖరారుచేశారు. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ బేస్ వేరియంట్‌‌లో ఇది వస్తుంది. అదే 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.22,999కు విడుదల చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఎన్ సిరీస్ ఫోన్ ధర ఇంతకంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇటీవల విడుదలైన Nord CE6 లైట్ మొబైల్ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో 91. శాతం ఉంది.

పనితీరుపరంగా ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎపెక్స్ ప్రాసెసర్‌ను అమర్చారు. గ్రాఫిక్స్ కోసం ARM Mali-G615 GPU అందించారు. ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2మెగాపిక్సెల్ సెకంరీ సెన్సర్‌ను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియోకాలింగ్ కోసం ముందు భాగంలో 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

అలాగే 7000mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ చార్జింగ్, 10W రివర్స్ చార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఎన్ సిరీస్ కూడా దాదాపు ఇదే ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, బడ్జెట్ మొబైల్స్ మార్కెట్‌లో వన్‌ప్లస్ ఎన్ సిరీస్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.