Motorola Edge 70 Pro+ | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన ఉనికి మరింత బలోపేతం చేసుకునేందుకు మోటరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను గురువారం భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇటీవల ఎడ్జ్ 70 ప్రో మోడల్‌ను లాంచ్ చేసిన మోటరోలా.. మరిన్ని అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో తాజాగా ప్రో ప్లస్ మోడల్‌ను కూడా ఆవిష్కరించింది.

ధర ఎంతంటే..

మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ నుంచి భారత మార్కెట్‌లో 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.47,999గా నిర్ణయించింది. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను మోటరోలా అందిస్తోంది. ప్రత్యామ్నాయంగా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 11వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ మొబైల్ మూడు ప్రత్యేక రంగుల్లో విడుదల కానుంది Pantone Chicory Coffee, Pantone Stormy Sea, Pantone Zinfandel పేర్లతో అందుబాటులోకి వస్తుంది. వీటిలో చెక్క ఆకృతిని పోలిన ఫినిష్, ట్విల్ డిజైన్, సాటిన్ లక్స్ ఫినిష్ వంటి ప్రత్యేక డిజైన్‌ టచ్‌లు ఉన్నాయి.

డిస్‌ప్లే

డిజైన్‌పరంగా ఇది మోటరోలా ఎడ్జ్ 70 ప్రో మోడల్‌ను పోలి ఉంటుంది. ఇందులో 6.8 అంగుళాల 1.5 Extreme AMOLED డిస్‌ప్లేను అందించారు. 1272*2772 పిక్సెల్ రిజల్యూషన్, 144 Hz రీఫ్రెష్ రేట్, HDR 10+ను సపోర్టు చేస్తుంది. 100 శాతం DCI-P3 కలర్ గామట్, 5200 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. తడి చేతులతో కూడా ఉపయోగించేలా ఇందులో వాటర్ టచ్ ఫీచర్‌ను కూడా అందించారు. అదనంగా IP68, IP69 రేటింగ్‌తో ధూళి, నీటి నిరోధకతతో వస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్

మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్‌ మొబైల్‌లో 4nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందించే ఈ ప్రాసెసర్.. AnTuTu బెంచ్‌మార్క్‌లో 24 లక్షలకు పైగా స్కోర్ సాధించిందని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్‌లో 12జీబీ LPDDR5X ర్యామ్, 256జీబీ UFS 4.1 స్టోరేజ్‌ను అందించారు. భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు 4600 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం కలిగిన వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.

కెమెరా ఫీచర్లు

ఫొటోగ్రఫీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ Sony LYT-710 ప్రధాన కెమెరా (OISతో), 50మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్‌ జూమ్‌తో వస్తున్నాయి. మూడోది 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. దీని ద్వారా 4K 60fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఆటోఫోకస్‌తో కూడిన 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఫాస్ట్ చార్జింగ్‌తో కూడిన భారీ బ్యాటరీ

ఈ మొబైల్‌లో 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు అందించారు. అలాగే 5W వైర్డ్, వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఇతర డివైజ్‌లను కూడా చార్జ్ చేసుకోవచ్చు.

కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు

ఈ మొబైల్‌లో 5G, 4G LTE, Wifi 6E, Bluetooth 5.4, USB Type C, GPS, GLONASS, Galileo వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, అంబియెంట్ లైట్ సెన్సార్ వంటి పలు సెన్సార్లు ఉన్నాయి.