బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి(51) అనారోగ్యంతో కన్నుమూశారు. గుండెపోటుతో ఈ నెల 26న సికింద్రాబాద్ యశోధ ఆసుపత్రిలో చేరిన సుదర్శన్ రెడ్డి కార్డియాక్ అరెస్టు తో మృతి చెందినట్లుగా శుక్రవారం తెల్లవారుజామున వైద్యులు ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా మాజీ మంత్రులు, పలు పార్టీల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియల ప్రక్రియ పూర్తి కానుంది. పెద్ది అంతిమయాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలివచ్చి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
తెలంగాణ ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు..
వరంగల్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 2001లో టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరి అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2015 పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా పనిచేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఆయన 2004లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికై, ఆ తర్వాత 2002లో రాష్ట్ర పార్టీ కన్వీనర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
కేసీఆర్ సంతాపం..
తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని అన్నారు. పెద్దిని కోల్పోయి శోక తప్త హృదయులైవున్న ఆయన భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్ రావు ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు.