కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన బాన్సువాడ ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం
సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తోందని బాన్సువాడ ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా ఈ చర్య తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది.
కాంగ్రెస్‌లో చేరిననాడు రేవంత్ రెడ్డితో పోచారం.. నేడు పట్టించుకోవడం లేదని బాధ
BRS turncoat MLA Pocharam Srinivas Reddy Turns Heat on Congress Over Siddapur Project Delay
🔴 సిద్ధాపూర్ ప్రాజెక్టుకు నిధుల విడుదల తీవ్ర ఆలస్యం
🔴 పోచారం నిరసన.. అధికారులపై అసంతృప్తి
🔴 తనను పట్టించుకోవడం లేదని ఆవేదన
🔴 నిధుల కొరత ఉందన్న కాంగ్రెస్ అంగీకారం
తెలంగాణ డెస్క్ | 13 ఏప్రిల్ 2026:
విధాత, నిజామాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల కోసం నిధులు విడుదల చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా పరిధిలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ఆదివారం రాత్రి ఆయన ప్రత్యక్షంగా నిరసన వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంప్రదించినప్పటికీ స్పందన లేదని ఆయన ఆరోపించారు. తన కాల్స్‌కు అధికారులు స్పందించడం లేదని, తనను పక్కన పెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు – పోచారం అసహనం

సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్, పోచారం (ఫైల్)
తాను మంత్రిగా ఉన్న సమయంలో అధికారులు అర్ధరాత్రి కూడా స్పందించేవారని, అప్పట్లో ఆదేశాలు నిమిషాల్లో జారీ అయ్యేవని పోచారం వాపోయారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తనకు సరైన గౌరవం, ప్రతిస్పందన లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.
తన ఫోన్ సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది. “ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అన్నది కూడా అర్థం కావడం లేదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
నిధుల లేమితో నిలిచిపోయిన ప్రాజెక్టు

నీటి మట్టం తగ్గిన సిద్ధాపూర్ రిజర్వాయర్ దృశ్యం (ఫైల్)
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పనుప్రారంభమై గణనీయమైన స్థాయికి పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల కొరత కారణంగా పనులు నెమ్మదించాయని తెలుస్తోంది.
సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలిపెడుతున్నారని పోచారం ఆరోపించారు. ఈ పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పాడైపోతుందని ఆయన హెచ్చరించారు.
ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాత్రం ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అంగీకరించారు. పోచారం అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న నాయకుడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడేనంటూ, సంయమనంలో వ్యవహరించాలని సూచించారు.
కాగా, పోచారం శ్రీనివాస రెడ్డి వ్యవహారశైలి తెలంగాణ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణలు, కోర్టు కేసులు నడుస్తున్న వేళలో పోచారం ఈవిధంగా విమర్శలు చేయడంలో పరమార్థమేమిటోనని రాజకీయ విశ్లేషకులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram