Konda Murali | కుక్కను కొట్టినట్టే అని వదిలేశా.. ఎర్రబెల్లి కుటుంబంపై కొండా మురళి వ్యాఖ్యలు.. సొంతపార్టీ నేతలపైనా ఫైర్‌

  • By: TAAZ    news    Jun 19, 2025 8:08 PM IST
Konda Murali | కుక్కను కొట్టినట్టే అని వదిలేశా.. ఎర్రబెల్లి కుటుంబంపై కొండా మురళి వ్యాఖ్యలు.. సొంతపార్టీ నేతలపైనా  ఫైర్‌

Konda Murali | అదేంటో గానీ.. కొంతమంది రాజకీయ నాయకులు ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని కోరుకుంటారు. వాటిలో కోరితెచ్చుకునేవి కొన్నైతే.. మరికొన్ని అనుకోకుండా జరిగేవీ ఉంటాయి. వీరి స్పందనకు స్వపక్షం విపక్షం అనే తేడా కూడా ఉండదు. సదరు నాయకులు ఈ మేరకు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇతరులపై విమర్శలు చేయడమో.. ఇతరుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమో అలవాటుగా మార్చుకుంటారు. కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తుల వ్యవహార శైలికి ప్రతిస్పందిస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో తామే వివాదాలను సృష్టిస్తూ ఉంటారూ. మొత్తంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తమ రాజకీయ జీవితంలో ఈ వివాదాస్పద వ్యవహారాలు తమ ఎదుగుదలకు తోడ్పడుతున్నాయని భావిస్తారేమోగానీ.. ఏ పార్టీలో ఉన్నా.. వారి రూటే సపరేటు అన్నట్టు ఉండే కొండా సురేఖ, మురళి దంపతుల తీరు చర్చనీయాంశంగా మారుతుంది.

మరోసారి కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మురళి.. సొంత పార్టీ నాయకులతో పాటు విపక్ష నాయకులపై విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందోననే ఆసక్తికర చర్చ జోరుగా సాగుతున్నది. విపక్ష బీఆర్‌ఎస్ నాయకుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు దయాకర్ రావు తమ్ముడు బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావులను మురళి విమర్శించారు. ప్రస్తుతం సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యలపై తనదైన తీరులో విరుచుకుపడ్డారు. వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

స్వపక్ష, విపక్ష నాయకులపై మురళి విమర్శలు

టీడీపీలో ఉన్నంతకాలం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆకాశానికెత్తి, ఆ తర్వాత ఆయన ఓటమికి కారణమైన ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి మంత్రయాడని విమర్శించారు. ‘ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే అని వదిలేస్తున్న. పెద్దోడు మాట్లాడిండని వాళ్ళ తమ్ముడు ప్రదీప్ రావు మాట్లాడుతాడు’ అంటూ సెటైర్ వేశారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కనుబొమ్మలు లేని నాయకుడు, కనుబొమ్మలు గీసుకునే నాయకున్ని మీరు ఎప్పుడైనా చూసారా అంటూ.. అంటూ కడియం శ్రీహరిపై అభ్యంతరకర పదాలు వాడారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుని, ఈ రోజు కేసీఆర్‌, కేటీఆర్‌లను వెన్నుపోటు పొడిచిండని ఆ ఎన్‌కౌంటర్ల స్పెషలిస్టేనని కడియంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు తాను, తన భార్య సురేఖ తమ పదవులకు రాజీనామాలు చేశామని మురళి చెప్పారు. బయటి పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడు ఇజ్జత్‌ ఉంటే మీరు కూడా రాజీనామాలు చేయాలికదా? అని కడియంతోపాటు.. బస్వారాజు సారయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ‘పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. మొన్ననే నాదగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకున్నాడు’ అంటూ రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి నోరుపారేసుకున్నారు. రేవూరి శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. తన సొంత నియోజకవర్గమైన నర్సంపేట నుంచి కాకుండా పరకాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పరకాల నియోజకవర్గంలో రేవూరి, కొండా వర్గాల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పరకాల నియోజకవర్గంలో తన బిడ్డ కొండా సుస్మిత పటేల్ రంగ ప్రవేశం చేయనుందని మురళి ప్రకటించి, కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఇరకాటంలో పెట్టారు.

ఎస్కార్ట్‌ అంశంపై ప్రస్తావన

తనకు ఇటీవల పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చిన విషయంపై కూడా కొండా మురళి స్పందించారు. ఎస్కార్ట్ ఇచ్చిన విషయంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. వరంగల్ ఏసీపీ, మరో ఇద్దరు సీఐలకు మెమో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ పోలీసులపై చర్యలు తీసుకోవడం సరైనది కాదని మురళి అన్నారు. పోలీసుల్లో కొందరు కోవర్టులు ఉన్నారని, వారిపై సీపీ నిఘా పెట్టాలని కోరారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతదని కొందరు ప్రచారం చేస్తున్నారని అంటూ.. సురేఖ మంత్రి పదవి ఎక్కడికీ పోదని, తన వెంట రేవంతన్న, రాహుల్, సోనియా గాంధీ ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తాను బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్షకట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ మురళి ఉన్నంతవరకు రెండో నాయకుడు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఎవరూ అధైర్య పడొద్దంటూ హామీ ఇచ్చారు.