కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి, కనీసం వారికి ఇస్తామన్న రూ.2,500 రూపాయలు ఇస్తే లక్షాధికారులు అవుతారని, రాష్ట్రంలోని కోటి 68 లక్షల మందిఒక్కొక్క ఆడబిడ్డలకు ఖాతాల్లో లక్షన్నర వేస్తే శాశ్వతంగా రాజకీయల నుంచి వైదొలుగుతానని సవాలు విసురుతున్నానని.. ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి నా సవాలును స్వీకరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి మోసపోతే మోసం చేసినవాడి తప్పవుతుంది, కానీ పదే పదే కాంగ్రెస్ చేతిలో మోసపోకుండా మనం కలిసి కొట్లాడవలసిన అవసరం ఉందన్నారు. రాబందు పోవాలే, రైతుబంధు కేసీఆర్ రావాలన్న లక్ష్యంతో కలిసి పనిచేద్దాం అని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతుబంధు పడేది..
ఇప్పుడు ఓట్లప్పుడు రైతుబంధు పడుతుందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ఒకసారి, పంచాయితీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చి, ఇప్పటికి మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిండని కేటీఆర్ ఆరోపించారు.
అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారు..
అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతోని దళిత, గిరిజన పేదల భూములను గుంజుకుంటున్నారన్నారు. పరిగిలోను, పారిశ్రామికవాడల పేరుతోని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా భూములు గుంజుకుంటున్నదని ఆరోపించారు. లగచర్లలో రేవంత్ రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మర్చిపోవద్దు అని, కేవలం తమ భూములు ఇవ్వనందుకే వారి పైన పోలీస్ కేసులు పెట్టించి, వారిపైన దాడులు చేయించి వేధిస్తున్నాడని విమర్శించారు. గిరిజన బిడ్డలను జైలులో పెట్టారు. కనీసం గుండెపోటు వస్తే, ఆయనకి వైద్యం అందించకుండా బేడీలు వేసి మరీ తిప్పించారని, పరిగి నియోజకవర్గంలో అడ్డగోలుగా అసైన్ భూములు పేదల నుంచి లాక్కుంటామంటే ఒప్పుకునేదే లేదని, ఆ పేద ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందన్నారు.
అక్రమ కేసులు పెట్టిన వారిని వదలం..
పార్టీ కార్యకర్తలపైన అరాచకాలు, అక్రమ కేసులు పెడితే, ఆ పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఒకవేళ అధికారం ఉంది కదా అని అరాచకాలు చేస్తే, ఖచ్చితంగా వారిని రిటైర్ అయిన తర్వాత కూడా తీసుకువచ్చి, చట్టపరంగా ప్రస్తుతం చేస్తున్న అరాచకాలకు అనుగుణంగా శిక్షిస్తామని చెప్పారు. ఇక కార్యకర్తలకు సంబంధించిన భవిష్యత్తుపైన వారికి దక్కాల్సిన గౌరవం, పదవుల అంశంలో తాను బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ చేపడుతున్న ఎస్ఐఆర్‌తో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపైన శ్రేణులకు వివరాలు కేటీఆర్ అందజేశారు.