‘సర్’ (SIR) అంశం చాల సీరియస్ అంశం అని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం వారితో నిర్వహించిన జూమ్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సర్ చాలా సీరియస్ అంశం అని, కొందరు నాయకులు ఈ ప్రక్రియపై నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అవగాహన సదస్సులపై జిల్లాల వారీగా రిపోర్ట్ ఉంది, కాంగ్రెస్ తరుపున మరిన్ని సదస్సులు జరగాలని సూచించారు.
ఇంచార్జ్ మంత్రులు సర్ ప్రక్రియ పర్యవేక్షణపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సరిగా చేయకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని, పార్టీ అనుకూల ఓటర్ల ఓట్లు గల్లంతవుతాయన్నారు. పేదల ఓట్లు పోతే ఆధార్, రేషన్ కార్డులు పోతాయి, వాళ్లకు అన్యాయం జరగనివ్వొద్దు అని సూచించారు. పార్టీ ఆదేశాలు అందరూ పాటించాల్సిందేనని, ఆదేశాలు పట్టించుకోని వారి స్థానంలో మరొక ఇంచార్జ్‌ని నియమిస్తాం అని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించం, పని చేయకుండా పార్టీకి నష్టం కల్గిస్తే చూస్తూ ఊరుకోం అని తెలిపారు. 10 రోజుల సమయం ఇచ్చి చూస్తాం, పార్టీ సర్పంచ్‌లతో సర్ ప్రక్రియపై గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని సూచించారు.