ఆగస్టు 15 నుంచి తెలంగాణలో 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) 1.05 కోట్ల రేషన్ కార్డులను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 06, 2026, 1:22 pm IST
Read Time: 7 mins
ఆగస్టు 15 నుంచి తెలంగాణలో 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) 1.05 కోట్ల రేషన్ కార్డులను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రామాన్ని ప్రారంభంచబోతున్నారు. అదే రోజున 119 నియోజకవర్గాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ మేరకు నీటిపారుదల, ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు.

రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.

సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

స్వాతంత్య్ర  దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

అదే రోజు కొత్త పింఛన్లు కూడా..?

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సామాజిక భద్రత కల్పించే ‘చేయూత’ పింఛన్ల పంపిణీకి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు సిద్దమైంది. తొలిదశలో సుమారు 2.50 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా, జిల్లాల్లో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రులు లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్ అందజేసేలా ప్లాన్ చేశారు. అయితే, కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను ఖరారు చేశారు.

సీఎం ఆదేశాల మేరకు నేడో రేపో ఇందుకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సారి వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులతోపాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గతంలో 42 లక్షల పింఛన్లు ఉండగా, అనర్హుల ఏరివేత తర్వాత ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. ఇప్పుడు కొత్తగా మరో 2.50 లక్షల మందికి ఈ పథకంలో లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన (డిసెంబర్ 2023) నాటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా 1,23,625 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లను మంజూరు చేసింది. దీనికితోడు అదనంగా మరో రెండున్నర లక్షల చేయూత పింఛన్లను పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు.