భారత యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు విధించబోమని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ ప్రకటించారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడానికి ఉద్దేశించిన ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఎక్స్ వేదికగా సమీర్ నిగమ్ స్పందించారు. ఇండియన్స్‌కు యూపీఐ లావాదేవీలపై తాము ఎలాంటి రుసుంలు విధించబోమని స్పష్టత ఇచ్చారు. సాధారణ ప్రజలు లేదా వినియోగదారులు డబ్బులు పంపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మరోవైపు పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సైతం యూపీఐ చార్జీల ప్రచారంపై స్పందించింది. వినియోగదారులు, చిన్న వ్యాపారాలు ఇప్పటిలాగే యుపీఐ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని పీసీఐ వెల్లడించింది. డిజిటల్ చెల్లింపుల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరియు సాంకేతిక వ్యయాన్ని భరించేందుకు వ్యాపారాల పరంగా ఈ మార్పులు తెస్తున్నారే తప్ప, వినియోగదారులపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేసింది. కొత్త బిల్లుతో ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించడం గమనార్హం.