UPI Payment Failed ? | యూపీఐ లావాదేవీలు ఫెయిలైతే ఏం చేయాలి?
యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అయితే డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుంది? ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వినియోగదారులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక సమాచారం ఇది.
గతంలో మాదిరిగా మార్కెట్ వెళ్తే జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్లేవాళ్లం. కానీ, ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మార్కెట్ లో మనకు కావాల్సిన సరుకులు, వస్తువులు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తారు. ఒకవేళ యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అయితే ఏం చేయాలి? అసలు ఎందుకు యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అవుతాయి? యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అయితే తిరిగి ఆ నగదు మన బ్యాంకు ఖాతాలోకి వస్తుందా? ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేస్తే డబ్బు సురక్షితంగా మీకు తిరిగి వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
అసలు యూపీఐ పేమెంట్ అంటే ఏంటి?
యూపీఐ అంటే యూపీఐ అంటే.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అని అర్థం. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ పీ సీ ఐ ఈ వ్యవస్థను అభివృద్ది చేసింది. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీలు,డబ్బు బదిలీలకు వర్చువల్ చెల్లింపు చిరునామాగా పనిచేస్తుంది. యూపీఐ ఐడీ ప్రతి ఒక్క వినియోగదారుడికి వేరుగా ఉంటుంది. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మార్కెట్లో మీరు కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బులు చెల్లించేందుకు యూపీఐ ఐడీ ఉపయోగపడుతుంది. గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం వంటి యాప్ లు డౌన్ లోడ్ చేసుకొని వర్చువల్ పేమెంట్ అడ్రస్ ను క్రియేట్ చేసుకోవాలి. మీ యూజర్ నేమ్@ బ్యాంక్ పేరుతో వీపీఏ క్రియేట్ చేసుకొంటే అదే మీ యూపీఐ ఐడీ అని అంటారు. యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకుగాను కొన్ని బ్యాంకులు నాలుగు, మరికొన్ని బ్యాంకులు ఆరు నెంబర్లతో పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తాయి. మీరు యూపీఐ ద్వారా మరొకరికి డబ్బును పంపే సమయంలో ఈ పిన్ నెంబర్ ను నమోదు చేసిన తర్వాతే డబ్బులు బదిలీ అవుతాయి. మీ డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టు మీకు స్క్రీన్ పై వివరాలు కన్పిస్తాయి.
యూపీఐ లావాదేవీ ఎలా చేయాలి?
మీరు డబ్బు పంపే వ్యక్తి ఫోన్ నెంబర్ ఉంటే స్మార్ట్ ఫోన్ ద్వారా యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయవచ్చు. లేదా మీరు డబ్బును పంపాల్సిన వారి బ్యాంక్ ఖాతా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు పంపవచ్చు. యూపీఐ ద్వారా నిధుల బదిలీ సజావుగా సాగుతుంది. లావాదేవీలు సులభం అవుతాయి. సురక్షితంగా, సకాలంలో పేమెంట్ అవుతాయి. ఒక్క రోజులో 1 లక్ష రూపాయాలు కూడా డబ్బులు బదిలీ చేయవచ్చు.
యూపీఐ లావాదేవీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి?
ఏ సందర్బాల్లో యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అవుతాయో తెలుసుకుంటే… అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడుతాం. మనం డబ్బులు పంపే వారి యూపీఐ ఐడీ తప్పుగా నమోదు చేయడం, లేదా యూపీఐ పిన్ నెంబర్ తప్పుగా నమోదు చేయడంపై లావాదేవీలు ఫెయిల్ అవుతాయి. మీరు డబ్బులు పంపే వ్యక్తి బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కొడ్ తప్పుగా నమోదు చేసినా… కూడా లావాదేవీలు జరగవు. డబ్బులు పంపే సమయంలో ఒకటికి రెండుసార్లు అన్ని అంశాలను చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే డబ్బులు పంపాలి. మీ బ్యాంక్ ఖాతాలో సరిపోను నిధులు లేదా డబ్బులు లేకపోవడం కూడా ఇందుకు కారణమే. యూపీఐ యాప్, మీ బ్యాంక్ బ్యాకెండ్ సిస్టమ్ లేదా ఎన్ పీ సీఐలో సాంకేతిక సమస్యలు రావడంతో లావాదేవీలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. యూపీఐ లావాదేవీలు చేసే సమయంలో ఇంటర్నెట్ కనెన్షన్ అవసరం. ఇంటర్నెట్ లో అంతరాయం ఉన్నా కూడా యూపీఐ లావాదేవీల్లో అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని బ్యాంకులు కాలానుగుణంగా పిన్ రీసెట్ చేసుకోవాలని సూచిస్తాయి. ఒకవేళ మీ పిన్ గడువు ముగిసిపోయినా కూడా లావాదేవీలు జరగవు. రోజువారీ లావాదేవీలు పరిమితి మించిపోతే ఆ లావాదేవీ జరగదు.
యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అయితే ఏం చేయాలి?
యూపీఐ లావాదేవీలు కొన్ని సమయాల్లో ఫెయిల్ అవుతాయి. మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు కట్ అవుతాయి. కానీ, మనం డబ్బులు పంపిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు చేరవు. సాధారణంగా ఇలాంటి సమస్యలు 24 గంటలు లేదా 48 గంటల్లో పరిష్కారం అవుతాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ సమస్య పరిష్కారం కాదు. అప్పడు ఏం చేయాలి. ఈ విషయమై మీరు వెంటనే మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేయాలి. ఒక్కసారి యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయితే మళ్లీ మళ్లీ లావాదేవీలు చేయవద్దు. నెట్ వర్క్ సమస్య లేదా బ్యాంక్ సర్వర్ సమస్యతోనో ఇలా లావాదేవీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక మీరు చేసిన లావాదేవీ సక్సెస్ కాకపోతే యూపీఐ యాప్ హిస్టరీలోకి వెళ్లి చెక్ చేయాలి. అందులో లావాదేవీ ఫెయిల్ అయిందా, రిజెక్ట్ అయిందా అనే విషయం ఉంటుంది. లేదా మీ ఏటీఎంలో మినీ స్టేట్ మెంట్ తీసుకొంటే అందులో లావాదేవీ సక్సెస్ అయిందో కాలేదో తెలుస్తుంది. లావాదేవీ ఫెయిల్ అయి మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయితే మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ లో ఫిర్యాదు చేయాలి. లేదా బ్యాంకులో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్ పీ సీఐ హెల్ప్ లైన్ ను కూడా ఆశ్రయించవచ్చు. యూపీఐ లావాదేవీ ఫెయిలైన వివరాలను మీ బ్యాంక్ కస్టమర్ కేర్ కు అందించాలి. లేదా ఎన్ పీ సీఐ హెల్ప్ లైన్ లో కూడా అందించాలి. లావాదేవీ జరిగిన తేదీ, సమయం, లావాదేవీ మొత్తం వంటి వివరాలను అందించాలి. దీని ఆధారంగా అధికారులు ఫెయిలైన లావాదేవీలకు సంబంధించిన డబ్బును తిరిగి రీఫండ్ అయ్యేలా చూస్తారు.
యూపీఐ లావాదేవీలు ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
యూపీఐ లావాదేవీలు ఫెయిల్ కాకుండా ఉండాలంటే మీ యాప్ ను అప్ డేట్ గా ఉంచాలి. తగినంత బ్యాలెన్స్ ఉండాలి. ఇంటర్నెట్ లో అంతరాయం లేకుండా ఉండాలి. యూపీఐ పిన్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. మీరు డబ్బులు పంపే వ్యక్తి బ్యాంక్ ఖాతా వివరాలను ఒక్కటికి రెండు సార్లు చెక్ చేయాలి. పీక్ అవర్స్ లో, నెట్ వర్క్ రద్దీగా ఉంటే కూడా యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అవుతాయి. యాప్ అప్ డేట్ చేయకపోయినా కూడా లావాదేవీలు సక్రమంగా జరగవు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram