గంగిరెద్దుకూ ఉంది..ఓ యూపీఐ!
హైదరాబాద్‌లో గంగిరెద్దుల ప్రదర్శకులు తమ గంగిరెద్దు కొమ్ములకు యూపీఐ (UPI) స్కానర్‌ను బిగించి విరాళాలు అడగడం వైరల్‌గా మారింది. ఇది భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నిదర్శనంగా నిలిచింది.

విధాత : దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తుంది. నగదు చెల్లింపు క్రమంగా తగ్గిపోయి..ప్రజలంతా యూపీఐ డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. చివరకు కూరగాయాల వ్యాపారులు..వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వారు సైతం యూపీఐ డిజిటల్ పేమెంట్ల వైపు మళ్లిపోయారు. అందుకేనేమో దేశంలో యూపీఐ డిజిట్ చెల్లింపులు ఓ విప్లవం మాదిరిగా మారిపోగా.. 85శాతంకు పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి.
ఇదంతా బాగానే ఉన్నా…యూపీఐ చెల్లింపుల పరంపరలో గంగిరెద్దుల వారు కూడా చేరిపోయిన తీరు దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి సంకేతంగా నిలిచింది. డిజిటల్ లావాదేవిల పర్వంలో మేం సైతం అంటూ గంగిరెద్దులను ఆడించేవారు..నేను సైతం అంటూ గంగిరెద్దు యూపీఐ స్కానర్ తో దర్శనమిచ్చిన తీరు ఆర్థిక నిపుణులను కూడా విస్మయ పరిచింది. దీపావళి పర్వదినం వేళ హైదరాబాద్ నగరంలో హబ్సీగూడ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి నగదు, సరుకులు అడుక్కుంటున్న గంగిరెద్దుల ప్రదర్శకులు యూపీఐ స్కానర్ వినియోగంతో అశ్చర్యపరిచారు. గంగిరెద్దు కొమ్ములకు యూపీఐ స్కానర్ బిగించి..నగదు లేని వారు తాము ఇవ్వాలనుకున్న డబ్బులను డిజిటల్ చెల్లింపు చేయవచ్చంటూ అభ్యర్థించారు. ఈ వ్యవహరం చూసిన వారు దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగం సాధించిన అభివృద్దికి ఇది నిదర్శనంగా ఉందంటూ ప్రశంసించారు. దేశంబు మారింది..కాలంబు మారింది అంటే ఇదేనేమో అంటూ గంగిరెద్దుల వారి ఆప్డేట్ ను..ముందుచూపును మెచ్చుకుంటున్నారు. యూపీఐ స్కానర్ వినియోగంపై గంగిరెద్దుల ప్రదర్శకులు స్పందిస్తూ..మెజార్టీ ప్రజలు తమ వద్ద నగదు, చిల్లర లేదంటుండటంతో..ఇలాగైతే తమ జీవితం గడవదని భావించి మేం కూడా యూపీఐ స్కానర్ వినియోగించాలని నిర్ణయించామన్నారు. యూపీఐ స్కానర్ పెట్టుకున్నాక.. మాకు ఎవరైన డబ్బులు ఇవ్వాలనుకునే వారు ఇబ్బంది లేకుండా డబ్బులు చెల్లిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేయడం విశేషం.